Share News

ఇరాన్‌ ఒప్పందానికి రాకుంటే..ఖార్గ్‌ను పేల్చేస్తాం

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:07 AM

ఇరాన్‌ గనక తమతో త్వరలో ఒప్పందం కుదుర్చుకొని, హోర్ముజ్‌ జలసంధిని తెరవకపోతే.. ఆ దేశానికి అత్యంత కీలకమైన ఖార్గ్‌ దీవిని, చమురు బావులను, ఇరాన్‌ విద్యుదుత్పత్తి కేంద్రాలను పేల్చేస్తామని, సర్వనాశనం చేసేస్తామని అమెరికా....

ఇరాన్‌ ఒప్పందానికి రాకుంటే..ఖార్గ్‌ను పేల్చేస్తాం

  • చమురు బావులు, విద్యుత్‌ కేంద్రాలను కూడా!

  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరిక

  • యుద్ధ సమయంలో తనకు అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన మొజ్తబా ఖమేనీ

  • ఇరాన్‌ భారజల కేంద్రం ధ్వంసం

  • తిరిగి వినియోగంలోకి తెచ్చే అవకాశాల్లేవ్‌

  • అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ వెల్లడి

  • పాక్‌ మధ్యవర్తిత్వానికి ఒప్పుకోం.. ఇరాన్‌ స్పష్టీకరణ

వాషింగ్టన్‌, టెహ్రాన్‌: ఇరాన్‌ గనక తమతో త్వరలో ఒప్పందం కుదుర్చుకొని, హోర్ముజ్‌ జలసంధిని తెరవకపోతే.. ఆ దేశానికి అత్యంత కీలకమైన ఖార్గ్‌ దీవిని, చమురు బావులను, ఇరాన్‌ విద్యుదుత్పత్తి కేంద్రాలను పేల్చేస్తామని, సర్వనాశనం చేసేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సోమవారం హెచ్చరించారు. ఈ మేరకు తన సొంత సోషల్‌ మీడియా ‘ట్రూత్‌ సోషల్‌’లో ఆయన ఒక పోస్టు పెట్టారు. ‘‘ఇరాన్‌లో మా సైనికచర్యను ముగించడానికి.. ఒక కొత్త, మరింత హేతుబద్ధమైన ప్రభుత్వంతో అమెరికా చర్చలు జరుపుతోంది. ఈ చర్చల్లో గొప్ప పురోగతి కనిపిస్తోంది. ఒకవేళ ఏదైనా కారణం చేత ఒప్పందం త్వరలో కుదరకపోతే (కుదిరే అవకాశం ఉంది).. వాణిజ్య కార్యకలాపాల నిమిత్తం హోర్ముజ్‌ జలసంధి తక్షణం తెరుచుకోకపోతే.. మేం ఇంతవరకూ తాకని వారి (ఇరాన్‌) విద్యుదుత్పత్తి కేంద్రాలను, చమురు బావులను, ఖార్గ్‌ దీవిని, ఉప్పునీటిని మంచినీరుగా మార్చే అన్ని డీశాలినైజేషన్‌ కేంద్రాలను పేల్చివేసి, పూర్తిగా నాశనం చేసి.. ఇరాన్‌లో మా గొప్ప బసను ముగిస్తాం’’ అని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు. గత 47 ఏళ్ల భీకర పాలనలో ఇరాన్‌ అత్యంత క్రూరంగా చంపేసిన అమెరికన్‌ సైనికులు, ఇతరుల మరణాలకు ఇది ప్రతీకారం అని వివరించారు. అంతకు ముందు పెట్టిన మరో పోస్టులో.. ‘‘ఇరాన్‌లో ఇది చాలా పెద్దరోజు. ఆ దేశంలోని.. ‘చాలాకాలంగా వేచిచూస్తున్న అనేక లక్ష్యాల’ను ప్రపంచంలోనే అత్యుత్తమమైన, అత్యంత శక్తిమంతమైన, మా గొప్ప సైన్యం తుడిచిపెట్టింది’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. అంతకుముందు అధ్యక్షుడి అధికారిక విమానమైన ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ లో విలేకరులతో మాట్లాడుతూ.. ఇరాన్‌లో పాలనమార్పును సాధించినట్టు ట్రంప్‌ పేర్కొన్నారు. త్వరలోనే ఇరాన్‌తో ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తాను భావిస్తున్నట్టు తెలిపారు. చర్చలు సానుకూలంగా సాగుతున్నాయనడానికి గుర్తుగా ఇరాన్‌ సోమవారం 20 పాకిస్థానీ చమురు నౌకలను హోర్ముజ్‌ గుండా వెళ్లడానికి అనుమతించిందని చెప్పారు. అలాగే.. ఫైనాన్షియల్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఇరాన్‌లోని చమురును స్వాధీనం చేసుకోవడమే తమ ప్రాధాన్యం అని.. ఖార్గ్‌ను తాము స్వాధీనం చేసుకోవచ్చు లేదా చేసుకోకపోవచ్చు అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇక.. ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా నియమితులైన మొజ్తబా ఖమేనీ బతికే ఉన్నారో లేదో తమకు తెలియదంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. ఈ యుద్ధంలో తనకు అండగా నిలిచిన అత్యున్నత మతగురువులుకు, ఇరాన్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ మొజ్తబా ఆదివారం ఒక సందేశాన్ని విడుదల చేశారు.


ఇజ్రాయెల్‌కు అమెరికా మిలిటరీ బేస్‌లు?

ఇరాన్‌ దాడిలో గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా మిలిటరీ బేస్‌లన్నీ ధ్వంసం కావటంతో.. ఈ పరిణామాన్ని తనకు అవకాశంగా మలుచుకొనేందుకు ఇజ్రాయెల్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఖతార్‌, బహ్రెయిన్‌, యూఏఈ తదితర దేశాల్లోని బేస్‌లన్నింటినీ తమ దేశానికి తరలించాలని అమెరికాకు ఇజ్రాయెల్‌ విజ్ఞప్తి చేసినట్లు అమెరికా మీడియా పేర్కొంది. అందుకు అమెరికా అంగీకరిస్తే.. భవిష్యత్తులో ఇజ్రాయెల్‌కు సైనికపరంగా మరింత భద్రత లభిస్తుంది. ఇరాన్‌పై అమెరికా దాడికి ప్రతీకారంగా ఇరాన్‌ తన పొరుగున ఉన్న దేశాల్లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై భీకరంగా దాడులు చేసింది. ఖతార్‌లోని అల్‌ ఉదైద్‌, బహ్రెయిన్‌లోని ఫిఫ్త్‌ ఫ్లీట్‌, యూఏఈలోని అల్‌ దఫ్రా బేస్‌లను మరింత సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని అమెరికా కూడా ఆలోచిస్తోందని, వార్తలు వెలువడుతున్నాయి.

Updated Date - Mar 31 , 2026 | 05:07 AM