ఇరాన్‌పై దాడులు ఆపేస్తున్నా
ABN , Publish Date - Aug 03 , 2026 | 05:41 AM
ఇరాన్‌తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర గందగోళ ప్రకటనలు చేస్తున్నారు. ఇరాన్‌పై దాడులను నిలిపివేస్తున్నట్లు శనివారం రాత్రి ట్రూత్ సోషల్‌లో ఆయన ప్రకటించారు...
ఆ దేశంతో శాంతి ఒప్పందం కొలిక్కి వస్తోంది
మా షరతులకు ఇరాన్ అంగీకరించింది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
క్షిపణులు లోడ్ చేసే ఉన్నాయని అంతలోనే హెచ్చరిక
నేరుగా యుద్ధం చేసే దమ్ము లేకనే ట్రంప్ మానసిక యుద్ధం: ఇరాన్
వాషింగ్టన్, ఆగస్టు 2: ఇరాన్‌తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర గందగోళ ప్రకటనలు చేస్తున్నారు. ఇరాన్‌పై దాడులను నిలిపివేస్తున్నట్లు శనివారం రాత్రి ట్రూత్ సోషల్‌లో ఆయన ప్రకటించారు. అంతలోనే ఇరాన్ వైపు దూసుకుపోయేందుకు తమ క్షిపణులు, యుద్ధ విమానాలు లోడ్‌చేసి సిద్ధంగా ఉన్నాయని మరో హెచ్చరిక చేశారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై చర్చలు కొలిక్కి వచ్చాయని, అందుకే ఇకపై దాడులు చేయరాదని పశ్చిమాసియాలోని తమ బలగాలకు ఆదేశాలిచ్చినట్లు శనివారం రాత్రి ట్రంప్ వెల్లడించారు. ‘మధ్య ఆసియా భాగస్వాముల విజ్ఞప్తి మేరకు 5నెలలుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని నిర్ణయం తీసుకున్నాను. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కొలిక్కి వస్తోంది. ఆ ఒప్పందంలో ఇరాన్ హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవటం, అణుకార్యక్రమాన్ని వదిలేయటం అనే షరతులు కూడా ఉంటాయి. ఇరాన్ భవిష్యత్తుతోపాటు ప్రపంచ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారి విన్నపానికి ఒప్పుకున్నాను. ఇరాన్‌పై తాజా దాడుల ప్రణాళికను నిలిపేస్తున్నాను’ అని తెలిపారు. ఆదివారం మరో ప్రకటన చేస్తూ.. ‘మా క్షిపణులు, యుద్ధ విమానాలు లోడ్‌చేసి సిద్ధంగా ఉన్నాయి’ అని ఇరాన్‌ను హెచ్చరించారు.
నేరుగా యుద్ధం చేయలేకనే: ఇరాన్
ట్రంప్ సంధి ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. అమెరికాతో ఎలాంటి ఒప్పందం కుదరలేదని, హోర్ముజ్, అణుకార్యక్రమం విషయంలో ఆయన ప్రకటన పూర్తిగా అబద్ధమని ఇరాన్ రక్షణ మంత్రి మాజిద్ ఎబ్న్ ఇ రెజా ఆదివారం ఎక్స్‌లో ప్రకటించారు. ‘మాపై సైన్యంతో యుద్ధంచేసే స్థితిలో అమెరికా ఇప్పుడు లేదు. అందుకే నేరుగా యుద్ధం చేయకుండా ట్రంప్ మానసిక యుద్ధానికి దిగారు’ అని ఎద్దేవా చేశారు. అయితే, ఈ రెండు దేశాల మధ్య పరోక్ష చర్చలు సానుకూలంగానే సాగుతున్నాయని చర్చల్లో పాల్గొంటున్న ఒక అధికారి తెలిపారు. ఇరాన్-అమెరికా యుద్ధం ముగింపునకు ఒకవైపు చర్చల ప్రయత్నాలు జరుగుతుండగా.. గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. శనివారం రాత్రి జరిపిన వైమానిక దాడుల్లో 8 మంది పౌరులు మరణించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు, ఒక ఆరు నెలల గర్భిణి కూడా ఉన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..
వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..