ఆ దేశ అత్యున్నత పదవి ఇస్తామన్నారు.. నేనే తిరస్కరించా: ట్రంప్
ABN , Publish Date - Mar 27 , 2026 | 04:45 AM
దాదాపు నెల రోజులుగా జరుగుతున్న అమెరికా- ఇరాన్ యుద్ధం విరమణ కోసం పరోక్షంగా చర్చలు జరుగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు తదుపరి సుప్రీం లీడర్‌గా తనను నియమిస్తామని చెప్పారని..
నేనే ఆ ప్రతిపాదనను తిరస్కరించా
ఒప్పందం కోసం ఇరాన్ అడుక్కుంటోంది
వాళ్ల మధ్యవర్తుల ప్రవర్తన విచిత్రంగా ఉంది
మాతో చర్చలు జరుపుతూనే..అలాంటిదేమీ లేదంటున్నారు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు
ఇజ్రాయెల్ హిట్‌లిస్టు నుంచి ఇద్దరు ఇరాన్ నేతల మినహాయింపు
వాషింగ్టన్, మార్చి 26: దాదాపు నెల రోజులుగా జరుగుతున్న అమెరికా- ఇరాన్ యుద్ధం విరమణ కోసం పరోక్షంగా చర్చలు జరుగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు తదుపరి సుప్రీం లీడర్‌గా తనను నియమిస్తామని చెప్పారని.. కానీ, తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించానని వెల్లడించారు. బుధవారం రాత్రి నిర్వహించిన నేషనల్ రిపబ్లికన్ కాంగ్రెషనల్ కమిటీ విందులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వాళ్లు (ఇరాన్) అనధికారికంగా మా ముందు స్పష్టమైన ప్రతిపాదన పెట్టారు. వారి తదుపరి సుప్రీంలీడర్‌గా నన్ను నియమిస్తామని చెప్పారు. కానీ, నాకు ఆ పదవి అవసరం లేదని చెప్పాను’ అని పేర్కొన్నారు. ఇరాన్‌తో పరోక్షంగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. సైనికపరంగా ఇరాన్‌ను ఇప్పటికే పూర్తిగా నాశనం చేశామని, ఇక ఆ దేశం కోలుకునే పరిస్థితి లేదని అన్నారు. ‘మనం భారీ విజయం సాధించబోతున్నాం. వాళ్లు భయపడుతున్నారు. అందుకే చర్చలకు వచ్చారు. ఒప్పందం కోసం అడుక్కుంటున్నారు. సొంత ప్రజలనే చంపుకోవాల్సి వస్తుందని భయపడుతున్నారు’ అని ట్రంప్ పేర్కొన్నారు.
చర్చలు జరుపుతూనే.. లేదంటున్నారు
ఇరాన్ తమతో చర్చలు జరుపుతూనే.. బయటకు మాత్రం అలాంటిదేమీ లేదని ఖండిస్తోందని ట్రంప్ విమర్శించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో ఆయన ఓ పోస్టు పెట్టారు. ‘ఇరాన్ ప్రతినిధులు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. డీల్ కోసం ఒకవైపు మమ్మల్ని అడుక్కుంటూ.. బయటకు మాత్రం అమెరికా ప్రతిపాదనల కోసం ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు. వాళ్ల ప్రకటన పూర్తిగా తప్పు. ఆలస్యం కాకముందే చర్చల గురించి సీరియ్‌సగా ఆలోచించుకోవాలి. లేదంటే వారికి మళ్లీ తిరిగి చూసే అవకాశం రాకపోవచ్చు’ అని ట్రంప్ హెచ్చరించారు. గురువారం క్యాబినెట్ భేటికి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలోనూ ఆయన ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. యుద్ధ విరమణ ఒప్పందానికి త్వరపడుతున్నది ఇరానేనని.. తాము కాదని తెలిపారు. వెనెజువెలా అధ్యక్షుడు నికొల స్ మదురోను అమెరికా అపహరించిన సమయంలో కూడా.. ఆ దేశానికి తానే అధ్యక్షుడిని అవుతానని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్‌లోని కీలక నాయకులందరినీ చంపివేస్తూ వస్తున్న ఇజ్రాయెల్.. ఇద్దరిని మాత్రం మినహాయించినట్లు సమాచారం. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి, ఆ దేశ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖలీబా్‌ఫలను తన హిట్‌లిస్టు నుంచి తప్పించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. పాకిస్థాన్ విజ్ఞప్తితో ఈ ఇద్దరు నేతలను చంపబోమని అమెరికా హామీ ఇచ్చిందని, దీంతో ఇజ్రాయెల్ కూడా వారిని తన హిట్‌లిస్టు నుంచి తప్పించిందని తెలిపింది. ఈ ఇద్దరు నేతలను కూడా చంపివేస్తే చర్చలు జరపడానికి ఇరాన్ తరఫున ఎవరూ ఉండరని చెప్పి పాకిస్థాన్ ఒప్పించిందని అమెరికా అధికార వర్గాలు తెలిపాయి.