చర్చలకు వెళ్తాం.. మేము రాం!
ABN , Publish Date - Apr 20 , 2026 | 06:18 AM
హోర్ముజ్ జలసంధిని తెరిచే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌తో చర్చల పునరుద్ధరణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుముఖత వ్యక్తంచేయగా..
తమ ప్రతినిధులు పాకిస్థాన్‌కు వెళ్తున్నట్లు ట్రంప్ ప్రకటన.. చర్చలకు తాము రావటం లేదని ఇరాన్ వెల్లడి
హోర్ముజ్ జలసంధిని తెరిచే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌తో చర్చల పునరుద్ధరణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుముఖత వ్యక్తంచేయగా.. ఇరాన్ తిరస్కరించింది. బెదిరింపులతో చర్చలు సాధ్యం కాదని తెగేసి చెప్పింది. ఇరాన్‌తో రెండో దఫా చర్చల కోసం తమ ప్రతినిధులు సోమవారం పాకిస్థాన్‌కు వెళ్తారని ట్రంప్ ఆదివారం సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. ‘హోర్ముజ్ జలసంధిలో నిన్న (శనివారం) కొన్ని నౌకలపై ఇరాన్ కాల్పులు జరిపింది. ముఖ్యంగా ఫ్రెంచ్, బ్రిటన్ నౌకలను లక్ష్యంగా చేసుకుంది. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు కదా? ఇరాన్‌తో ముఖాముఖి చర్చలు జరిపేందుకు సోమవారం సాయంత్రం మా ప్రతినిధులు ఇస్లామాబాద్‌కు వెళ్తున్నారు. హోర్ముజ్ జలసంధిని మూసేశామని ఇరాన్ ఇటీవల ప్రకటించింది. విచిత్రం ఏమిటంటే.. మేము ఎప్పుడో దానిని మూసేశాం. వారికి తెలియకుండానే జలసంధిని మూసివేయటంలో మాకు సహాయం చేస్తున్నారు. జలసంధిని మూసివేయటం వల్ల ఇరాన్ రోజుకు రూ.4,600 కోట్లకు పైగా నష్టపోతోంది. మాకు మాత్రం ఏ నష్టమూ లేదు. పైగా చమురు కోసం ప్రపంచం నలుమూలల నుంచి నౌకలు మా దేశానికి వస్తున్నాయి. ఇంత సహాయం చేస్తున్నందుకు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ)కి కృతజ్ఞతలు. మేము ఇరాన్‌కు చాలా మంచి ఒప్పంద ప్రతిపాదన పంపాం. ఈ డీల్‌కు వారు ఒప్పుకుంటారనే అనుకుంటున్నా. లేదంటే.. ఇరాన్‌లోని ప్రతి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని, ప్రతి వంతెనను ధ్వంసం చేస్తాం. అంతకు మించి ఏమీ ఉండదు మిస్టర్ నైస్ గయ్ (వ్యంగ్యంగా).. వాళ్లు (ఇరాన్) తేలిగ్గా, త్వరగా దిగివస్తారు. డీల్‌కు వాళ్లు ఒప్పుకోకపోతే ఇరాన్ విషయంలో గత 47 ఏళ్లుగా అమెరికా అధ్యక్షులెవరూ చేయలేకపోయిన పనిని చేయటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తా. ఇరాన్ హంతక పాలనను అంతం చేసేందుకు సమయం ఆసన్నమైంది’ అని ట్రంప్ హెచ్చరించారు. కాగా, ట్రంప్ చర్చల ప్రకటన చేయకముందే పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామాబాద్‌లో భద్రతను అసాధారణంగా పెంచింది.
చర్చలకు మేము రాం:ఇరాన్
ట్రంప్ చర్చల ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. ఒకవైపు దాడులు చేస్తామని బెదిరిస్తూ.. బలవంతంగా చర్చలకు రావాలని అనటం చిన్నపిల్లల చేష్టల్లా ఉందని ఇరాన్ ఒకటవ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రజా ఆరెఫ్ విమర్శించారు. చర్చలకు తమదేశ ప్రతినిధులు ఎవరూ వెళ్లటం లేదని ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ ఆదివారం రాత్రి ప్రకటించింది. అమెరికా డిమాండ్లు అలవిగాకుండా ఉన్నాయని ఆరెఫ్ మండిపడ్డారు. అణు ఇంధనంపై ఇరాన్ చట్టబద్దమైన హక్కులను ఎవరూ అడ్డుకోలేరని ఆ దేశాధ్యక్షుడు పెజెష్కియాన్ అంతకుముందు స్పష్టంచేశారు.
మీరే అనుమతి ఇచ్చి కాల్పులు జరుపుతారా?
హోర్ముజ్ జలసంధిని దాటేందుకు భారత నౌకలు శనివారం ప్రయత్నించగా, ఇరాన్ నేవీ కాల్పులు జరపటంపై మన ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. అయితే, కాల్పులు జరిపిన సమయంలో ఒక నౌకలోని సిబ్బంది ఇరాన్ నేవీతో సంప్రదింపులకు ప్రయత్నించిన ఆడియోను అమెరికా మీడియా ఆదివారం బయటపెట్టింది. భారత పతాకం ఉన్న సన్మర్ హెరాల్డ్, జగ్ అర్నవ్ నౌకలపై ఇరాన్ గన్ బోట్లతో కాల్పులు జరిపింది. ఆ సమయంలో సన్మర్ హెరాల్డ్‌లోని ఓ నావికుడు ఇరాన్ నేవీ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించాడు. ‘సెపా నేవీ.. సెపా నేవీ.. మేము మోటార్ ట్యాంకర్ సన్మర్ హెరాల్డ్ నుంచి మాట్లాడుతున్నాం. మేము వెళ్లేందుకు మీరే అనుమతి ఇచ్చారు. మీరు అనుమతి ఇచ్చిన నౌకల జాబితాలో రెండోపేరు మాదే. ఇప్పుడు మీరే కాల్పులు జరుపుతున్నారు. మేము వెనక్కు తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి’ అని కోరటం ఆ ఆడియోలో రికార్డయ్యింది. కాగా, దేశ్ గరిమా అనే భారతీయ చమురు నౌక శనివారం సురక్షితంగా జలసంధిని దాటి భారత్‌వైపు వస్తోంది. ఇది ఈ నెల 22వ తేదీన ముంబైకి చేరుకొనే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా జలసంధిలో ఫ్రెంచ్, బ్రిటన్ నౌకలపై మాత్రమే ఇరాన్ కాల్పులు జరిపిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియా సమావేశంలో తెలిపారు. భారత నౌకలపై కూడా కాల్పులు జరిగాయి కదా అని ఒక జర్నలిస్టు ప్రశ్నించగా.. ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన.. ‘గెట్ అవుట్’ అని ఆ జర్నలిస్టును బెదిరించారు.
ఈ వార్తలనూ చదవండి:
శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ
భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో