Share News

ఒప్పందమా.. వినాశనమా.. గడువు 48 గంటలే

ABN , Publish Date - Apr 05 , 2026 | 06:28 AM

వెంటనే ఒప్పందానికి రావాలని లేదా హోర్ముజ్‌ జలసంధిని తెరవాలని.. లేకుంటే ఇరాన్‌కు నరకం చూపిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. సమయం దగ్గరపడుతోందని...

ఒప్పందమా.. వినాశనమా.. గడువు 48 గంటలే

ఇరాన్‌కు ట్రంప్‌ హెచ్చరిక

సమయం ముంచుకొస్తోంది..

హోర్ముజ్‌ను తెరవాలని స్పష్టీకరణ

ఇరాన్‌లోని బుషెహర్‌ అణు విద్యుత్‌

కేంద్రంపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌

రేడియేషన్‌ వెలువడటం లేదు: ఐఏఈఏ

ఇరాన్‌ ఎల్పీజీ, పెట్రో పరిశ్రమలపైకి

అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు

ఒక సిమెంటు ఫ్యాక్టరీ కూడా ధ్వంసం

ఇది గల్ఫ్‌కు మరణశాసనమే!

ఇరాన్‌ విదేశాంగ మంత్రి అరాగ్చీ

దుబాయ్‌/వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 4: వెంటనే ఒప్పందానికి రావాలని లేదా హోర్ముజ్‌ జలసంధిని తెరవాలని.. లేకుంటే ఇరాన్‌కు నరకం చూపిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. సమయం దగ్గరపడుతోందని స్పష్టం చేశారు. ఇక ఇరాన్‌లోని కీలకమైన బుషెహర్‌ అణు విద్యుత్‌ కేంద్రంపై మరోసారి దాడి జరిగింది. అణు రియాక్టర్‌కు సమీపంలోని భవనం ధ్వంసమై ఫిజికల్‌ ప్రొటెక్షన్‌ సర్క్యూట్‌ దెబ్బతిన్నది. ప్లాంటు భద్రతా సిబ్బంది ఒకరు మృతిచెందారు. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) కూడా ఈ దాడిని ధ్రువీకరించింది. ప్రధాన రియాక్టర్‌కు ఎలాంటి నష్టం జరగలేదని, అణు ధార్మికత ఏదీ వెలువడటం లేదని ప్రకటించింది. బుషెహర్‌ అణు ప్లాంటుపై ఇది నాలుగో దాడి కావడం గమనార్హం. బుషెహర్‌ అణు కేంద్రంపై దాడి అత్యంత దుర్మార్గమైన చర్య అని రష్యా మండిపడింది. ఒకవేళ క్షిపణులు రియాక్టర్‌ను ఢీకొని పేలిపోయి ఉంటే, దారుణమైన ప్రమాదం జరిగి ఉండేదని ప్లాంటు నిర్వహణ సంస్థ రోసటామ్‌ చీఫ్‌ లిఖచేవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాంటుపై దాడి జరిగిన 20 నిమిషాల్లోనే నిపుణులను అక్కడి నుంచి తరలించినట్టు వెల్లడించారు. హోర్ముజ్‌ జలసంధికి సమీపంలోఉండే బుషెహర్‌ పట్టణం ఇరాన్‌కు ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతం. అక్కడ అణు విద్యుత్‌ కేంద్రం, వివిధ రకాల పరిశ్రమలతోపాటు ఇరాన్‌ మిలిటరీ స్థావరాలు కూడా ఉన్నాయి. దీనితో యుద్ధం మొదలైనప్పటి నుంచీ అమెరికా, ఇజ్రాయెల్‌ తరచూ బుషెహర్‌ లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. మరోవైపు కొన్ని రోజులుగా పరస్పర దాడులు ఉధృతమవుతున్నాయి. ఇరాన్‌ను లొంగదీసుకోవాలన్న ఉద్దేశంతో.. ఆ దేశంలోని మౌలిక సదుపాయాలు, కీలక పరిశ్రమలనూ లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఇప్పటికే కీలకమైన రెండు ఉక్కు కర్మాగారాలు, భారీ ఫార్మా కంపెనీ, కీలకమైన వంతెన, పలు విద్యుత్‌ సరఫరా వ్యవస్థలను ధ్వంసం చేయగా... తాజాగా పెట్రో, రసాయన పరిశ్రమలపై వైమానిక దాడులు చేసింది. ఖుజెస్థాన్‌ రీజియన్‌లోని మషహర్‌ సెజ్‌లో ప్రభుత్వ బందర్‌ ఇమామ్‌ కాంప్లెక్స్‌తోపాటు మరో రెండు పెట్రోకెమికల్‌ ప్లాంట్లపై ఇజ్రాయెల్‌, అమెరికా వైమానిక దాడులు జరిగాయని, ఐదుగురు చనిపోయారని మెహర్‌ వార్తా సంస్థ తెలిపింది. ఇక హెర్మోజ్‌గన్‌ ప్రావిన్స్‌లో బందర్‌ ఖమీర్‌ సిమెంటు ఫ్యాక్టరీపై దాడులు జరిగాయి.


ఆ పైలట్‌ కోసం వేట!

ఇరాన్‌ కూల్చివేసిన ఎఫ్‌-15ఈ యుద్ధ విమానం పైలట్‌ కోసం వేట కొనసాగుతోంది. అటు అమెరికా, ఇటు ఇరాన్‌ కూడా సదరు పైలట్‌ కోసం తీవ్రస్థాయిలో గాలిస్తున్నాయి. పైలట్‌ను ప్రాణాలతో పట్టుకుంటే భారీగా బహుమతి ఇస్తామన్న ఇరాన్‌ అధికారుల ప్రకటనలతో స్థానిక గిరిజనులు కూడా విస్తృతంగా వెతుకుతున్నారు. ఎఫ్‌-15ఈ ఫైటర్‌లోని ఇద్దరు పైలట్లు అది కూలిపోయే సమయంలో ఎజెక్ట్‌ సీట్ల సాయంతో నేలపై దిగారు. వెంటనే సీ-130 విమానాలు, బ్లాక్‌ హాక్‌ హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టిన అమెరికా అధికారులు ఒక పైలట్‌ను రక్షించినట్టు వెల్లడించారు. మరొకరి కోసం వెతుకుతున్నారు. అయితే గాలింపు కోసం వచ్చిన విమానాలు, హెలికాప్టర్లపై ఇరాన్‌ స్థానిక మిలీషియాలు, సైన్యం కాల్పులు జరుపుతున్నాయి. ఈ క్రమంలో రెండు హెలికాప్టర్లు దెబ్బతిన్నట్టు ఇరాన్‌ మీడియా వెల్లడించింది. మరోవైపు శుక్రవారమే హోర్ముజ్‌ జలసంధి సమీపంలో అమెరికా ఏ-10 వార్ట్‌హాగ్‌ విమానాన్ని కూడా ఇరాన్‌ కూల్చివేసింది.

అధునాతన రక్షణ వ్యవస్థలతో కూల్చేశాం

ఇప్పటివరకు వినియోగించని అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను రంగంలోకి తెచ్చామని, దాని సాయంతోనే అమెరికా విమానాలను కూల్చివేశామని ఇరాన్‌ అత్యున్నత మిలిటరీ కమాండ్‌ ‘ఖతామ్‌ అల్‌ అన్బియా’ ప్రతినిధి ప్రకటించారు. ఇరాన్‌ గగనతలంపై తాము తిరిగి పూర్తి పట్టు సాధిస్తున్నామని తెలిపారు. కూలిపోయినది ఎఫ్‌-15ఈ ఫైటర్‌ అని అమెరికా చెబుతున్నా.. తాము శుక్రవారం ఒక ఎఫ్‌-35, రెండు ఏ 10 వార్ట్‌హాగ్స్‌, మూడు డ్రోన్లను కూల్చివేసినట్టు ఇరాన్‌ ఆర్మీ శనివారం ప్రకటించింది. ఇరాన్‌ దేశీయంగా అభివృద్ధి చేసిన మాజిద్‌ స్వల్పశ్రేణి రక్షణ వ్యవస్థ సాయంతోనే అమెరికా ఫైటర్లు, డ్రోన్లను కూల్చివేసినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు, 15 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లగలిగే ఈ క్షిపణులు కేవలం 70 కేజీల వరకు బరువు మాత్రమే ఉంటాయి. ఈ క్షిపణి వ్యవస్థ ఎలాంటి రాడార్లను ఉపయోగించదు. అందువల్ల శత్రుదేశ విమానాలు సిగ్నళ్ల ద్వారా గుర్తించే అవకాశం లేదు. మాజిద్‌ వ్యవస్థ కేవలం దృశ్య, ఉష్ణోగ్రతల ఆధారంగా పనిచేసే ఆప్టికల్‌, ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సర్లతోనే పనిచేస్తుంది. యుద్ధ విమానాలను గుర్తించి, వాటి నుంచి వెలువడే వేడి ఆధారంగా వెంబడించి దాడి చేస్తుంది. చిన్న పరిమాణంలో ఉండే ఈ వ్యవస్థలను సులభంగా తరలించవచ్చు, ఎక్కడైనా దాచి వినియోగించుకోవచ్చు. దానికితోడు ఇరాన్‌లో దాడుల కోసం అమెరికా యుద్ధ విమానాలు తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంటాయి. ఈ క్రమంలో మాజిద్‌ క్షిపణి వ్యవస్థలకు దొరికిపోతున్నాయి.


37 సార్లు ఓడించామని చెప్పుకొన్నారుగా..!

అమెరికాకు వరుస ఎదురుదెబ్బలు, యుద్ధ విమానాలను కోల్పోవడాన్ని ప్రస్తావిస్తూ.. ఇరాన్‌ పార్లమెంటు స్పీకర్‌ ట్రంప్‌ను ఎద్దేవా చేస్తూ పోస్టు పెట్టారు. ‘‘అత్యంత అద్భుతమైన, ఎలాంటి వ్యూహమూ లేని యుద్ధంలో ఇరాన్‌ను వరుసగా 37 సార్లు ఓడించారు. ప్రభుత్వాన్ని మార్చేస్తామంటూ హూంకరించి.. ఇప్పుడు ‘‘హే.. ఎవరికైనా మా పైలట్లు కనిపించారా.. ప్లీజ్‌’ అంటూ వెతుక్కుంటున్నారు. అసలైన మేధావులు.. అద్భుతమైన పురోగతి’’ అని ఎగతాళి చేశారు. 50 మంది ఇజ్రాయెల్‌ నిఘా అధికారుల వ్యక్తిగత వివరాలను ఇరాన్‌కు చెందిన హందాలా హ్యాకర్ల గ్రూపు బయటపెట్టింది. కొన్ని నెలలుగా సైబర్‌ ఆపరేషన్లు చేపట్టి.. ‘ఇజ్రాయెల్‌ మిలిటరీ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ 9900’కు చెందిన సీనియర్‌ అధికారుల వివరాలను సేకరించినట్టు తెలిపింది. ఇటీవలే అమెరికా ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ వ్యక్తిగత ఈ-మెయిల్‌ను హ్యాక్‌ చేసి.. అందులోని డాక్యుమెంట్లను, ఫొటోలను ఆన్‌లైన్‌లో పెట్టిన హ్యాకర్ల గ్రూపు ఇదే కావడం గమనార్హం.

హోర్ముజ్‌ తెరుస్తారా.. నరకాన్ని చూస్తారా?

ఇరాన్‌కు 48 గంటలే గడువు: ట్రంప్‌

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 4: యుద్ధ విరమణ కోసం అమెరికాతో ఒప్పందానికి పెట్టిన గడువు ముగిసిపోతోందని.. గడువు దాటితే ఇరాన్‌పై నరకం విరుచుకుపడుతుందని ట్రంప్‌ హెచ్చరించారు. మరో 48 గంటలే మిగిలి ఉందని పేర్కొంటూ శనివారం ఉదయం(భారత్‌లో రాత్రి) ట్రూత్‌ సోషల్‌లో పోస్టు పెట్టారు. ‘‘నేను ఇరాన్‌కు పది రోజులు గడువు ఇచ్చిన విషయం గుర్తుందా? ఒక ఒప్పందానికి రావాలని లేదా హోర్ముజ్‌ జలసంధిని తెరవాలని చెప్పాను. ఆ సమయం ముగిసిపోతోంది. మరో 48 గంటల్లో ఇరాన్‌పై నరకం విరుచుకుపడుతుంది’’ అని పేర్కొన్నారు. మరోవైపు, ఇరాన్‌లో కూలిన విమానంలోని పైలట్‌ ఆ దేశ సైన్యానికి చిక్కబోరని భావిస్తున్నట్టు ‘ది ఇండిపెండెంట్‌’ వార్తా సంస్థకు ఇచ్చిన ఫోన్‌ ఇంటర్వ్యూలో అన్నారు.


గల్ఫ్‌కు మరణశాసనమే!

ఇరాన్‌ విదేశాంగ మంత్రి అరాగ్చీ

బుషెహర్‌ అణు విద్యుత్‌ కేంద్రంలో ప్రమాదం జరిగితే గల్ఫ్‌ దేశాలకు మరణశాసనమేనని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ హెచ్చరించారు. అణు కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు ప్రాంతీయంగా తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని స్పష్టం చేశారు. అణు కేంద్రాల విషయంలో పశ్చిమ దేశాలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. ‘‘ఉక్రెయిన్‌లోని జపొరిజియా అణు కేంద్రం వద్ద జరిగిన యుద్ధంపై పాశ్చాత్య దేశాలు వ్యక్తం చేసిన ఆగ్రహం గుర్తుందా? ఇప్పుడు అమెరికా-ఇజ్రాయెల్‌ మా బుషెహర్‌ నాలుగుసార్లు దాడులు చేశాయి. ఒకవేళ రేడియో ధార్మికత వెలువడితే.. అది మా రాజధాని టెహ్రాన్‌కు కాదు.. గల్ఫ్‌ దేశాల రాజధానుల్లోని ప్రజలకు మరణశాసనంగా మారుతుంది’’ అని అరాగ్చీ పేర్కొన్నారు. కాగా, పాకిస్థాన్‌ వేదికగా జరుగుతున్న దౌత్య ప్రయత్నాలను ఇరాన్‌ తిరస్కరించిందన్న ప్రచారాన్ని అరాగ్చీ ఖండించారు. అమెరికా షరతులు పెడుతుండటంతోనే ప్రతిష్ఠంభన నెలకొందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై

ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు

Updated Date - Apr 05 , 2026 | 06:29 AM