ఇరాన్‌కు డబ్బులేమీ ఇవ్వట్లేదు
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:02 AM
శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్‌కు అమెరికా సుమారు రూ.2,900 కోట్లు (300 మిలియన్ డాలర్లు) చెల్లిస్తోందంటూ వచ్చిన వార్తలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు.
శాంతి ఒప్పందంలో భాగంగా డబ్బులిస్తామన్న వార్తలు అబద్ధం
ఇజ్రాయెల్ తీరు నచ్చలే.. అవసరానికి మించి లెబనాన్‌పై దాడి
నేను లేకపోతే ఇజ్రాయెల్ ఉండేదికాదు: డొనాల్డ్ ట్రంప్
లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైదొలగకపోతే యుద్ధం ముగిసినట్టు కాదు: ఇరాన్ స్పష్టీకరణ
శాంతి ఒప్పందం నేపథ్యంలో 80 డాలర్ల దిగువకు క్రూడ్
వాషింగ్టన్/ టెహ్రాన్, జూన్ 16: శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్‌కు అమెరికా సుమారు రూ.2,900 కోట్లు (300 మిలియన్ డాలర్లు) చెల్లిస్తోందంటూ వచ్చిన వార్తలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. అవి పూర్తిగా తప్పుడు వార్తలని, ఇరాన్‌కు అమెరికా ఏమీ చెల్లించడం లేదని పేర్కొన్నారు. అంతేకాదు ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధం సమకూర్చుకోబోమని మాటిచ్చిందని తెలిపారు. ఇరాన్‌కు సంబంధించి మంగళవారం ఆయన ట్రూత్ సోషల్‌లో పలు పోస్టులు పెట్టారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 దేశాల సదస్సు సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు. లెబనాన్ విషయంలో ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్న తీరును ట్రంప్ మరోసారి తప్పుబట్టారు. లెబనాన్, హెజ్బొల్లా విషయంలో ఇజ్రాయెల్ వ్యవహరించిన తీరు తనకు నచ్చలేదని, ఇది అంతులేని వ్యవహారంగా మారుతోందని వ్యాఖ్యానించారు. ఇదిలా కొనసాగితే ఇరాన్‌తో ఒప్పందంపై వ్యతిరేక ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. ‘‘అమెరికా లేకపోతే.. నేను లేకపోతే.. ఇజ్రాయెల్ అనేదే ఉండేది కాదు.. ఎందుకంటే వారికోసం నేను చేసినంతగా అమెరికా అధ్యక్షుడెవరూ చేయలేదు. లెబనాన్‌పై దాడులు చేసిన సమయం నాకు నచ్చలేదు. అంత తీవ్రస్థాయిలో దాడులు చేయడం కూడా నచ్చలేదు. అవసరానికి మించి, దారుణంగా దాడులు చేశారు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇలా అందరినీ చంపకుండా ఇజ్రాయెల్ లక్ష్యాన్ని సాధించలేకపోతే.. హెజ్బొల్లా అంశాన్ని సిరియాకు వదిలేయాలని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌కు ఇప్పటికే ఈ సూచన చేశానని, నిజానికి సిరియా ఈ పనిని మరింత సమర్థవంతంగా చేయగలదని భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఇక ఇరాన్‌తో ఒప్పందాన్ని అమెరికా చట్టసభ కాంగ్రెస్‌కు సమీక్ష కోసం పంపేందుకు సిద్ధమని, దానిని ఆమోదించకుండా ఎవరు ఉంటారని వ్యాఖ్యానించారు. ఒప్పందంపై సంతకం చేసేందుకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం స్విట్జర్లాండ్‌కు వెళుతోందని, శుక్రవారం ఒప్పందం వివరాలు విడుదల చేస్తామని తెలిపారు. మరోవైపు వలసదారులపై అమెరికా అధ్యక్షుడు మరోసారి విమర్శలు గుప్పించారు. మూడో ప్రపంచ (పేద) దేశాల నుంచి ప్రజలను రానిస్తే.. అమెరికా కూడా వేగంగా పేద దేశంగా మారుతుందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఈ విషయంలో మనం చేసేదేమీ ఉండదని ‘ట్రూత్ సోషల్’లో పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ లెబనాన్ నుంచి వైదొలగాల్సిందే: ఇరాన్
అమెరికాతో యుద్ధానికి ముగింపు పలికే తాత్కాలిక శాంతి ఒప్పందం అమలుకావాలంటే లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ దళాలు వైదొలగాల్సిందేనని ఇరాన్ స్పష్టం చేసింది. ‘‘దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ ఆక్రమణ కొనసాగడం ఒప్పందాన్ని దెబ్బతీస్తుంది. లెబనాన్‌లో ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ వైదొలగకపోతే.. యుద్ధం పూర్తిగా ముగిసినట్టు కాదు..’’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ తీరుతో గందరగోళం..
ఇరాన్‌తో తాత్కాలిక శాంతి ఒప్పందంపై డిజిటల్‌గా సంతకాలు అయ్యాయని, శుక్రవారం స్విట్జర్లాండ్‌లో ఇరుదేశాల ప్రతినిధులు సంతకాలు చేస్తారని ట్రంప్ ప్రకటించడం, ఇరాన్ ధ్రువీకరించడం తెలిసిందే. కానీ ఆ ఒప్పందంలోని అంశాలు ఏమిటన్నది ఇప్పటివరకు బయటికి రాలేదు. ఇజ్రాయెల్ ఈ ఒప్పందంలో భాగం కాకపోయినా.. ఇరాన్‌పై అమెరికా యుద్ధంలో కీలక భాగస్వామి. అదే సమయంలో ఇరాన్‌కు మద్దతిస్తున్న హెజ్బొల్లాపై అణచివేస్తామంటూ లెబనాన్‌లోని పలు ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించింది. ఈ క్రమంలోనే లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ తప్పనిసరిగా వైదొలగాల్సిందేనని ఇరాన్ పట్టుబడుతోంది. మరోవైపు తమకు అవసరం అనిపించినంత కాలం లెబనాన్ ప్రాంతాలను ఆధీనంలో ఉంచుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ దళాలు వైదొలగడం ఒప్పందంలో భాగం కాదని అమెరికా అధికారులు చెబుతుంటే.. మధ్యవర్తిగా ఉన్న పాకిస్థాన్ మాత్రం లెబనాన్‌లో సైనిక చర్య నిలిపేయడం కూడా ఒప్పందంలో భాగమేనని పేర్కొంటోంది. దీనితో పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందా, యుద్ధం కొనసాగుతుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. కాగా, తాత్కాలిక శాంతి ఒప్పందం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి బయట గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో అమెరికా తమ దిగ్బంధనాన్ని సడలించింది. దీంతో మంగళవారం ఇరాన్‌కు చెందిన మూడు భారీ చమురు ట్యాంకర్ నౌకలు, రెండు సరుకు రవాణా నౌకలు అమెరికా దిగ్బంధమున్న ప్రాంతాన్ని దాటి అరేబియా సముద్రంలోకి ప్రవేశించాయి. శుక్రవారం ఒప్పందంపై సంతకాలు జరిగిన తర్వాత హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తామని ఇరాన్ పేర్కొంది.
స్విట్జర్లాండ్ బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో సంతకాలు
అమెరికా-ఇరాన్ మధ్య జరగనున్న తాత్కాలిక శాంతి ఒప్పందంపై స్విట్జర్లాండ్‌లోని ల్యుసెర్న్ పట్టణానికి సమీపంలో ఉన్న బర్గెన్‌స్టాక్ రిసార్టులో సంతకాలు జరగనున్నాయి. అమెరికా, ఇరాన్‌తోపాటు మధ్యవర్తులుగా ఉన్న పాకిస్థాన్, ఖతార్ కూడా సంతకాల కోసం ఈ ప్రాంతాన్ని ప్రతిపాదించాయని.. దానిని ఖరారు చేశామని స్విట్జర్లాండ్ విదేశాంగ శాఖ మంగళవారం వెల్లడించింది.