Share News

ముచ్చటగా 37వసారి ఇరాన్‌తో డీల్‌ కుదరబోతోందంటూ ట్రంప్‌ వ్యాఖ్య

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:04 AM

ఇరాన్‌తో ఒప్పందానికి దగ్గరగా ఉన్నామని, అతిత్వరలోనే డీల్‌ కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి ప్రకటించారు. శాంతి ఒప్పంద చర్చలు మొదలైనప్పటి నుంచి దాదాపు....

ముచ్చటగా 37వసారి ఇరాన్‌తో డీల్‌ కుదరబోతోందంటూ ట్రంప్‌ వ్యాఖ్య

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, జూన్‌ 9: ఇరాన్‌తో ఒప్పందానికి దగ్గరగా ఉన్నామని, అతిత్వరలోనే డీల్‌ కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి ప్రకటించారు. శాంతి ఒప్పంద చర్చలు మొదలైనప్పటి నుంచి దాదాపు 37 సార్లు ఆయన ఇదే తరహా ప్రకటనలు చేశారని మీడియా గణాంకాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైంది. మార్చి 23న విలేకరులతో ట్రంప్‌ మాట్లాడుతూ, శాంతి చర్చల్లో పురోగతి ఉందని, దాదాపు అన్ని ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు. ఆ తర్వాత మార్చి 25, 26 తేదీల్లో ఒప్పందం కోసం ఇరాన్‌ ఆరాటపడుతోందని, కేబినెట్‌ సమావేశంలోనైతే ఏకంగా ఇరాన్‌ ప్రభుత్వం ఒప్పందం కోసం బతిమాలుతోందని చెప్పుకొచ్చారు. తాజాగా పోయిన ఆదివారం కూడా ఒప్పందానికి చాలా క్లోజ్‌గా ఉన్నామని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఇలా ఇప్పటివరకు ట్రంప్‌ 37 సార్లు డీల్‌ కుదుర్చుకునేందుకు దగ్గరగా వచ్చామని ప్రకటించినట్లు మీడియా గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు, లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ భారీ ఎత్తున క్షిపణి దాడులకు పాల్పడింది. ఇజ్రాయెల్‌ ప్రతిదాడలు చేసింది. యుద్ధాన్ని ఆపాలని ట్రంప్‌ పిలుపునివ్వడంతో, సోమవారం నాడు ఇరు దేశాలు ప్రత్యక్ష దాడులను తాత్కాలికంగా నిలిపివేశాయి.

బీబీ నువ్వు జాగ్రత్తగా ఉండు..

ఇరాన్‌తో దౌత్యపరమైన శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి ఓవైపు అమెరికా ప్రయత్నాలు చేస్తున్న వేళ.. లెబనాన్‌, బీరుట్‌లపై ఇజ్రాయెల్‌ దాడులకు పాల్పడడం అగ్రరాజ్యానికి కోపం తెప్పించింది. ఈ దాడుల వల్ల శాంతి చర్చలకు ఆటంకం కలుగుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బీబీ, నువ్వు జాగ్రత్తగా ఉండు, లేదంటే త్వరలోనే ఒంటరివైపోతావు’’ అంటూ ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహును హెచ్చరించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ మళ్లీ దాడులకు దిగితే, అమెరికా నుంచి ఆశించిన సహకారం ఉండకపోవచ్చని తేల్చిచెప్పినట్లు సమాచారం.

Updated Date - Jun 10 , 2026 | 04:04 AM