Share News

Maduro Arrested by US: చేతులకు బేడీలతో జైలుకు మదురో

ABN , Publish Date - Jan 05 , 2026 | 02:42 AM

అర్ధరాత్రి మిలిటరీ ఆపరేషన్‌తో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను అపహరించిన అమెరికా.. ఆయనను కరుడుగట్టిన నేరస్థుడి మాదిరిగా చేతులకు బేడీలు వేసి జైలుకు తరలించింది.

Maduro Arrested by US: చేతులకు బేడీలతో జైలుకు మదురో

  • కరుడుగట్టిన ఖైదీలా మదురోను తరలించిన అధికారులు

  • డ్రగ్స్‌ ఉగ్రవాద ఆరోపణలు రుజువైతే జీవితకాలం జైల్లోనే..

  • అమెరికా అధికారులకు మదురో న్యూఇయర్‌ శుభాకాంక్షలు

  • మీకూ అదే గతి.. క్యూబా, చిలీ, కొలంబియాలకు ట్రంప్‌ హెచ్చరిక

  • రష్యా కూడా జెలెన్‌స్కీని ఇలాగే బంధిస్తే ఏం చేస్తారు?

  • ట్రంప్‌ తీరును ప్రశ్నించిన ఆ దేశ ప్రజాప్రతినిధి రో ఖన్నా

  • అమెరికా దాడిలో 40 మంది మరణించారు: వెనెజువెలా

న్యూయార్క్‌/కారకస్‌, జనవరి 4: అర్ధరాత్రి మిలిటరీ ఆపరేషన్‌తో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను అపహరించిన అమెరికా.. ఆయనను కరుడుగట్టిన నేరస్థుడి మాదిరిగా చేతులకు బేడీలు వేసి జైలుకు తరలించింది. చేతులకు బేడీలు, తలపై నల్లని వస్త్రంలాంటి టోపీతో ఉన్న మదురోను రెండువైపులా ఇద్దరు అధికారులు పట్టుకొని జైల్లోకి నడిపించుకొని తీసుకెళ్తున్న వీడియోను అమెరికా మీడియా ఆదివారం ప్రసారం చేసింది. మదురోను న్యూయార్క్‌లోని ప్రఖ్యాత బ్రూక్లిన్‌ జైలు (మెట్రోపాలిటన్‌ డిటెన్షన్‌ సెంటర్‌)కు తరలించారు. ఈ జైలు కరుడుగట్టిన నేరస్థులకు కేంద్రం. ఇందులో ప్రస్తుతం 1,300 మంది ఖైదీలు ఉన్నారు. సాధారణ నేరాలు చేసి వచ్చే ఖైదీలను.. పోలీసులు కోరినా ఈ జైలుకు పంపేందుకు న్యాయమూర్తులు అంగీకరించరు. కాగా, న్యూయార్క్‌ దక్షిణ జిల్లా ఫెడరల్‌ కోర్టులో మదురోపై మత్తుపదార్థాల ఉగ్రవాదానికి కుట్ర, అక్రమంగా మత్తుపదార్థాలను అమెరికాలోకి రవాణా చేసేందుకు కుట్ర పన్నటం, అక్రమ ఆయుధాల వ్యాపారం తదితర నేరాలకు సంబంధించిన అభియోగాలు మోపినట్లు అమెరికా అటార్నీ జనరల్‌ పామ్‌ బోండీ తెలిపారు. ఈ అభియోగాలన్నీ రుజువైతే మదురో జీవితకాలం మొత్తం జైల్లోనే ఉండాల్సి రావచ్చని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. పైగా మదురోకు సంబంధించిన ఆస్తులన్నీ అమెరికా జప్తు చేస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా తనను నిర్బంధంలోకితీసుకున్న లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు మదురో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపటం విశేషం.


జెలెన్‌స్కీని ఇలాగే బంధిస్తే?

మదురోను అమెరికా సైన్యం అపహరించటాన్ని ఆ దేశ కాంగ్రెస్‌ సభ్యుడు, భారత సంతతి డెమోక్రాటిక్‌ నేత రో ఖన్నా తీవ్రంగా ఖండించారు. ట్రంప్‌ అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కుతూ మిలిటరిజంను ప్రోత్సహిస్తున్నారని ఆదివారం ఆయన ఆరోపించారు. ‘తైవాన్‌ అధ్యక్షుడు లైచింగ్‌ తేను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఇలాగే బంధించాలనుకుంటే మనం ఇప్పుడు ఏం చేయగలం? ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని రష్కా అధ్యక్షుడు పుతిన్‌ కూడా ఇలాగే అపహరిస్తే ఎలా ప్రశ్నించగలం? ట్రంప్‌ ప్రభుత్వ యుద్ధోన్మాదం, రక్షణ బడ్జెట్‌ పెంపు విధానాలకు వ్యతిరేకంగా అమెరికా ప్రజలు గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. మన ప్రభుత్వానికి సరైన మార్గం చూపేందుకు ఇప్పుడు మనకు ఒక రాజనీతిజ్ఞుడు అవసరం’ అని పేర్కొన్నారు.

వెంటనే విడుదల చేయండి: చైనా

నికోలస్‌ మదురోను వెంటనే విడుదల చేయాలని అమెరికాను చైనా డిమాండ్‌ చేసింది. మదురోను, ఆయన సతీమణి సిలియా ఫ్లోరి్‌సను అమెరికా సైన్యం బలవంతంగా ఎత్తుకుపోవటంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. మదురో దంపతులను వదిలేసి, వెనెజువెలా ప్రభుత్వాన్ని కూలదోసే చర్యలను మానుకోవాలని చైనా విదేశాంగశాఖ ఆదివారం ఒక ప్రకటనలో సూచించింది. కాగా, ఈ అంవంపై భారత్‌ ఆచితూచి స్పందించింది. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భారత విదేశాంగశాఖ పేర్కొంది. వెనెజువెలా, అమెరికాలు తమ మధ్య ఉన్న విబేధాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది.


వెనెజువెలాను మేం పాలించం: అమెరికా

వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను నిర్బంధించి తీసుకెళ్లాక.. ఆ దేశాన్ని ఇకపై తామే పాలిస్తామని చెప్పిన అమెరికా మరుసటి రోజే యూటర్న్‌ తీసుకుంది.అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనకు విరుద్ధంగా.. వెనెజువెలా రోజువారీ పాలనలో తాము జోక్యం చేసుకోబోమని అమెరికా మంత్రి మార్కో రుబియో ఆదివారం ప్రకటించారు. అయితే ఆ దేశంలో చమురు ఆంక్షలను మాత్రం తాము పర్యవేక్షిస్తామన్నారు.

తర్వాతి వంతు మీదే..

ట్రంప్‌ ఇతర లాటిన్‌ అమెరికా దేశాలకు కూడా తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. అమెరికాలోకి డ్రగ్స్‌ అక్రమ రవాణాను ఆపకపోతే వెనెజువెలాకు పట్టిన గతే మీకూ పడుతుందని క్యూబా, చిలీ, కొలంబియా అధినేతలను హెచ్చరించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కూడా ఇదేరకమైన హెచ్చరిక చేశారు. మదురోను నిర్బంధించటాన్ని ఈ మూడు దేశాలు తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.

1.jpg

వెనెజువెలా అధ్యక్షురాలిగా డిల్సీ

అధ్యక్షుడు మదురోను అమెరికా అపహరించటంతో వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు డిల్సీ రోడ్రిగ్స్‌ను ఆ దేశ సుప్రీంకోర్టు ఆదివారం నియమించింది. అధ్యక్షుడు లేని దేశంలో పాలన గాడి తప్పకుండా కొనసాగించేందుకు, దేశ భద్రత ను కాపాడేందుకు తక్షణం ఆమెను అధ్యక్ష పగ్గాలు చేపట్టాల్సిందిగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కోరింది. కాగా, అమెరికా దాడిలో 40 మంది మరణించారని వెనెజువెలా ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. వీరిలో సాధారణ పౌరులు కూడా ఉన్నట్లు వెల్లడించింది.


మోదీ కూడా మసూద్‌ను ఇలాగే తీసుకురావాలి

  • అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌

ప్రధాని మోదీకి ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ సరికొత్త సవాల్‌ విసిరారు. మదురోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకెళ్లినట్లుగా.. ముంబైలో 26/11 ఉగ్రదాడుల సూత్రధారి మసూద్‌ అజర్‌ను పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు మోదీ తీసుకురావాలని ఒవైసీ అన్నారు. ముంబైలో ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మోదీ ఎవరికన్నా తక్కువ కాదని, మసూద్‌ అజర్‌ను తీసుకురావడం ద్వారా తన 56 అంగుళాల ఛాతీ శక్తిని చూపించాలని వ్యాఖ్యానించారు. అయితే ఒవైసీ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. భారత్‌.. బాధ్యత కలిగిన దేశమని, పొరుగు దేశాలతో సత్సంబంధాలను కోరుకుంటుందని ఆ పార్టీ ఎంపీ గులాం అలీ ఖతానా అన్నారు.

Updated Date - Jan 05 , 2026 | 02:44 AM