Share News

5 వేల మంది సైనికుల రాకతో థాయ్‌లాండ్‌ అలర్ట్.. వ్యభిచార గృహాలపై రెయిడ్స్

ABN , Publish Date - Sep 02 , 2026 | 09:39 AM

అమెరికన్ సైనికుల రాక నేపథ్యంలో థాయ్‌లాండ్ అప్రమత్తమైంది. పట్టాయ నగరంలో వ్యభిచార గృహాలపై ముందుజాగ్రత్త చర్యగా రెయిడ్స్ నిర్వహించి అనేక మంది సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకుంది.

5 వేల మంది సైనికుల రాకతో థాయ్‌లాండ్‌ అలర్ట్.. వ్యభిచార గృహాలపై రెయిడ్స్
US Soldiers Arrive in Thailand

ఇంటర్నెట్ డెస్క్: అమెరికన్ సైనికుల రాక నేపథ్యంలో థాయ్‌లాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పట్టాయ నగరంలో వ్యభిచార గృహాలపై ముందుజాగ్రత్త చర్యగా రెయిడ్స్ నిర్వహించి అనేక మంది సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకుంది. నగరంలో పోలీసుల గస్తీని కట్టుదిట్టం చేసింది. అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ అబ్రహాం పోర్ట్ ఆఫ్ కాల్‌లో భాగంగా బుధవారం ఉదయం థాయ్‌లాండ్‌లోని లేమ్ ఛబాంగ్ తీరానికి వచ్చింది. నౌకకు కావాల్సి వస్తువులను తీసుకుని కొద్ది రోజుల్లో బయలుదేరుతుంది. ఈ క్రమంలో నావికులు, పైలట్లు వచ్చే నాలుగు రోజుల పాటు థాయ్‌లాండ్‌లోని పట్టాయ నగరంలో సేద తీరనున్నారు. పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో దాదాపు 250 రోజుల పాటు విధుల్లో గడిపిన సిబ్బంది స్వల్ప విరామం తీసుకోనున్నారు.


యూఎస్ సైనికుల రాకపై స్థానికంగా హర్షం వ్యక్తం అవుతోంది. కొంతకాలంగా మందకొడిగా ఉన్న టూరిజం రంగానికి అమెరికా సిబ్బంది రాకతో కొత్త ఉత్సాహం వస్తుందని స్థానిక వ్యాపారులు భావిస్తున్నారు. ఒక్కో సైనికుడు సగటున రోజుకు 90 డాలర్ల వరకూ వెచ్చించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధిక ధరలతో అతిథులను బురిడీ కొట్టించవద్దని అధికారులు అక్కడి వ్యాపారులకు స్పష్టమైన సూచనలు చేశారు. అయితే, వ్యభిచారం, లైంగిక వ్యాధుల వ్యాప్తి పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తాయ్యారు. ఇప్పటికే పలు వ్యభిచార గృహాలపై రెయిడ్స్ నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో కనిపించిన సెక్స్ వర్కర్లను అరెస్టు చేశారు.


థాయ్‌లాండ్‌లో పర్యటించనున్న అమెరికా సైనికులు పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుందని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పట్టాయలో పర్యటించేందుకు వారికి అనుమతి ఉన్నప్పటికీ అర్ధరాత్రి 2 తరువాత బార్స్, ఇతర నైట్ లైఫ్ కేంద్రాల్లో ఉండొద్దన్న ఆదేశాలు ఉన్నాయి. డ్రగ్స్‌ స్టోర్స్ వంటి కేంద్రాలను సందర్శించొద్దని కూడా అమెరికా సిబ్బందికి ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. అయితే, ఒక్కసారిగా అంతమంది టూరిస్టులు రావడం ప్రజారోగ్య సమస్యగా మారే అవకాశం ఉందని బ్యాంకాక్ యూనివర్సిటీలోని ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆందోళన వ్యక్తం చేశారు. లైంగిక దోపిడీ, వ్యాధుల వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక పోలీసులు బీచ్‌లు, ఇతర ప్రాంతాల్లో గస్తీని కట్టుదిట్టం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

అమెరికా దాడులతో పెళ్లింట పలువురి మృతి.. ఇరాన్ ప్రతీకార దాడులు

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

Updated Date - Sep 02 , 2026 | 09:51 AM