ఏఐ అభివృద్ధిపై టెక్ దిగ్గజాల స్వీయ నియంత్రణ
ABN , Publish Date - Oct 01 , 2026 | 12:45 AM
కృత్రిమ మేధ(ఏఐ) అభివృద్ధిపై అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో.. టెక్నాలజీ దిగ్గజ సంస్థలు స్వీయ నియంత్రణలు పాటించేందుకు ముందుకు వచ్చాయి.
అంతర్గత, బాహ్య సమీక్షలకు అంగీకారం
ఏఐ భద్రత, రిస్క్‌లపై నిరంతర పర్యవేక్షణ
ఒప్పందంపై ట్రంప్ సమక్షంలో సంతకాలు
స్వీయ నియంత్రణ చాలదన్న బిల్‌గేట్స్
చట్టబద్ధమైన నియంత్రణలు ఉండాలని సూచన
వాషింగ్టన్, సెప్టెంబరు 30: కృత్రిమ మేధ(ఏఐ) అభివృద్ధిపై అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో.. టెక్నాలజీ దిగ్గజ సంస్థలు స్వీయ నియంత్రణలు పాటించేందుకు ముందుకు వచ్చాయి. ఏఐ అభివృద్థిలో భద్రతా ప్రమాణాలు పాటించేందుకు స్వచ్ఛంద ఒప్పందంపై(వైట్‌హౌస్ అకార్డ్ ఆన్ సూపర్ ఇంటెలిజెన్స్) సంతకాలు చేశాయు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రముఖ ఏఐ కంపెనీల అధిపతులతో మంగళవారం వైట్‌హౌ్‌సలో సమావేశం నిర్వహించారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఆంత్రోపిక్ సీఈవో డారియో ఆమోదీ, మెటా సీఈవో మార్క్ జుకెర్‌బర్గ్, ఓపెన్ ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మ్యాన్, ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఇందులో పాల్గొన్నారు. ఈ ఒప్పంద పత్రాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు. ఈ ఒప్పందం ప్రకారం.. కంపెనీలు ప్రధానంగా నాలుగు రకాల చర్యలు చేపట్టాలి. ఏఐ అభివృద్ధి, వినియోగంపై బలమైన అంతర్గత నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, ఆ నియంత్రణలు సక్రమంగా పనిచేస్తున్నాయో? లేదో? అంచనా వేసేందుకు స్వతంత్ర బాహ్య ఆడిటర్లతో కలసి పనిచేయాలి. అంతర్గత, బాహ్య ఆడిటర్ల నివేదికలను పరిశీలించి, చర్యలు తీసుకునేందుకు ప్రతి కంపెనీ బోర్డులో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి. ఏఐ భద్రత, రిస్క్‌లపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇవి స్వచ్ఛందమే అయినా, భవిష్యత్తులో చట్టం, నిబంధల రూపం దాల్చొచ్చని ఒప్పందం స్పష్టం చేస్తోంది. అయితే, ఏఐపై కంపెనీల స్వీయ నియంత్రణ ఒక్కటే చాలదని, బలమైన చట్టాలు, నిబంధనలు కూడా ఉండాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ స్పష్టం చేశారు.
ఏఐకి సంబంధించి స్వీయ రక్షణలు, పర్యవేక్షణ ఎలా ఉండాలన్న దానిని ప్రభుత్వం, చట్టబద్ధమైన సంస్థలు, రాజకీయ నాయకులు కలసి నిర్ణయించాలని అభిప్రాయపడ్డారు. ఏఐ దుర్వినియోగమైతే బయో టెర్రరిజం, ఆర్థిక వ్వవస్థల హ్యాకింగ్ వంటి తీవ్ర ప్రమాదాలు తలెత్తవచ్చని హెచ్చరించారు. తప్పుడు వ్యక్తుల చేతుల్లో ఏఐ ఉంటే బిలియన్ ప్రజలు (100 కోట్లు) మరణించేంత వంటి ప్రమాదాలకు దారితీయొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఏఐకి మానవజీవితాలను మెరుగుపరిచే సామర్థ్యం ఉందని కూడా గేట్స్ అంగీకరించారు.
సుందర్ పిచాయ్ ఓ మాన్‌స్టర్
గూగుల్ సీఈవో, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్‌ను ‘మాన్‌స్టర్’ (అసాధారణ వ్యక్తి/గొప్ప వ్యక్తి)గా ట్రంప్ అభివర్ణించారు. వైట్‌హౌ్‌సలో ఏఐ కంపెనీలతో సమావేశం అనంతరం మీడియా ఎదుట ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘సుందర్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?’’ అని అడిగారు. దీనికి సుందర్ పిచాయ్ స్పందిస్తూ.. ‘‘ఫస్ట్ ఆఫ్ ఆల్, థాంక్స్’’ అని మాట్లాడడం మొదలు పెట్టారు. ట్రంప్ మధ్యలోనే జోక్యం చేసుకుని.. ‘‘టెక్ రంగానికి చెందిన వీరంతా అత్యంత ప్రముఖులు. ఈయన(సుందర్) మాన్‌స్టర్. కానీ, ఈయన గురించి ఎవరికీ తెలియదు. పేరు మాత్రం గుర్తు పెట్టుకోండి.. సుందర్’’ అని మీడియా ప్రతినిధులతో అన్నారు. దీనికి సుందర్ పిచాయ్ నవ్వుతూ.. ‘‘నేను మాన్‌స్టర్ అనే దానికంటే ఇది (సుందర్) మంచి ట్యాగ్‌లైన్ అవుతుందని ఆశిస్తున్నా’’అని చమత్కరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
రష్యా సైన్యంలో చేరొద్దు.. భారతీయులకు కేంద్రం హెచ్చరిక
డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడా: ప్రధాని మోదీ..