పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది దుర్మరణం
ABN , Publish Date - Aug 03 , 2026 | 09:41 AM
పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 14 మంది చనిపోయినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 14 మంది చనిపోయినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. స్వాత్ వ్యాలీలో తీవ్రవాద వ్యతిరేక ర్యాలీ సందర్భంగా ఈ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 20 మందికి పైగా గాయపడ్డారు. బాధితులకు సమీప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
స్వాత్ జిల్లా కబాల్ టౌన్‌లోని ఒక పోలీస్ స్టేషన్ వద్ద ఈ దాడి జరిగింది. మిలిటెంట్ వ్యతిరేక నినాదాలు చేస్తూ స్థానికులు ర్యాలీగా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. శాంతియుత వాతావరణం నెలకొనాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఒక సూసైడ్ బాంబర్ పోలీసు స్టేషన్‌లోకి దూసుకొచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ సూసైడ్ బాంబర్ వెంటనే తనని తాను పేల్చుకోవడంతో స్టేషన్ గేటు వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పోలీసులు కూడా మరణించారు.
ఈ దాడికి బాధ్యులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇటీవల కాలంలో పాక్‌లో ఉగ్రవాద దాడులు పెరిగిన విషయం తెలిసిందే. ఆఫ్గానిస్థాన్ ప్రేరేపిత టీటీపీ ఉగ్రసంస్థ ఈ దాడులకు దిగుతోందని పాక్ ఆరోపిస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
గాల్లో ఢీకొట్టుకున్న హెలికాప్టర్లు.. ఇద్దరి మృతి..
ఇండోనేసియాలో ఓడకు మంటలు..ఐదుగురి మృతి