Share News

మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన స్పేస్ ఎక్స్.. భారత్ మీదుగా..

ABN , Publish Date - Sep 28 , 2026 | 02:43 PM

పునర్వినియోగ రాకెట్ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న స్పేస్ ఎక్స్ సంస్థ కీలక ప్రయోగానికి సిద్ధమైంది.

మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన స్పేస్ ఎక్స్.. భారత్ మీదుగా..
SpaceX Starship Flight 15

ఇంటర్నెట్ డెస్క్: పునర్వినియోగ రాకెట్ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న స్పేస్ ఎక్స్ సంస్థ కీలక ప్రయోగానికి సిద్ధమైంది. స్టార్‌షిప్‌ రాకెట్ సాయంతో బ్రాడ్‌బాండ్ శాటిలైట్‌లను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు నేడు ప్రయత్నించనుంది. స్టార్‌షిప్‌కు సంబంధించి ఇది 14వ ప్రయోగం. ఈసారి ఆర్బిటాల్ పరీక్షలో భాగంగా స్టార్‌షిప్ భూమి చుట్టూ ఆరుసార్లు చెక్కర్లు కొట్టనుంది. భారత్‌ మీదుగా కూడా ప్రయాణించనుంది. ఈ క్రమంలో తొలిసారిగా స్టార్‌లింక్ వీ3 శాటిలైట్‌లను కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. భూమి చుట్టూ పలుమార్లు పరిభమ్రించే సామర్థ్యాన్ని, శాటిలైట్లను క్షక్ష్యలోకి ప్రవేశపెట్టే సమార్థ్యాలను నిరూపించేందుకు స్పేస్ ఎక్స్ ఈ ప్రయోగం నిర్వహిస్తోంది.


ఈ ప్రయోగం విజయవంతమైతే పునర్‌వినియోగ రాకెట్ సాయంతో శాటిలైట్లు, ఇతర గ్రహాంతర మిషన్లు చేపట్టేందుకు మార్గం మరింత సుగమం అవుతుంది. ఇలాంటి మిషన్లకు పునర్వియోగ రాకెట్స్ అత్యంత అనువైనవన్న భావనతో ఎలాన్ మస్క్ సారథ్యంలోని స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్స్‌ను అభివృద్ధి చేస్తోంది. భారత కాలమానం ప్రకారం, నేటి సాయంత్రం 5 -7 గంటల మధ్య ఈ ప్రయోగం నిర్వహించనున్నారు. ఈ విశేషాలు ప్రపంచవ్యాప్తంగా లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు.


స్పేస్ ఎక్స్ తెలిపిన వివరాల ప్రకారం, దాదాపు 10 గంటల పాటు ఈ ప్రయోగం నిర్వహించనున్నారు. 26 స్టార్‌లింక్ వీ3 శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెడతారు. ఈ పరీక్షలో రాకెట్ కక్ష్యలోకి చేరుకోవడం, శాటిలైట్‌లను కక్ష్యలోకి ప్రవేశపెట్టే విధానం, ఆ తరువాత నియంత్రిత విధానంలో భూమీ మీదకు మళ్లీ చేరుకోవడం తదితర దశలన్నీ క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. దాదాపు 275 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలో స్టార్‌షిప్ ఈసారి ఆరు సార్లు భూమి చుట్టు పరిభ్రమిస్తుంది. ప్రయోగం చివర్లో పసిఫిక్ సముద్రంలో స్ప్లాష్ డౌన్ (దిగుతుంది) అవుతుంది.


చరిత్రాత్మక ఫ్లైట్5 ప్రయోగంలో స్టార్‌షిప్ హెవీ బూస్టర్‌ను ( రాకెట్ ప్రాథమిక దశ) మళ్లీ ప్రయోగ టవర్ వద్ద క్యాచ్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి మాత్రం శాటిలైట్లు కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో పాటు రాకెట్ గమనానికి సంబంధించి ఇతర కీలక అంశాలపై దృష్టిపెట్టనుంది. శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టే స్టార్‌షిప్ స్పేస్‌క్రాఫ్ట్‌తో పాటు హెవీ బూస్టర్ కూడా సముద్రంలో స్ప్లాష్ డౌన్ కానున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

ఎంకే 18 మాడ్ 2 కింగ్‌ఫిష్‌ను సీజ్ చేశాం: ఐఆర్జీసీ

తుది పోరుకు సిద్ధం: ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి

Updated Date - Sep 28 , 2026 | 03:03 PM