జీవ కణాలతో పనిచేసే కంప్యూటర్!
ABN , Publish Date - Aug 27 , 2026 | 06:06 AM
కృత్రిమ మేధ(ఏఐ) నానాటికీ అన్ని రంగాల్లోకీ విస్తరిస్తోంది. ఎంత విస్తరించినా.. ఎంత తెలివైనదైనా.. ఏఐ అంటే కొన్ని వేల కంప్యూటర్ల సమాహారమే తప్ప నిజమైన మానవ మేధ కాదు. వాటికి ఆ మేధను...
ప్రపంచంలోనే తొలి బయోలాజికల్ డేటా సెంటర్
అభివృద్ధి చేసిన సింగపూర్, ఆస్ట్రేలియా పరిశోధకులు
సింగపూర్, ఆగస్టు 26: కృత్రిమ మేధ(ఏఐ) నానాటికీ అన్ని రంగాల్లోకీ విస్తరిస్తోంది. ఎంత విస్తరించినా.. ఎంత తెలివైనదైనా.. ఏఐ అంటే కొన్ని వేల కంప్యూటర్ల సమాహారమే తప్ప నిజమైన మానవ మేధ కాదు. వాటికి ఆ మేధను అందించేది సిలికాన్ చిప్సే. మనిషి మెదడులోని న్యూరాన్ల తరహాలోనే.. ఆ చిప్స్ ఎలకా్ట్రనిక్ సర్క్యూట్లను వాడుకుని సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాయి. అలా సిలికాన్ చిప్స్‌తో కాకుండా.. ప్రపంచంలోనే తొలిసారిగా మానవ మెదడు కణాలతో పనిచేసే డేటా సెంటర్‌ను సింగపూర్ నిర్మిస్తోంది. జీవకణాల సాయంతో భవిష్యత్తు కంప్యూటింగ్ కార్యకలాపాలను మరింత సమర్థంగా నిర్వహించవచ్చా లేదా తెలుసుకునేందుకు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌కు చెందిన ‘యాంగ్ లూ లిన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్’ పరిశోధకులు ఈ ప్రాజెక్టును చేపట్టారు. డే వన్ అనే డేటా సెంటర్ ఆపరేటర్ సంస్థ, ఆస్ట్రేలియాకు చెందిన బయొలాజికల్ కంప్యూటింగ్ కంపెనీ కార్టికల్ ల్యాబ్స్ పరిశోధకులు కూడా ఇందులో భాగమయ్యారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కార్టికల్ ల్యాబ్స్ పరిశోధకులు.. సర్వర్ ర్యాక్‌ల కోసం.. సిలికాన్ చిప్స్‌కు బదులుగా సజీవ నాడీ కణాలతో పనిచేసే 20 సీఎల్1 యూనిట్లను అభివృద్ధి చేశారు. ఆ సజీవ నాడీ కణాలన్నీ ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా ల్యాబ్‌లో అభివృద్ధి చేసినవే. మనిషి మెదడులోని కణాలలాగానే వీటికి కూడా నిరంతరం ఆక్సిజన్, గ్లూకోజ్, పోషకద్రవాలు కావాలి. అప్పుడే అవి పనిచేస్తాయి. వాటిని అందించే వ్యవస్థలను కూడా ఆ యూనిట్లలోనే అమర్చారు. కాకపోతే ప్రతి 3 రోజులకు ఒకసారి ఆ వ్యవస్థల్లోకి పోషకాలు, చక్కెర, ఆక్సిజన్‌ను పంపించి, వ్యర్థాలను తొలగిస్తూ ఉండాలి. ఆ నాడీకణాలజీవితకాలం సగటున 6 నెలలు. ఒక్కో యూనిట్‌పైనా ఇలాంటి 8 లక్షల సజీవ నాడీ కణాలను అమర్చింది. మొత్తం 20 సీఎల్1 యూనిట్లలో.. 1.6 కోట్ల న్యూరాన్లు అమర్చింది. ఒక్కో యూనిట్‌పై 8 లక్షల న్యూరాన్లంటే.. అది ఒక చిన్న బొద్దింక, తేనెటీగా మెదడులో న్యూరాన్ల సంఖ్యతో సమానం. అంటే ప్రతి యూనిట్ ఒక చిన్న కీటకంలా ఆలోచించగలదన్నమాట. ఈ యూనిట్లన్నీ కలిసి ఒక బయొలాజికల్ ప్రాసెసర్‌లా పనిచేస్తాయి. మామూలు కంప్యూటర్‌లో అయితే సిలికాన్ చిప్స్ ముందే చేసిన ప్రోగ్రామింగ్ ఆధారంగా పనిచేస్తాయి. కానీ.. ఇందులో అలాంటి ప్రోగ్రామింగ్ ఏమీ ఉండదు.
నాడీకణాలు తమకు వచ్చే విద్యుత్ సంకేతాలను గ్రహించి.. సమాచారాన్ని ప్రాసెస్ చేసి.. కంప్యూటర్‌కు తిరిగి సంకేతాలను పంపుతాయి. ఈ క్రమంలో అవి మనిషి మెదడులోని న్యూరాన్లలాగానే పనిచేస్తూ నేర్చుకుంటాయి. తమ మేధను క్రమక్రమంగా వృద్ధి చేసుకుంటాయి. ఈ ప్రక్రియ కోసం కార్టికల్ ల్యాబ్స్ ప్రత్యేకంగా ‘బయోలాజికల్ ఇంటెలిజెన్స్’ అనే ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. ఆర్నెల్ల తర్వాత నాడీ కణాలు చనిపోయినప్పుడు.. పాతవాటి స్థానంలో కొత్తవాటిని అమర్చుతారు. పాత కణాలు నేర్చుకున్న విషయాలన్నింటినీ బ్యాకప్ తీసిన ఆపరేటింగ్ సిస్టమ్.. ఆ బ్యాకప్ సాయంతో కొత్త కణాలకు శిక్షణ ఇస్తుంది. నాడీ కణాలతో పనిచేసే ఈ కంప్యూటింగ్ వ్యవస్థను ఈ నెల మొదటివారంలో యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లోని లైఫ్‌సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్‌లో 80 మంది అంతర్జాతీయ పరిశోధకులు, డేటాసెంటర్ నిపుణుల సమక్షంలో ప్రదర్శించారు. సీఎల్1 యూనిట్లలో అమర్చిన న్యూరాన్లు ఎలా విద్యుత్ సంకేతాలను స్వీకరించి, వాటిని ప్రాసెస్ చేసి పంపుతున్నాయో ప్రత్యక్షంగా చూపించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆకస్మిక వరదలు అందుకే.. నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి
నేపాల్ ఎంబసీ కీలక ప్రకటన.. దిగువ ప్రాంతాలకు అలర్ట్..