హిందువు అనుకుని సిక్కు విద్యార్థిపై దాడి.. అమెరికా యూనివర్సిటీలో ఘటన
ABN , Publish Date - Feb 15 , 2026 | 08:52 AM
హిందువు అనుకుని సిక్కు యువకుడిపై దాడి చేసిన వైనం అమెరికాలోని శాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీలో ఇటీవల వెలుగు చూసింది. ఈ ఘటనను అమెరికాలోని హిందూ సంఘాలు ఖండించాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని శాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్‌లో (SJSU) ఇటీవల సిక్కు విద్యార్థిపై దాడి ఘటన కలకలానికి దారి తీసింది. ఫిబ్రవరి 7న జరిగిన ఈ ఘటనలో బాధితుడిని హిందువుగా భావించి దాడి చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఈ దాడిని అమెరికాలోని హిందూ సంస్థలు ఖండించాయి. బాధితుడికి సంఘీభావం ప్రకటించాయి (Attack on Sikh Student) .
యూనివర్సిటీ అధికారుల ప్రకారం, బాధిత విద్యార్థిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నేలపై పడదోసి అతడి తలపాగాను తీసి చింపేశారు. ఆ సమయంలో బాధితుడిని హిందువు అంటూ తమ విద్వేషాన్ని వెళ్లగక్కారు. సిక్కు విద్యార్థిని హిందువుగా భావించి టార్గెట్ చేశారని అక్కడి వర్గాలు భావిస్తున్నాయి. నిందితులు యూనివర్సిటీ విద్యార్థులు కారని కూడా తెలిసింది. నిందితుల జాడ కనుక్కునేందుకు పోలీసులు అక్కడి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
ఈ ఘటనపై కోయెలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా సంఘానికి చెందిన యువత విభాగం ఖండించింది. బాధితుడికి, సిక్కు వర్గానికి సంఘీ భావం తెలిపింది. హిందూ వ్యతిరేకత ఈ దాడితో మరోసారి బయటపడిందని వ్యాఖ్యానించింది. నిందితులను గుర్తించి వెంటనే చర్యలను తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది. ఇలాంటి దాడులు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఈ వివక్ష గురించి బహిరంగంగా చర్చించాలని కూడా అభిప్రాయపడింది. ఇలాంటి ద్వేషపూరిత దాడులను తాము సహించబోమని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. బాధితుడికి న్యాయం కోసం పోలీసులకు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నాయి.
ఈ వార్తలూ చదవండి:
బంగ్లాదేశ్ ప్రధాని ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీకి ఆహ్వానం
బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ భారీ విజయం