గుర్తు తెలియని వ్యాధితో లాబ్ వర్కర్ మృతి.. రష్యాలో కలకలం
ABN , Publish Date - Oct 05 , 2026 | 08:21 AM
సైబీరియాలోని ఓ ల్యాబ్‌లో పనిచేసే వ్యక్తి గుర్తుతెలియని ఇన్‌ఫెక్షన్‌తో మరణించడం రష్యాలో కలకలానికి దారి తీసింది. షెలెఖోవ్ ప్రాంతంలోని యాంటీ ప్లేగు పరిశోధన సంస్థలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: సైబీరియాలోని ఓ ల్యాబ్‌లో పనిచేసే వ్యక్తి గుర్తుతెలియని ఇన్‌ఫెక్షన్‌తో మరణించడం రష్యాలో కలకలానికి దారి తీసింది. షెలెఖోవ్ ప్రాంతంలోని యాంటీ ప్లేగు పరిశోధన సంస్థలో ఈ ఘటన చోటుచేసుకుంది. ల్యాబ్ నుంచి ప్రమాదకరమైన వ్యాధి ఏమైనా బయటకు వ్యాపించిందా? అన్న భయాలు నెలకొన్నాయి. అసలు ఆ ఇన్ఫెక్షన్ ఏమిటి? అన్న విషయంపై ఇంకా పూర్తి స్పష్టత లేదు. అయితే, ఆ లాబ్ వర్కర్ నిమోనియా తరహా వ్యాధి లక్షణాలతో మరణించినట్టు సమాచారం.
ఇర్కుటుస్క్, షెలెకోవ్ ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని రష్యా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ తెలిపింది. ప్రజలు కంగారు పడవద్దని, పరిస్థితి అదుపులో ఉందని ఇర్కుటుస్క్ గవర్నర్ సూచించారు. అంతకుముందు, రష్యా చీఫ్ స్టేట్ డాక్టర్‌తో స్థానిక అంటువ్యాధుల నియంత్రణ విభాగం సమావేశం నిర్వహించింది. ఆ ప్రాంతంలో ఓ వ్యక్తి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ బారిన పడి మరణించినట్టు అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఆ సమావేశం జరిగిందని కూడా గవర్నర్ తెలిపారు.
మరోవైపు, షెలెకోవ్ ప్రాంతంలో ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. ల్యాబ్ సమీపంలోని అల్యూమినియం ప్లాంట్‌లోని వర్కర్లు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు ఆదేశించారు. ల్యాబ్ వర్కర్‌కు చికిత్స అందించిన ఆసుపత్రిలోని సుమారు 200 మందిని వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నట్టు కూడా వెలుగులోకి వచ్చింది. ఓ స్థానిక ఆసుపత్రిలో క్వారంటైన్ నిబంధనలు కూడా అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో, స్థానికంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. వర్కర్‌ను బలితీసుకున్న వ్యాధి నిమోనిక్ ప్లేగ్ అయి ఉంటుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలు రన్‌ఆఫ్‌కు.. ఫ్లావియో బొల్సొనారోకు ఆధిక్యం, లులాతో హోరాహోరీ
అంతర్జాతీయ విమానాలపై ఇజ్రాయెల్ సెక్యూరిటీ రివ్యూ