ఆస్ట్రేలియాలో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి
ABN , Publish Date - Jan 22 , 2026 | 02:50 PM
ఆస్ట్రేలియా న్యూసౌత్ వేల్స్‌లోని లేక్ కార్గెల్లిగో టౌన్‌లో గుర్తు తెలియని వ్యక్తి జనంపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా.. మరొకరు గాయపడ్డారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. గుర్తు తెలియని ఓ వ్యక్తి జనంపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానిక మీడియా కథనాలు, పోలీసుల స్టేట్‌మెంట్ ప్రకారం.. గురువారం న్యూసౌత్ వేల్స్‌లోని లేక్ కార్గెల్లిగో టౌన్‌లో గుర్తు తెలియని వ్యక్తి జనంపై గన్నుతో కాల్పులు జరిపినట్టు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ప్రాణాలు కోల్పోగా.. మరో పురుషుడు తీవ్రంగా గాయపడ్డాడు.
కాల్పులు జరిపిన అనంతరం ఆ వ్యక్తి కారులో అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన వ్యక్తిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. స్థానిక కాలామానం ప్రకారం.. ఈ ఘటన ఈ రోజు(గురువారం) సాయంత్రం 4:40 గంటలకు జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలోని మూడు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాల్పులకు తెగబడిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
నిందితుడు పరారీలో ఉన్నందున పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. కాల్పులు జరిగిన ప్రదేశంలోకి వెళ్లవద్దని సూచించారు. స్థానికులు ఇంటి నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.
కాగా.. గతేడాది డిసెంబర్ నెలలో సిడ్నీలోని బోండీ బీచ్‌లో కాల్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇవి కూడా చదవండి
స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురి కార్మికుల మృతి
పోలీసుల మీడియా బ్రీఫింగ్ విధానాలు 3 నెలల్లో రూపొందించాలి: సుప్రీంకోర్టు