Share News

త్వరలో మీడియా ముందుకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా

ABN , Publish Date - Aug 02 , 2026 | 10:05 PM

బంగ్లాదేశ్‌లో రెండేళ్ల క్రితం చెలరేగిన నిరసనల నేపథ్యంలో పదవి కోల్పోయి దేశాన్ని వీడిన మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా త్వరలో మీడియా ముందుకు రానున్నారు.

త్వరలో మీడియా ముందుకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా
Sheikh Hasina

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌లో రెండేళ్ల క్రితం చెలరేగిన నిరసనల నేపథ్యంలో పదవి కోల్పోయి దేశాన్ని వీడిన మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా త్వరలో మీడియా ముందుకు రానున్నారు. న్యూఢిల్లీలో ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియా ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో షేక్ హసీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. ఆగస్టు 5న సాయంత్రం 6 గంటల సమయంలో ఢిల్లీలోని మార్క్ టల్లీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా షేక్ హసీనా తన భవిష్యత్తు ప్రణాళికలు, బంగ్లాదేశ్‌కు తిరుగు ప్రయాణం వంటి విషయాలపై మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


షేక్ హసీనా దాదాపు 15 ఏళ్ల పాటు బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, 2024 ఆగస్టు 5న విద్యార్థుల సారథ్యంలో కోటా వ్యవస్థకు (రిజర్వేషన్) వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటడంతో ఆమె పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నిరసనకారులు అధికారిక భవనాలపై దాడులకు దిగడంతో ఆమె భారత్‌కు చేరుకున్నారు. భారత్‌‌లో రెండేళ్లుగా ఉంటున్నప్పటికీ ఆమె మీడియా ముందుకు రాలేదు. దీంతో, ఈ మీడియా సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొంటారు.


షేక్ హసీనా దేశాన్ని వీడిన అనంతరం నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికలు జరగ్గా బీఎన్‌పీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రధానిగా తారిఖ్ రెహ్మాన్ బాధ్యతలు స్వీకరించారు. అయితే, యూనస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం అవామీ లీగ్‌పై చేపట్టిన చట్టపరమైన చర్యలను బీఎన్‌పీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. ప్రస్తుతం అవామీ లీగ్ కార్యకలాపాలపై నిషేధం ఉంది. పార్టీపై ఉగ్రవాద కేసు కూడా కోర్టులో కొనసాగుతోంది.


ఈ వార్తలనూ చదవండి:

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. ఏడుగురి మృతి

ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..

Updated Date - Aug 02 , 2026 | 10:10 PM