సౌదీలో హిందూ వ్యక్తికి ఊరట.. మరణ శిక్ష రద్దు
ABN , Publish Date - Oct 14 , 2026 | 02:08 PM
సౌదీలో మరణ శిక్ష పడ్డ ఓ శ్రీలంక పౌరుడు అనుజన్ శివరసకు తాజాగా ఊరట దక్కింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అతడికి విధించిన మరణ శిక్షను సౌదీ సుప్రీంకోర్టు తాజాగా రద్దు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: సౌదీలో మరణ శిక్ష పడ్డ శ్రీలంక పౌరుడు అనుజన్ శివరసకు తాజాగా ఊరట దక్కింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అతడికి విధించిన మరణ శిక్షను సౌదీ సుప్రీంకోర్టు తాజాగా రద్దు చేసింది. హిందువు అయిన శివరస సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడు. జూన్ నెలలో నెట్టింట వైరల్ అయిన ఓ వీడియోపై శివరస ఫేస్బుక్ వేదికగా చేసిన వ్యాఖ్యలు అతడిని ఊహించని ప్రమాదంలోకి నెట్టాయి.
శ్రీలంకలో హిందువుల తీర్థయాత్రలో భక్తుల వెనకాల వెళుతున్న ఓ శునకాన్ని ఓ ముస్లిం యువకుడు కొట్టిన వీడియో అప్పట్లో వైరల్గా మారింది. నెట్టింట కలకలానికి దారి తీసింది. ఈ వీడియోపై శివరస కూడా స్పందిస్తూ మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ తరువాత ఆ పోస్టును డిలీట్ చేశాడు. అయితే, ఈ విషయాన్ని శ్రీలంకలోని కొందరు సౌదీలో శివరస ఉద్యోగం చేస్తున్న కంపెనీ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, రంగంలోకి దిగిన సౌదీ పోలీసులు ఆ పోస్టు స్క్రీన్ షాట్స్ ఆధారంగా శివరసపై కేసు నమోదు చేశారు. జులై 15న స్థానిక కోర్టు అతడికి మొదటగా ఐదేళ్ల జైలు శిక్ష, 8 లక్షల డాలర్ల జరిమానా విధించింది. ఆ తరువాత అది కాస్తా మరణ శిక్షగా మారింది.
ఈ నేపథ్యంలో శ్రీలంక దౌత్య ప్రయత్నాలు ముమ్మరం చేసింది. శ్రీలంకకు చెందిన తమిళ, ముస్లిం ఎంపీలు సౌదీ విదేశాంగ శాఖతో చర్చించారు. యువకుడిని క్షమించాలని అభ్యర్థించారు. ఈ దిశగా బౌద్ధ, హిందూ సంఘాల వారు కూడా వినతులు సమర్పించారు. ఈ ప్రయత్నాలు ఫలించడంతో అక్టోబర్ 13న అక్కడి సుప్రీం కోర్టు శివరసకు విధించిన మరణ శిక్షను రద్దు చేసింది. అయితే, మునుపటి తీర్పు ప్రకారం అతడు ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందా? లేదా? అన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
శ్వేతసౌధం కొత్త ప్రెస్ సెక్రటరీ తడబాటు.. ఊహించని మిస్టేక్..
పాకిస్థాన్లో 22 శాతం నీటి కొరత.. సొంత తప్పిదాలే కారణమా?