Share News

హ్యాండిచ్చిన పాక్.. ఇజ్రాయెల్‌ను ఆశ్రయించిన సౌదీ అరేబియా

ABN , Publish Date - Sep 15 , 2026 | 06:58 PM

హూతీల విషయంలో సాయం చేయలేమని పాక్ తేల్చి చెప్పడంతో సౌదీ అరేబియా చివరకు ఇజ్రాయెల్‌ సాయం కోరినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

హ్యాండిచ్చిన పాక్.. ఇజ్రాయెల్‌ను ఆశ్రయించిన సౌదీ అరేబియా
Saudi Arabia Seeks Israel's Help

ఇంటర్నెట్ డెస్క్: యెమెన్ మిలిటెంట్ గ్రూప్ హూతీల దాడులతో సౌదీ అరేబియా సతమతం అవుతోంది. బాబ్ అల్ మాండెబ్‌ను హూతీలు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో కూరుకుపోయింది. ఆదుకుంటుందనుకున్న పాక్ కూడా చివరకు హ్యాండివ్వడంతో సౌదీ అరేబియా చివరకు ఇజ్రాయెల్ సాయం కోరింది.

ఇరాన్ మద్దతు ఉన్న హూతీలకు, సౌదీ అరేబియాకు మధ్య కొన్నేళ్లుగా ఘర్షణలు సాగుతున్నాయి. ప్రాంతీయ ఆధిపత్యం నిలబెట్టుకునేందుకు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఇటీవల కొంతకాలంగా సౌదీపై డ్రోన్ దాడులను చేస్తున్న హూతీలు గతవారం అకస్మాత్తుగా దూకుడు పెంచారు. సౌదీకి సమీపంలోని యెమెన్ తీర ప్రాంతాల్లో ప్రభుత్వ దళాలను తరిమేసి తమ స్వాధీనం చేసుకున్నారు. సౌదీ చమురు ఎగుమతులకు కీలకంగా మారిన బాబ్ అల్ మాండెబ్ జలసంధిని కూడా తమ అదుపులోకి తెచ్చుకున్నారు. ఇరాన్ యుద్ధంతో హోర్ముజ్ మూసుకుపోవడంతో సౌదీ అరేబియా బాబ్ అల్ మండెబ్ మీదుగా తన వాణిజ్యాన్ని కొనసాగిస్తోంది. ఇప్పుడు ఆ దారీ మూసుకుపోవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.


ఇటీవల తుర్కియే, పాకిస్థాన్‌లతో కుదిరిన మక్కా ఒప్పందం అక్కరకు వస్తుందనుకున్న సౌదీ అశలు అడియాశలే అయ్యాయి. హౌతీలపై దాడులకు తమ సైన్యాన్ని దింపలేమని పాక్ స్పష్టం చేసింది. మక్కా ఒప్పందం కేవలం రక్షణాత్మకమైనదని మాత్రమేనని చెప్పింది. విదేశీ నేలపై దాడులకు సైన్యాన్ని ఇవ్వబోమని పేర్కొంది. ఇప్పటికే ఇరాన్‌తో పోరాడుతున్న యూఎస్‌ కూడా హూతీలపై దాడులు చేయలేమని తేల్చి చెప్పింది. నిఘా సమాచారం, సలహాసూచనలు మాత్రమే ఇవ్వగలమని వెల్లడించింది. యూకే కూడా ఈ విషయంలో తన నిస్సహాయతను వ్యక్తం చేసింది.


ఇలా దాదాపుగా దారులన్నీ మూసుకుపోవడంతో సౌదీ అరేబియా ఇజ్రాయెల్‌ను ఆశ్రయించింది. హూతీల కట్టడికి సహకరించాలని కోరింది. గతంలో హూతీలు ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేశారు. బాబ్ అల్ మాండెబ్ మీదుగా సాగే ఇజ్రాయెల్ నౌకలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తమకు అండగా నిలుస్తుందని సౌదీ భావిస్తోంది. అయితే, హూతీలపై నేరుగా దాడులు ఉండకపోవచ్చని ఇజ్రాయెల్ వర్గాలు చెబుతున్నాయి. ఈ దిశగా ఎలాంటి చర్యలైనా అంతర్జాతీయ కూటమిలో భాగంగానే చేపడతామని చెబుతున్నాయి. మరోవైపు, హూతీలు సౌదీపై ఒత్తిడి పెంచుతున్నారు. సౌదీ నౌకలను బాబ్ అల్ మాండెబ్‌ను దాటనీయమని వార్నింగ్ ఇచ్చారు. ఇతర దేశాల నౌకలకు మాత్రం ఎలాంటి సమస్యా ఉండబోదని హామీ ఇచ్చారు.


ఈ వార్తలనూ చదవండి:

విమానంలో మహిళ కలకలం.. దుస్తులు విప్పేసి..

చైనాను వీడిన హువావే కంపెనీ సీఈఓ?

Updated Date - Sep 15 , 2026 | 08:29 PM