మా జలాల్లోకి రష్యా జలాంతర్గామి
ABN , Publish Date - Apr 10 , 2026 | 05:26 AM
రష్యాకు చెందిన ఒక అటాక్ సబ్‌మెరైన్, మరికొన్ని ప్రత్యేక నౌకలు తమ దేశానికి సమీపంలోని అంతర్జాతీయ జలాల్లోకి చొరబడి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడేందుకు సముద్ర గర్భంలో...
సముద్రగర్భంలోని ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను ధ్వంసం చేసే కుట్ర
నార్వేతో కలిసి రష్యా కుయుక్తిని తిప్పికొట్టాం: బ్రిటన్
లండన్, ఏప్రిల్ 9: రష్యాకు చెందిన ఒక అటాక్ సబ్‌మెరైన్, మరికొన్ని ప్రత్యేక నౌకలు తమ దేశానికి సమీపంలోని అంతర్జాతీయ జలాల్లోకి చొరబడి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడేందుకు (సముద్ర గర్భంలో ఉండే ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను నాశనం చేయడానికి) ప్రయత్నించాయని బ్రిటన్ ఆరోపించింది. అయితే, రష్యా కుయుక్తులను తమ సాయుధ దళాలు ముందుగానే పసిగట్టి ఆ నౌకలను విజయవంతంగా తిప్పికొట్టాయని బ్రిటన్ రక్షణ శాఖ వెల్లడించింది. కొన్ని వారాల క్రితం హై నార్త్ ప్రాంతంలోని అంతర్జాతీయ జలాల్లోకి రష్యాకు చెందిన ఒక అటాక్ సబ్‌మెరైన్ ప్రవేశించడాన్ని తమ విమానాలు, యుద్ధనౌకలు గుర్తించాయని, దాని కదలికలను నిరంతరం పర్యవేక్షించాయని వెల్లడించింది. తమ దృష్టిని మళ్లించడం కోసమే రష్యా అలా తొలుత అకులా క్లాస్ జలాంతర్గామిని తమ జలాల్లోకి పంపిందని.. అనంతరం రష్యాకు చెందిన సముద్రగర్భ పరిశోధన సంస్థకు (గుగి) చెందిన నౌకలు సముద్రం అడుగున ఉన్న కేబుళ్లను దెబ్బతీయడానికి ప్రయత్నించాయని యూకే రక్షణశాఖ వర్గాలు వివరించాయి. ఆ కేబుళ్ల ద్వారానే ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఇంటర్‌నెట్ సేవలు అందుతాయి. అంతర్జాతీయ ఫోన్ కాల్స్, బ్యాంకింగ్ లావాదేవీలకు కారణం ఆ కేబుళ్లే. రష్యా వ్యూహాన్ని అర్థం చేసుకున్న బ్రిటన్ నార్వేతో కలిసి దాన్ని అడ్డుకునేందుకు భారీ ఆపరేషన్ చేపట్టింది. దీంతో రష్యా జలాంతర్గామి, గుగి నౌకలు తమ రహస్య ఆపరేషన్‌ను పూర్తిచేయడంలో విఫలమై తిరిగి తమ దేశానికి వెళ్లిపోయాయని బ్రిటన్ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స
ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం
Read Latest AP News And Telugu News