Share News

అబుధాబిలో రష్యా-ఉక్రెయిన్‌ చర్చలు

ABN , Publish Date - Nov 12 , 2026 | 03:32 AM

రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య ఏళ్లుగా కొనసాగుతోన్న యుద్ధానికి ముగింపు పలికేందుకు యూఏఈ రాజధాని అబుధాబీలో చర్చలు జరిగాయి

అబుధాబిలో రష్యా-ఉక్రెయిన్‌ చర్చలు
russia ukrine talks

  • యుద్ధ ఖైదీలను మార్చుకొనేందుకు ఓకే

  • చర్చలు ఫలవంతమయ్యాయన్న అమెరికా

అబుధాబీ, న్యూఢిల్లీ, నవంబరు 11: రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య ఏళ్లుగా కొనసాగుతోన్న యుద్ధానికి ముగింపు పలికేందుకు యూఏఈ రాజధాని అబుధాబీలో చర్చలు జరిగాయి. అమెరికా మధ్యవర్తిత్వంలో మంగళ, బుధవారాల్లో వీటిని నిర్వహించారు. భవిష్యత్తు భద్రతపై రెండు దేశాలకు హామీ కల్పించేందుకే ఈ చర్చలు జరుపుతున్నట్లు అమెరికా తెలిపింది. మంగళవారం నాలుగు గంటలపాటు చర్చలు సాగాయి. ఉక్రెయిన్‌ నాటోలో చేరకూడదని, ఆ దేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి ఉక్రెయిన్‌సైన్యం వైదొలగాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పట్టుబడుతున్నారు. సైనిక, ఆయుధ ఆంక్షలకు కూడా అంగీకరించాలని కోరుతున్నారు. ఈ డిమాండ్లకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఒప్పుకోవడం లేదు. అమెరికా తరఫున ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌, అమెరికా రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌ ఈ చర్చల్లో పాల్గొన్నారు. రష్యా తరఫున పుతిన్‌ సన్నిహితుడు మెదిన్స్కీ చర్చల్లో పాల్గొన్నారు. కాగా భారీ సంఖ్యలో యుద్ధ ఖైదీలను మార్చుకొనేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని, ఎంతమంది ఖైదీలను విడుదల చేసేది గురువారం ఖరారు అవుతుందని చర్చల్లో పాల్గొన్న వారు చెప్పారు. కాగా అబుధాబీ చర్చలు ఫలవంతమయ్యాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో చెప్పారు. అయితే యుద్ధానికి ముగింపు పలకడానికి ఇంకా సమయం పడుతుందన్నారు

Updated Date - Nov 12 , 2026 | 04:32 AM