పీఓకేలో పతాకస్థాయికి ఉద్రిక్తతలు.. పాక్‌కు నిరసనకారుల అల్టిమేటమ్
ABN , Publish Date - Jul 09 , 2026 | 07:14 PM
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరాయి. పాక్ ప్రభుత్వ తీరుపై నిరసనకారులు మండిపడుతున్నారు. తమ డిమాండ్స్‌కు పాక్ పాలకులు 48 గంటల్లోపు అంగీకరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరాయి. పాక్ ప్రభుత్వ తీరుపై నిరసనకారులు మండిపడుతున్నారు. తమ డిమాండ్స్‌కు పాక్ పాలకులు 48 గంటల్లోపు అంగీకరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) సారథ్యంలో నిరసనకారులు ఈ అల్టిమేటమ్ జారీ చేశారు. మొత్తం 38 డిమాండ్స్‌ను ప్రభుత్వం ముందుంచారు.
ఎందుకీ నిరసనలు..
పీఓకే అభివృద్ధి కోసం పాక్ పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని జేఏఏసీ ఆరోపిస్తోంది. రాజకీయంగా పీఓకేపై ఆధిపత్యం సాధించేందుకు రకరకాల కుయుక్తులను పాక్ పాలకులు పన్నుతున్నారని మండిపడుతోంది. పీఓకే అసెంబ్లీలో 12 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను పాక్ పాలకులే నామినేట్ చేయడంపై జేఏఏసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
పాక్ నుంచి వలసొచ్చిన 4.36 లక్షల మంది ఓటర్ల కోసం ఈ 12 సీట్లను కేటాయించడం, 33 లక్షల మంది పీఓకే ఓటర్లకు మాత్రం కేవలం 33 సీట్లే ఉండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పీఓకేను తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ఈ ఎత్తుగడకు పాక్ పాలకులు తెరతీశారని జేఏఏసీ మండిపడుతోంది. ఈ 12 సీట్లకు రాజ్యాంగపరమైన రక్షణ ఉందని ఇటీవల పాక్ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడం అగ్నికి ఆజ్యం పోసినట్టైంది.
ఈ నేపథ్యంలో నామినేటెడ్ సీట్లను రద్దు చేయాల్సిందేనని జేఏఏసీ డిమాండ్ చేస్తోంది. వీటితో పాటు గతంలో ప్రతిపాదించిన హైడ్రోప్రాజెక్టులపై మళ్లీ చర్చలు ప్రారంభించడం, నిత్యావసరాలపై సబ్సిడీలు పెంచడం, విద్యుత్ ధరలు తగ్గించడం వంటి 38 డిమాండ్స్ ప్రభుత్వం ముందుంచింది. ఇక జులై 27న పీఓకేలో ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచీ అభ్యర్థుల నామినేషన్ స్వీకరణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే జేఏఏసీ తాజా అల్టిమేటమ్‌ను జారీ చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
చైనాలో ప్రకృతి వైపరీత్యాల బీభత్సం.. దూసుకొస్తున్న భీకర టైఫూన్ ‘బావి’..
భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ మళ్లీ పాత పాట.. నోబెల్ రావాలంటూ కామెంట్!