Share News

ఫిలిప్పీన్స్ స్కూల్‌లో కాల్పులు.. ఇద్దరి మృతి

ABN , Publish Date - Sep 18 , 2026 | 03:18 PM

ఫిలిప్పీన్స్‌లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. బంగా టౌన్‌లోని ఓ స్కూల్లో 16 ఏళ్ల బాలుడు కాల్పులకు తెగబడటంతో ఇద్దరు మృతి చెందారు.

ఫిలిప్పీన్స్ స్కూల్‌లో కాల్పులు.. ఇద్దరి మృతి
Philippines School shooting

ఇంటర్నెట్ డెస్క్: ఫిలిప్పీన్స్‌లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. బంగా టౌన్‌లోని ఓ స్కూల్లో 16 ఏళ్ల బాలుడు కాల్పులకు తెగబడటంతో ఇద్దరు మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిందితుడు కూడా మరణించాడని టౌన్ మేయర్ ఆల్బర్ట్ పాలెన్షియా తెలిపారు. అయితే, అతడు ఎలా మరణించాడనే వివరాలు మాత్రం వెల్లడించలేదు.

గాయపడ్డ ఎనిమిది మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని మేయర్ తెలిపారు. సమీప ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స ఇస్తున్నామని అన్నారు. బాధితులు అందరూ 14 - 17 ఏళ్ల మధ్య వారేనని చెప్పారు. కాల్పులకు కారణమేంటో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై అక్కడి విద్యా శాఖ విచారం వ్యక్తం చేసింది.


ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తుపాకీ శబ్దం వినగానే చిన్నారులు భయంతో బయటకు పరుగులు తీసిన వైనం వీడియోలో రికార్డైంది. గాయపడ్డ వారిని కొందరు స్కూల్ నుంచి బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి.

గత నెలలోనే ఓ విద్యార్థి క్లాస్ రూమ్‌లో మరో విద్యార్థిని హత్య చేసి ఆపై తనని తాను కాల్చుకుని చనిపోయాడు. ఇదంతా లైవ్ స్ట్రీమ్ చేయడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. జూన్ నెలలో జరిగిన మరో ఘటనలో ఇద్దరు విద్యార్థులు ఓ పబ్లిక్ స్కూల్‌లో కాల్పులకు తెగబడటంతో ముగ్గురు విద్యార్థులు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. ఫిలిప్పీన్స్‌లో గన్‌లైసెన్సులకు సంబంధించి కఠిన చట్టాలు ఉన్నాయి. అయితే, అక్రమమార్గాల్లో జరుగుతున్న తుపాకీల విక్రయాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోతోందని స్థానికులు విమర్శిస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

భారీ ఎత్తున 'శాక్రిఫైస్ ఫర్ ఇరాన్' పరేడ్.. డ్రోన్ల ప్రదర్శనతో శత్రుదేశాలకు హెచ్చరిక

ఆంక్షల చట్టంతో భారత్, అమెరికా సంబంధాలపై ప్రభావం: విదేశాంగ శాఖ

Updated Date - Sep 18 , 2026 | 03:41 PM