ఫిలిప్పీన్స్ భూకంపం.. 15 మంది దుర్మరణం
ABN , Publish Date - Jun 08 , 2026 | 01:12 PM
ఫిలిప్పీన్స్ భూకంపం ధాటికి 15 మంది మరణించారు. 200 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను రక్షించేందుకు ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఫిలిప్పీన్స్‌లోని మిండానోవ్ ద్వీపం దక్షిణ తీరానికి కొద్ది దూరంలో సోమవారం సంభవించిన భూకంపం ప్రాణనష్టం మిగిల్చింది. 15 మంది మృతి చెందగా 200 మంది గాయాలపాలయ్యారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.1గా నమోదైనట్టు బ్లూమ్‌బర్గ్ ఒక కథనాన్ని ప్రచురించింది. అనంతరం తీవ్రతను 7.8గా సవరించారు. భూకంపం ధాటికి అక్కడ పలు భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని పూర్తిగా నెలమట్టమయ్యాయి. సునామీ హెచ్చరికలను కూడా జారీ చేసిన ప్రభుత్వం తీర వెంబడి ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
భూకంపం ధాటికి సముద్రంలో భారీ అలలు ఎగసిపడ్డాయి. మీటరు ఎత్తు ఉన్న అలలు మిండానోవ్ దక్షిణ తీరప్రాంతంలోకి చొచ్చుకెళ్లాయి. భూమి కంపించడంతో భవనాలు దెబ్బతిన్నాయి. పలు హైస్కూళ్లు, కళాశాలల భవనాలు దెబ్బతిన్నట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
మిండానోవ్‌లో దక్షిణ తీరప్రాంత నగరం జనరల్ శాంటోస్ అధికంగా ప్రభావితమైంది. ‘చాలా భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని కూలిపోయాయి. నష్టం ఏ మేరకు జరిగిందో ఇంకా మాకు తెలియదు. ప్రస్తుతం క్షతగాత్రులను కాపాడేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాము’ అని జనరల్ శాంటోస్ నగర పోలీసు ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. అలాబెల్ టౌన్‌లోని ఒక పోలీస్ స్టేషన్ పాక్షికంగా దెబ్బతింది.
ద్వీపకల్ప దేశమైన ఫిలిప్పీన్స్‌లో దాదాపు 7,641 ద్వీపాలు ఉన్నాయి. వీటిని మూడు గ్రూపులుగా వర్గీకరిస్తారు. ఉత్తరాన లుజోన్ గ్రూపు, మధ్యలో విసాయస్ గ్రూపు, దక్షిణాన మిండానోవ్ గ్రూపు ద్వీపాలు ఉంటాయి. మిండానోవ్ గ్రూపులో ప్రధానమైన మిండానోవ్ ద్వీపం దక్షిణ తీరానికి సమీపంలో సముద్రం అడుగున భూకంప కేంద్రం ఉన్నట్టు అక్కడి సంస్థలు పేర్కొన్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
డొమినికన్ రిపబ్లిక్ విమానాశ్రయంలో కుప్పకూలిన జెట్.. ఇద్దరి మృతి
భారీ భూకంపం.. ఫిలిప్పీన్స్‌లో సునామీ హెచ్చరికలు జారీ