Share News

మ్యాన్‌హోల్ కవర్స్ చోరీ చేస్తే రూ.50 లక్షల ఫైన్.. పాక్‌లో చట్టం

ABN , Publish Date - Feb 06 , 2026 | 07:10 PM

మ్యాన్‌హోల్స్ కవర్స్‌ చోరీని అరికట్టేందుకు పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్ తాజాగా ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం, ఈ కవర్‌లను చోరీ చేసే వారికి గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష రూ.50 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది.

మ్యాన్‌హోల్ కవర్స్ చోరీ చేస్తే రూ.50 లక్షల ఫైన్.. పాక్‌లో చట్టం
Manhole Cover - Stealing 10 Year Jail Term, 50 Lakh Fine

ఇంటర్నెట్ డెస్క్: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన పాకిస్థాన్‌లో (Pakistan) మ్యాన్‌హోల్ కవర్‌ల చోరీలు (Manhole Cover Theft) పెరగడం కలకలం రేపుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు పంజాబ్‌ ప్రావిన్స్‌ (Punjab Province) ప్రభుత్వం ఓ ప్రత్యేక చట్టాన్ని కూడా తెచ్చింది. స్థానిక మీడియా ఈ చట్టాన్ని ‘గట్టర్ లా’ (మురుగు చట్టం- Gutter Law) అని కూడా పేరు పెట్టేసింది. ఈ చట్టం ప్రకారం, మ్యాన్‌హోల్ కవర్స్ చోరీ చేసిన వారికి గరిష్ఠంగా 10 ఏళ్ల కారాగార శిక్షతో పాటు రూ. 50 లక్షల (పాకిస్థానీ కరెన్సీ) జరిమానా విధించే అవకాశం ఉంది.

పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియమ్ నవాజ్ ఇటీవల ఈ చట్టాన్ని ప్రవేశపెడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పొద్దున్న సిబ్బంది మ్యాన్‌హోల్స్‌పై కవర్స్ ఏర్పాటు చేసి వెళితే సాయంత్రాని కల్లా వాటిని జనాలు చోరీ చేస్తున్నారు. అలా చేయకండి. వీటిని చోరీ చేసే వారు, కొనుగోలు చేసేవారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తాము. మ్యాన్‌హోల్ కవర్స్ చోరీ కారణంగా మరణాలు సంభవిస్తే బాధ్యులకు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 లక్షల జరిమానా విధిస్తాము’ అని ఆమె పేర్కొన్నారు. మ్యాన్‌హోల్‌పై కవర్ చోరీ కావడంతో ఓ తల్లీబిడ్డ అందులో పడి ఇటీవల మరణించడం స్థానికంగా కలకలానికి దారి తీసింది. దీంతో, పంజాబ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.


ఎందుకీ చోరీలు..

పాక్‌‌లో ఆర్థిక కష్టాలు ఎక్కువ కావడంతో జనాలకు ఉపాధి కరువై చోరీలకు దిగుతున్నారని అక్కడి మీడియా చెబుతోంది. మ్యాన్‌హోల్ కవర్స్‌కు ఉన్న ఇనుప చట్రాలను మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకునే అవకాశం ఉండటంతో జనాలు చోరీలకు దిగుతున్నారట. వరల్డ్ బ్యాంకు-2025 నివేదిక ప్రకారం, పాక్‌లోని 45 శాతం మంది జనాభా పేదరికంలో మగ్గుతున్నారు. వీరిలో 16.5 శాతం మంది దుర్భర దారిద్ర్యంలో బతుకీడుస్తున్నారు.


ఇవీ చదవండి:

ఎప్‌స్టీన్ ఫైల్స్ కలకలం.. బ్రిటన్ ప్రధాని క్షమాపణలు

క్షమాపణ చెబుతున్నా.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై బిల్ గేట్స్ స్పందన


Updated Date - Feb 06 , 2026 | 07:16 PM