Share News

చందమామపై అణు రియాక్టర్లు!

ABN , Publish Date - Oct 06 , 2026 | 04:15 AM

చందమామపై శాశ్వత స్థావరాలు (పర్మనెంట్‌ బేస్‌) నిర్మించే యోచనలో ఉన్న అమెరికా, చైనా, రష్యా దేశాలు.. ఆ బేస్‌లకు అవసరమైన విద్యుదుత్పత్తి కోసం అణు రియాక్టర్లను అమర్చే (ఇన్‌స్టాల్‌ చేసే) పోటీకి దిగాయి

చందమామపై   అణు రియాక్టర్లు!
moon

  • రేసులో అమెరికా, చైనా, రష్యా

  • 2030 నాటికి అణు రియాక్టర్‌ను

జాబిల్లిపైకి పంపేందుకు నాసా ప్రణాళికలు

  • రష్యా, చైనా కలిసి 2036 నాటికి..

న్యూయార్క్‌, అక్టోబరు 5: చందమామపై శాశ్వత స్థావరాలు (పర్మనెంట్‌ బేస్‌) నిర్మించే యోచనలో ఉన్న అమెరికా, చైనా, రష్యా దేశాలు.. ఆ బేస్‌లకు అవసరమైన విద్యుదుత్పత్తి కోసం అణు రియాక్టర్లను అమర్చే (ఇన్‌స్టాల్‌ చేసే) పోటీకి దిగాయి. 2030 నాటికల్లా చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద అణు రియాక్టర్‌ను అమర్చేందుకు అమెరికా ప్రణాళికలు రచిస్తుండగా.. రష్యా, చైనాలు ఉమ్మడిగా 2036 నాటికి ఆ పని పూర్తిచేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. లూనార్‌ బేస్‌లకు విద్యుత్తు అందించడానికే కాక.. జాబిలిపై వనరుల అన్వేషణకు, అక్కణ్నుంచీ రోదసిలో జరిపే మరిన్ని అన్వేషణలకు ఈ అణు రియాక్టర్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఆ మూడు దేశాలూ భావిస్తున్నాయి. భూమ్మీద నిర్మించినట్టుగా చందమామపై అణు రియాక్టర్‌ను నిర్మించడం కష్టం కాబట్టి.. భూమ్మీదే వాటిని నిర్మించి, ఇన్‌-యాక్టివ్‌ స్టేట్‌లో రాకెట్‌ ద్వారా వాటిని చందమామపైకి పంపి అక్కడ ఇన్‌స్టాల్‌ చేయాలన్నది వాటి ఆలోచన. అందులో భాగంగా.. చంద్రుడి దిశగా చేసే ప్రయాణంలో ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకోగలిగే, అక్కడ ఎలాంటి నిర్వహణ భారమూ లేకుండానే పనిచేయగలిగే (ప్లగ్‌ అండ్‌ ప్లే తరహా) అణు రియాక్టర్లను తయారుచేయాల్సిందిగా నాసా ఈ ఏడాది ఆగస్టులో తన కాంట్రాక్టర్లను కోరింది. 2030 డిసెంబరునాటికి దాన్ని లాంచింగ్‌కు సిద్ధం చేయాల్సిందిగా సూచించింది. ఈ అంశంపై ‘న్యూయార్క్‌టైమ్స్‌’ ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. నాసా ఏర్పాటు చేయబోయే అణు రియాక్టర్‌ 20 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రష్యా కూడా.. చైనాతో రహస్య భాగస్వామ్యం కుదుర్చుకుని 10 కిలోవాట్ల విద్యుదుత్పత్తి చేసే అణు రియాక్టర్‌ను 2036 నాటికి చంద్రుడిపై ఏర్పాటు చేసే యత్నాల్లో ఉంది.


అణు రియాక్టర్లు ఎందుకు?

చంద్రుడిపై ఏర్పాటు చేసే శాశ్వత స్థావరాలు మనుగడ సాధించాలంటే విద్యుత్తు చాలా కీలకం. సౌర ఫలకాల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్నా అది పగటిపూట మాత్రమే సాధ్యం. చంద్రుడిపై పగలు అంటే.. మనలాగా 12 గంటలు కాదు.. నెలలో ఏకంగా రెండువారాలపాటు ఉంటుంది. మిగతా రెండువారాలూ రాత్రి ఉంటుంది. అప్పుడు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయి. కాబట్టి సౌర విద్యుత్‌పై ఆధారపడలేని పరిస్థితి. అదే అణు రియాక్టర్లయితే పెద్దగా మానవ ప్రమేయం అవసరం లేకుండానే విద్యుదుత్పత్తి చేయగలవు. అయితే.. ఈ అణు రియాక్టర్లను మోసుకెళ్లే రాకెట్లు మధ్యలోనే ఏవైనా సాంకేతిక కారణాలతో పేలిపోయి, రియాక్టర్‌లోని ఇంధన కోర్‌ ముక్కలైతే.. రేడియో యాక్టివ్‌ పదార్థాలు వాతావరణంలో విస్తరించే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ విజయవంతంగా తీసుకెళ్లగలిగినా.. చంద్రుడిపై ఆ రియాక్టర్లను ఏర్పాటుచేయడం, వాటిని నిర్వహించడం సవాళ్లతో కూడుకున్న పని అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ.

ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యం కోల్పోతోంది.. సంస్కరణలు తప్పనిసరి: జైశంకర్

Updated Date - Oct 06 , 2026 | 04:16 AM