24 ఏళ్ల క్రితం మిస్సింగ్.. ఇప్పటికీ అంతు చిక్కని కారణం
ABN , Publish Date - Feb 25 , 2026 | 08:47 PM
నార్త్ కరోలినాకు చెందిన మిచెల్ లిన్ హండ్లీ స్మిత్ అనే మహిళ 2001 డిసెంబర్ 9వ తేదీన కనిపించకుండా పోయింది. ఈడెన్‌లోని ఇంటినుంచి క్రిస్మస్ షాపింగ్ కోసం వర్జీనియాలోని కేమార్ట్‌కు వెళ్లిన ఆమె మళ్లీ తిరిగిరాలేదు. 24 ఏళ్ల తర్వాత ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన మిచెల్ లిన్ హండ్లీ స్మిత్ అనే మహిళ 2001 డిసెంబర్ 9వ తేదీన కనిపించకుండా పోయింది. ఈడెన్‌లోని ఇంటినుంచి క్రిస్మస్ షాపింగ్ కోసం వర్జీనియాలోని కేమార్ట్‌కు వెళ్లిన ఆమె మళ్లీ తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా లాభం లేకుండాపోయింది. దీంతో డిసెంబర్ 31వ తేదీన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులకు కూడా ఆమె ఆచూకీ దొరకలేదు.
దీంతో దేశానికి చెందిన ప్రముఖ దర్యాప్తు సంస్థలు ఆమె కోసం నార్త్ కరోలినా మొత్తం జల్లెడ పట్టాయి. అయినా కూడా స్మిత్ జాడ దొరకలేదు. కుటుంబసభ్యులు స్మిత్‌పై ఆశలు వదిలేసుకున్నారు. నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. 24 ఏళ్ల తర్వాత ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 20వ తేదీన స్మిత్ ఆచూకీ పోలీసులకు తెలిసింది. పోలీసులు ఆమె దగ్గరకు వెళ్లారు. మిస్సింగ్ గురించి ఆమెను విచారించగా..
‘కుటుంబ తగాదాల కారణంగా దూరంగా వచ్చాను. నేను ఇంటికి వెళ్లాలని అనుకోవటం లేదు. నేను ఇక్కడ ఉన్న సంగతి ఎవరికీ చెప్పొద్దు’ అని అంది. అయితే, ఏ గొడవల కారణంగా తను ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్లిపోయిందో మాత్రం వివరంగా చెప్పలేదు. పోలీసుల విచారణలో స్మిత్ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని తేలింది. స్మిత్ వయసు ప్రస్తుతం 62 సంవత్సరాలు. ఆమె ఇంటినుంచి వెళ్లిపోయి 24 సంవత్సరాలు పైనే అవుతున్నా.. అందుకు కారణం ఏంటో ఇప్పటి అంతుచిక్కటం లేదు. ఆమె తన భర్తను, పిల్లల్ని కలవడానికి ఇష్టపడకపోవటం గమనార్హం.
ఇవి కూడా చదవండి
గుడ్డు లోపలి నుంచి ప్లాస్టిక్.. విక్రయించిన కంపెనీ ఏం చెప్పిందంటే..
అనిల్ అంబానీకి ఈడీ షాక్.. రూ.3,717 కోట్ల విలువైన ముంబై నివాసం జప్తు