న్యూట్రినోల అన్వేషణకు నోబెల్
ABN , Publish Date - Oct 07 , 2026 | 03:03 AM
ప్రముఖ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్‌కు ఈ ఏడాది భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది.
భౌతికశాస్త్రంలో ఫ్రాన్సిస్
హాల్జెన్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం
ఐస్‌క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ
కేంద్రం ఏర్పాటుకు కృషి
స్టాక్‌హోమ్, అక్టోబరు 6: ప్రముఖ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్‌కు ఈ ఏడాది భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది. ఐస్‌క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ కేంద్రం ఏర్పాటుకు కృషి చేసి, అత్యంత శక్తివంతమైన ఖగోళ న్యూట్రినో(ఆస్ట్రోఫిజికల్ న్యూట్రినోలు)లను గుర్తించినందుకు స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 82 ఏళ్ల హాల్జెన్‌కు మంగళవారం ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రకటించింది. ‘‘ఫ్రాన్సిస్ హాల్జెన్ నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల బృందం మనకు అద్భుతమైన పరికరాన్ని అందించింది. ఆయన పట్టుదల, శాస్త్రీయ దృక్పథం కొత్తరకమైన ఖగోళశాస్ర్తానికి మార్గం సుగమం చేశాయి’’ అని భౌతికశాస్త్ర నోబెల్ కమిటీ చైర్మన్ మార్క్ పియర్స్ అన్నారు. ఫ్రాన్సిస్ హాల్జెన్ బెల్జియంలో జన్మించారు.
మంచు పొరల్లో గుర్తింపు
న్యూట్రినోలు అత్యంత సూక్ష్మ కణాలు. వీటిని ఘోస్ట్ పార్టికల్స్(భూత కణాలు)గా భావిస్తుంటారు. విశ్వం నుంచి నిరంతరం భూమిపైకి దూసుకొచ్చే ఈ కణాలు మన కంటికి కనిపించవు. వాటి రహస్యాన్ని ఛేదించేందుకు దక్షిణ ధ్రువంలోని మంచునే ఒక భారీ పరిశోధనా కేంద్రంగా మార్చిన ఫ్రాన్సిస్ హాల్జెన్ ఖగోళ మూలాల నుంచి దూసుకొచ్చే అత్యంత శక్తివంతమైన న్యూట్రినోలను గుర్తించగలిగారు. వీటిని గుర్తించేందుకు అంటార్కిటికాలోని దక్షిణ ధ్రువం వద్ద ఐస్‌క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ కేంద్రాన్ని ఏర్పాటుకు ఆయన కృషి చేశారు. ఇక్కడ భారీ మంచు పొరలో లోతుగా వేలాది కాంతి పరికరాలను అమర్చి ఈ వ్యవస్థను నిర్మించారు. న్యూట్రినో మంచులోని అణువుతో ఢీకొట్టినప్పుడు ఏర్పడే సూక్ష్మమైన కాంతి సంకేతాలను ఈ పరికరాలు గుర్తిస్తాయి. ఆ సంకేతాలను విశ్లేషించడం ద్వారా న్యూట్రినోలు వచ్చిన దశ, దాని శక్తి వంటి వివరాలను శాస్త్రవేత్తలు తెలుసుకుంటారు. విశ్వంలో అత్యంత శక్తివంతమైన ఘటనలను అధ్యయనం చేసేందుకు కొత్త మార్గాన్ని చూపిన హాల్జెన్ కృషికి నోబెల్ దక్కింది. దీంతోపాటు ఆయనకు సుమారు రూ.11.5 కోట్ల నగదు దక్కనుంది.
ఈ వార్తలు కూడా చదవండి
మోదీపై ట్రంప్‌నకు చాలా మంచి అభిప్రాయం: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని
దుబాయ్ ముస్లింలపై ప్రేమ ఎందుకు? : సింగర్ మికా సింగ్