మెదడు రహస్యాలపై కొత్త వెలుగు! వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
ABN , Publish Date - Oct 06 , 2026 | 04:51 AM
ఈ ఏడాది కూడా వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి దక్కింది. మెదడులోని నాడీకణాలను కాంతితో నియంత్రించే సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసిన కార్ల్ డీసెరోథ్ (అమెరికా), పీటర్ హెగెమాన్ (జర్మనీ), జార్జ్ నాగెల్ (జర్మనీ)లను సంయుక్తంగా నోబెల్ బహుమతి వరించింది.
మెదడు రహస్యాలపై
కొత్త వెలుగు!
వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
మెదడులో నాడీకణాల్ని కాంతితో
నియంత్రించే సాంకేతికత అభివృద్ధి
కార్ల్ డీసెరోథ్, పీటర్ హెగెమాన్,
జార్జ్ నాగెల్‌లకు పురస్కారం
స్టాక్‌హోమ్, అక్టోబరు 5: ఈ ఏడాది కూడా వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి దక్కింది. మెదడులోని నాడీకణాలను కాంతితో నియంత్రించే సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసిన కార్ల్ డీసెరోథ్ (అమెరికా), పీటర్ హెగెమాన్ (జర్మనీ), జార్జ్ నాగెల్ (జర్మనీ)లను సంయుక్తంగా నోబెల్ బహుమతి వరించింది. కాంతిని ఉపయోగించి నాడీకణాల పనితీరును ఆన్ లేదా ఆఫ్ చేసేలా నియంత్రించే ‘ఆప్టోజెనెటిక్స్’ అనే సాంకేతికత, కాంతి ఆధారిత అయాన్ మార్గాలపై చేసిన పరిశోధనలకుగానూ వారిని 2026 నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు నోబెల్ ప్రైజ్ కమిటీ సోమవారం వెల్లడించింది. ఈ సందర్భంగా వైద్యశాస్త్రంలో వారు చేసిన కృషిని ప్రశంసిస్తూ.. ‘‘మెదడుకు సంబంధించిన రహస్యాలను వెలికితీసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయోగశాలల్లో ఇప్పుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు’’ అని ఎక్స్‌లో పోస్టు చేసింది. కార్ల్ డీసెరోథ్ (54) కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, పీటర్ హెగెమాన్ (71) బెర్లిన్‌లోని హంబోల్ట్ యూనివర్సిటీ, జార్జ్ నాగెల్ (73) జర్మనీలోని ఉర్జ్‌బర్గ్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారని నోబెల్ అసెంబ్లీ పేర్కొంది. స్టాక్‌హోమ్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో సోమవారం ఈ బహుమతిని ప్రకటించడంతో నోబెల్ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. నోబెల్ బహుమతి విజేతకు ఈ ఏడాది సుమారు రూ.11.55 కోట్లు(1.2 మిలియన్ డాలర్లు) అందిస్తారు. ఈ మొత్తాన్ని డీసెరోథ్, హెగెమాన్, నాగెల్ పంచుకోనున్నారు. కాగా, గతేడాది కూడా మానవ రోగ నిరోధక వ్యవస్థలపై పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలు మేరీ ఈ బ్రోంక్, ఫ్రెడ్ రామ్స్‌డెల్, షిమోన్ సకగుచీలకు వైద్యశాస్త్రంలో నోబెల్ దక్కింది. ఇక ఈ ఏడాది నోబెల్ ప్రకటనల్లో భాగంగా మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్య రంగంలో పురస్కారాలు ప్రకటిస్తారు. శుక్రవారం శాంతి నోబెల్, ఈ నెల 12న ఆర్థికశాస్త్రంలో నోబెల్ విజేతలను ప్రకటిస్తారు.
ఆప్టోజెనెటిక్స్ అంటే ఏమిటి..?
ఆప్టోజెనెటిక్స్ అనేది కాంతి, జన్యుశాస్త్రం కలయికతో పనిచేసే ఒక అత్యాధునిక జీవ సాంకేతిక పద్ధతి. సింపుల్‌గా చెప్పాలంటే కాంతిని ఉపయోగించి నాడీకణాల పనితీరును నియంత్రించే టెక్నిక్‌నే ఆప్టోజెనెటిక్స్ అంటారు. క్లామిడోమోనాస్ అనే ఏకకణ శైవలంపై.. హెగెమాన్, నాగెల్ చేసిన పరిశోధనలతో దీని పురోగతి ప్రారంభమైంది. వారు ఈ శైవలం ఉపరితలంపై చానల్‌రోడోప్సిన్ అనే ప్రొటీన్‌ను కనుగొన్నారు. దానిపై నీలి కాంతి పడినప్పుడు ప్రొటీన్‌లోని ఒక మార్గం తెరుచుకుంటుంది. దీంతో విద్యుత్‌చార్జ్ కలిగిన అయాన్లు కణంలోకి ప్రవేశిస్తాయి. ఫలితంగా విద్యుత్ సంకేతం ఏర్పడుతుంది. ఆ ప్రొటీన్‌ను వేరే కణాల్లోకి ప్రవేశపెట్టినా.. ఆ కణాలను కాంతికి స్పందించేలా చేయవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణను నాడీ కణాలపై ఉపయోగించే దిశగా కార్ల్ డిసెరోథ్ కీలక ముందడుగు వేశారు. ఎలుకల నాడీ కణాల్లో చానల్‌రోడోప్సిన్ కోసం అవసరమైన జన్యువులను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత నీలి కాంతి ద్వారా ఆ నాడీ కణాలను యాక్టివేట్ చేయగలిగారు. 2005లో ఈ వివరాలను ప్రచురించారు. రెండేళ్ల తర్వాత కాంతితో నియంత్రించే ఈ స్విచ్... జీవించి ఉన్న ఎలుకల మెదళ్లలో కూడా పనిచేయగలదని నిరూపించారు. ఈ ప్రక్రియనే ఆప్టోజెనెటిక్స్ అని పిలిచారు. ఈ పద్ధతి పరిశోధకులు మెదడును అధ్యయనం చేసే విధానాన్నే మార్చేసింది. ఎందుకంటే ఇది కాంతితో నిర్దిష్ట నాడీకణాలను ఉత్తేజపరిచి మెదడులో దాగి ఉన్న నిర్దిష్ట జ్ఞాపకాలు, భావాలు, ప్రవర్తనల్లో వాటి పాత్రను పరిశోధించడానికి వీలు కల్పిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి
అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ.
ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యం కోల్పోతోంది.. సంస్కరణలు తప్పనిసరి: జైశంకర్