Share News

రసాయన అణు రహస్యాల ఛేదనకు నోబెల్‌

ABN , Publish Date - Oct 08 , 2026 | 03:12 AM

రసాయన శాస్త్రంలో అద్భుత పరిశోధనలకు గానూ ఈ ఏడాది ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ బి కగాన్‌, జపాన్‌కు చెందిన కెన్సో సోయిలకు ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి దక్కింది

రసాయన అణు రహస్యాల ఛేదనకు నోబెల్‌
noble winners

  • రసాయనశాస్త్రంలో ఇద్దరికి ప్రతిష్ఠాత్మక పురస్కారం.. హెన్రీ కగాన్‌, కెన్సో సోయిలకు దక్కిన గౌరవం

స్టాక్‌హోమ్‌, అక్టోబరు 7: రసాయన శాస్త్రంలో అద్భుత పరిశోధనలకు గానూ ఈ ఏడాది ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ బి కగాన్‌, జపాన్‌కు చెందిన కెన్సో సోయిలకు ప్రతిష్ఠాత్మక నోబెల్‌ బహుమతి దక్కింది. రసాయన అణువుల్లోని మిర్రర్‌ ఇమేజ్‌ రహస్యాన్ని వీరు ఛేదించారు. ఈ క్రమంలో అసిమెట్రిక్‌ ఆర్గానిక్‌ సింథటిక్‌లో నాన్‌-లీనియర్‌ ఎఫెక్ట్స్‌, ఆటోకాటలసిస్‌ ఆవిష్కరణకు గానూ ఈ ఇద్దరిని నోబెల్‌ పురస్కారానికి ఎంపిక చేసినట్టు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ బుధవారం వెల్లడించింది. ఈ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన రసాయన చర్యలు శతాబ్దానికిపైగా ఉన్న ఓ రసాయన రహస్యానికి పరిష్కారం చూపాయని రసాయన శాస్త్ర నోబెల్‌ కమిటీ తెలిపింది. 95 ఏళ్ల హెన్రీ కగాన్‌ ఫ్రాన్స్‌లో జన్మించారు. ఆ దేశంలోని ఓర్సేలో ఉన్న ‘యూనివర్సిటీ పారి్‌స-సుద్‌’లో పనిచేస్తున్నారు. జపాన్‌లో జన్మించిన 76 ఏళ్ల కెన్సో సోయి ‘టోక్యో యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌’లో పనిచేస్తున్నారు.

అణువుల్లోని మిర్రర్‌ ఇమేజ్‌ రహస్యం..

కుడి, ఎడమ చేతులు ఒకదానికొకటి అద్దం ప్రతిబింబంలా ఉంటాయి. కానీ.. ఒక చేతి తొడుగును మరో చేతికి తొడగడం సాధ్యం కాదు. రసాయన శాస్త్రంలో కూడా ఇలాంటి సమస్యే ఉంది. అనేక అణువులు రెండు అద్దం ప్రతిబింబాల వలె ఉంటాయి. వాటిలో ఒకేరకమైన పరమాణువులు ఉన్నప్పటికీ.. అవి జీవుల లోపల చాలా భిన్నంగా ప్రవర్తించగలవు. ప్రోటీన్ల నిర్మాణ కారకాలైన అమినో ఆమ్లాల వంటి అణువులు దీనికి ఒక ఉదాహరణ. ఇలా ఎందుకు జరుగుతుంది అనే శతాబ్దాల నాటి రసాయన శాస్త్ర రహస్యాన్ని హెన్రీ కగాన్‌, కెన్సో సోయి తమ పరిశోధనల ద్వారా ఛేదించారు. 1986లో ఒక ప్రతిబింబ రూపాన్ని మరొకదానికంటే ఎక్కువ పరిణామంలో ఉత్పత్తి చేసే విధంగా రసాయన ప్రతిచర్యలను తయారు చేసేమార్గాన్ని కనుగొన్న కగాన్‌ మొదటి పురోగతి సాధించారు.


1995లో పూర్తి ఏకపక్షంగా మారే సామర్థ్యం ఉన్న ‘సోయి రియాక్షన్‌’ అనే ఒక ప్రత్యేక రసాయన చర్యను కెన్సో సోయి అభివృద్ధి చేశారు. ఎనిమిదేళ్ల తర్వాత రెండు ప్రతిబింబ రూపాల్లో ఒకటి మాత్రమే ఉత్పత్తి అయ్యేలా ఒక ప్రతిచర్యను సృష్టించడంలో ఆయన విజయం సాధించారు. తద్వారా ల్యాబ్‌లో కేవలం ఒకే ఒక్క అద్దపు ప్రతిబింబ రూపం ఉన్న అణువులను పూర్తిగా సృష్టించడం సాధ్యమైంది.

ఈ వార్తలు కూడా చదవండి

రసాయన శాస్త్రంలో కగాన్‌, సోయైలకు నోబెల్ పురస్కారం

భారతీయులున్న ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి

Updated Date - Oct 08 , 2026 | 03:14 AM