ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా దుర్మరణం
ABN , Publish Date - Aug 01 , 2026 | 10:10 PM
ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా కన్నుమూశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో బ్రాడ్ పీక్ అనే పర్వతం ఎక్కుతున్న సమయంలో ఆయనపై మంచుచరియ విరిగిపడటంతో కన్నుమూశారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా కన్నుమూశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో బ్రాడ్ పీక్ అనే పర్వతం ఎక్కుతున్న సమయంలో ఆయనపై మంచుచరియ విరిగిపడటంతో కన్నుమూశారు. ప్రపంచంలో 12వ అత్యంత ఎత్తైన పర్వతంగా బ్రాడ్ పీక్‌కు పేరుంది.
ప్రమాద సమయంలో పుర్జా 10 మంది సభ్యులున్న ఓ పర్వహాతోరహణ బృందం వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం వారిపై మంచుచరియ విరిగిపడింది. దీంతో, వారితో సంబంధాలు తెగిపోయాయి. వారందరూ మరణించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ బృందంలో ఆరుగురు నేపాలీలతో పాటు ఒక పాకిస్థానీ, ఒమాన్ దేశస్థుడు, చైనా, అమెరికా పౌరులు ఉన్నారు.
పుర్జా మరణంపై ప్రపంచవ్యాప్తంగా సంతాపం వ్యక్తం అవుతోంది. నేపాల్ ప్రధాని బాలేన్ షా కూడా సంతాపం తెలియజేశారు. ధైర్యసాహసాలు, క్రమశిక్షణ, త్యాగం, పట్టుదల, పరిమితులను అధిగమించాలనే తపనకు పుర్జా నిదర్శనంగా నిలిచారని ప్రశంసించారు. కొన్ని లక్షల మంది పర్వతారోహకులకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ప్రపంచంలో 8 వేల మీటర్ల పైబడి ఎత్తున్న టాప్ 14 పర్వతాలను 2019లో అధిరోహించిన పుర్జా ప్రపంచవ్యాప్త గుర్తింపు సొంతం చేసుకున్నారు. కేవలం ఆరు నెలల్లోనే ఈ ఫీట్ సాధించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఆయన సాహసకృత్యాలకు సంబంధించి ఒక డాక్యుమెంటరీ కూడా ప్రదర్శితమవుతోంది. పర్వతారోహకుడిగా మారకముందు పుర్జా దాదాపు 16 సంవత్సరాలు బ్రిటన్ ఆర్మీలో పనిచేశారు. బ్రాడ్ పీక్ పర్వతారోహణ అత్యంత కఠినమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోని రెండో అత్యంత ఎత్తైన పర్వతం కే2కు కొద్ది దూరంలోనే బ్రాడ్ పీక్ కూడా ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
పాక్ యుద్ధాన్ని ఆపింది నేనే.. ట్రంప్ నోట అదే మాట
వీసా బాండ్ విధానాన్ని కొనసాగించనున్న యూఎస్.. 20 వేల డాలర్ల వరకూ అదనపు భారం