ఖలిస్థానీ వేర్పాటువాదం.. న్యూజిలాండ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 06 , 2026 | 10:27 PM
ఖలిస్థానీ వేర్పాటువాదం విషయంలో భారత్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలపై న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టొఫర్ లక్సన్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. బెదిరింపులు, హింసాత్మక చర్యలను సహించబోమని స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఖలిస్థానీ వేర్పాటువాదం విషయంలో భారత్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలపై న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టొఫర్ లక్సన్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. భావప్రకటనా స్వేచ్ఛకు తాము విలువనిచ్చినప్పటికీ బెదిరింపులు, హింసాత్మక ఘటనలను అస్సలు సహించబోమని స్పష్టం చేశారు. చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ఈ మేరకు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఖలిస్థానీ వేర్పాటువాదంతో భారత్ ఎంతో వేదన చెందిందని ప్రధాని లక్సన్ అన్నారు. భారత్, న్యూజిలాండ్ మధ్య దౌత్యబంధానికి ఈ అంశం అడ్డం కాబోదని కూడా చెప్పారు. ఖలిస్థానీ వేర్పాటువాదం ఇరు దేశాల దౌత్య బంధంపై ప్రభావం చూపుతుందా? అన్న ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
ఖలిస్థానీ అంశంపై రిఫరెండమ్‌కు అనుమతిస్తారా? అన్న మీడియా ప్రశ్నను ఆయన ఊహాజనితమైనదిగా అభివర్ణించారు. పోలీసులు ఇచ్చే నివేదికలు, రాబోయే ముప్పు ఆధారంగా తుది నిర్ణయం ఉంటుందని అన్నారు. హక్కుల గురించే మాట్లాడతాము, బాధ్యతల గురించి పట్టించుకోమంటే తమ దేశంలో కుదరదని కూడా ప్రధాని లక్సన్ స్పష్టం చేశారు. ఏదైనా చట్టానికి లోబడే ఉండాలని పేర్కొన్నారు. న్యూజిలాండ్‌లో ఖలిస్థానీ వేర్పాటువాదుల కార్యకలాపాలపై భారత్ ఇప్పటికే పలుమార్లు తన అభ్యంతరాలను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
గాజా స్ట్రిప్‌పై హమాస్ కీలక ప్రకటన
ప్రధాని మోదీకి స్వాగతం పలికిన ఎఫ్-16, సుఖోయ్-30 విమానాలు