Share News

ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్‌తో హాట్‌లైన్‌లో మాట్లాడిన నెతన్యాహు

ABN , Publish Date - Feb 28 , 2026 | 09:47 PM

ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో తాజా పరిస్థితిపై నెతన్యాహు, ట్రంప్ శనివారం రాత్రి ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది.

ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్‌తో హాట్‌లైన్‌లో మాట్లాడిన నెతన్యాహు
Trump, Netanyahu

టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై భీకరదాడులకు దిగడంతో పశ్చిమాసియాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ పాలకులకు చరమగీతం పాడటమే లక్ష్యంగా జరుపుతున్న ఈ దాడుల్లో ఇరాన్‌ వైపు భారీ నష్టం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ సైతం ప్రతిదాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం రాత్రి ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది.


దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్న ఖమేనీ..

కాగా, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేని (Ayatollah Ali Khamenei) మృతిచెందినట్టు కూడా వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ వార్తలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఖండించారు. ఖమేనీ సజీవంగా ఉన్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ఖమేనీ మాట్లాడనున్నట్టు కూడా వార్తలు వెలువడుతున్నాయి.


ప్రతీకార దాడులు..

మరోవైపు, తమపై దాడులకు దిగిన ఇజ్రాయెల్‌పై, గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ క్యాంప్‌లపై ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది. ఇరాన్ వైపు నుంచి క్షిపణులు దూసుకు రావడంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో సైరన్లను మోగించారు. క్షిపణులను అడ్డుకుని, తిరిగి దాడి చేయడానికి ఇజ్రాయెల్ దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఇజ్రాయెల్‌తో పాటు, పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. తమ దేశంలోని అమెరికా నేవీ ఐదో ఫ్లీట్‌పై దాడి జరిగినట్టు బహ్రెయిన్ తెలిపింది. అలాగే కువైట్, యూఏఈ, ఖతర్‌లలో కూడా పేలుళ్లు వినిపించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. యూఏఈ, ఖతార్ తదితర దేశాలు ఇప్పటికే తమ గగనతలాన్ని మూసివేశాయి

Updated Date - Feb 28 , 2026 | 09:55 PM