నేపాల్ వరదలు.. 1643 మంది విద్యార్థులను కాపాడిన హెడ్‌మాస్టర్
ABN , Publish Date - Aug 30 , 2026 | 01:45 PM
నేపాల్ వరదల సందర్భంగా ఓ హెడ్‌మాస్టర్ సమయస్ఫూర్తి ఏకంగా 1643 మంది విద్యార్థులను కాపాడింది.
ఇంటర్‌నెట్ డెస్క్: నేపాల్ వరదల సందర్భంగా ఓ హెడ్‌మాస్టర్ సమయస్ఫూర్తి ఏకంగా 1643 మంది విద్యార్థులను కాపాడింది. ఆ వివరాల్లోకి వెళితే.. నువాకోట్ జిల్లా, బిదుర్ మున్సిపాలిటీ పరిధిలోని త్రిశూలి లోయలో త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్ ఉంది. ఈ స్కూల్‌లో 47 ఏళ్ల రాజేంద్ర దావాడి హెడ్‌మాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. బుధవారం ఉదయం 9:20 గంటల సమయంలో ఓ స్నేహితుడు రాజేంద్రకు ఫోన్ చేశాడు. నది ఉద్ధృతికి గ్రామం కొట్టుకుపోతోందని, వెంటనే పిల్లలను తీసుకుని పారిపోవాలని హెచ్చరించాడు.
అదే సమయంలో ఓ విద్యార్థి తండ్రి పరిగెత్తుకుంటూ రాజేంద్ర దగ్గరకు వచ్చాడు. వరద నీరు వేగంగా పైకి వస్తోందని చెప్పాడు. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న రాజేంద్ర ఉపాధ్యాయులందరినీ అలర్ట్ చేశారు. పిల్లలను క్లాస్ రూమ్‌ల నుంచి ఖాళీ చేయించారు. స్కూల్ బస్సు డ్రైవర్లకు ఫోన్ చేసి ఎక్కడికక్కడే బస్సులను నిలిపివేయాలని ఆదేశించారు. పిల్లలందరినీ సురక్షితంగా కొండపై ఉన్న రావి చెట్టు కిందికి చేర్చారు. పిల్లలంతా సురక్షిత ప్రాంతానికి చేరుకున్న కొద్ది నిమిషాలకే భీకరమైన వరద స్కూల్ ఉన్న ప్రాంతాన్ని ముంచెత్తింది.
వరద ఉద్ధృతి కారణంగా మూడు అంతస్తుల కాంక్రీట్ భవనం పూర్తిగా కొట్టుకుపోయింది. హెడ్‌మాస్టర్ చాకచక్యంతో 1,643 మంది పిల్లలు ప్రాణాలతో బయటపడినప్పటికీ.. దురదృష్టవశాత్తూ ఇద్దరు స్కూల్ సిబ్బంది మరణించారు. సోషల్ హిస్టరీ టీచర్ సంతోష్ పరియార్ (32) తన గదికి వెళ్లగా వరదలో కొట్టుకుపోయారు. స్కూల్ తలుపులు వేయడానికి వెనక్కి వెళ్లిన స్కూల్ అటెండర్ సుల్తాన్ లామా కూడా వరద నీటిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి
మీకు ఆ హక్కు లేదు: ట్రంప్‌నకు తేల్చి చెప్పిన కోర్టు
రేవ్ పార్టీలో కాల్పులు.. ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు..