విధ్వంసకాండ
ABN , Publish Date - Mar 09 , 2026 | 04:51 AM
పశ్చిమాసియా యుద్ధం ప్రమాదకర మలుపు తిరుగుతోంది. ఇరువైపులా ఎవరూ వెనక్కి తగ్గని స్థితిలో పరస్పర దాడులు మిలిటరీ, రక్షణ పరిమితులు దాటి విపరీత పరిణామాల వైపు దారితీస్తున్నాయి.
పశ్చిమాసియా యుద్ధంలో ప్రమాదకర మలుపు!
ఇరాన్‌లో ఇంధన నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు
అంతరిక్ష సంస్థ హెడ్‌క్వార్టర్స్, ఇస్ఫహాన్ ఎయిర్‌పోర్ట్ ధ్వంసం
‘గల్ఫ్’లోని చమురు రిఫైనరీలు, ఎయిర్‌పోర్ట్‌లపై ఇరాన్ దాడులు
బహ్రెయిన్‌లోని అమెరికా నేవీ బేస్‌పై దాడి
21 మంది యూఎస్ సైనికులు చనిపోయినట్టు వార్తలు
సౌదీలో ఒక భారతీయుడు సహా ఇద్దరి మృతి
కువైట్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుపై క్షిపణి దాడి
ఉప్పు నీటిని తాగునీటిగా మార్చే కేంద్రాలపైనా పరస్పరం దాడులు
ఇరాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గల్ఫ్ దేశాలు
తమ రక్షణకు అమెరికా బేస్‌లపై దాడి చేసే హక్కు ఉందన్న ఇరాన్
దుబాయ్/వాషింగ్టన్, మార్చి 8: పశ్చిమాసియా యుద్ధం ప్రమాదకర మలుపు తిరుగుతోంది. ఇరువైపులా ఎవరూ వెనక్కి తగ్గని స్థితిలో పరస్పర దాడులు మిలిటరీ, రక్షణ పరిమితులు దాటి విపరీత పరిణామాల వైపు దారితీస్తున్నాయి. పౌర ఆస్తులు, చమురు రిఫైనరీలు, చమురు నిల్వ కేంద్రాలు, విమానాశ్రయాలు వంటి కీలక మౌలిక సదుపాయాల విధ్వంసం వైపు అడుగులు పడుతున్నాయి. ఇరాన్‌లోని విమానాశ్రయాలు, పారిశ్రామిక ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్, అమెరికా.. తాజాగా పెట్రోలియం నిల్వ కేంద్రాలను, తాగునీటి కోసం ఉద్దేశించిన డీసాలినేషన్ ప్లాంట్లనూ లక్ష్యంగా చేసుకున్నాయి. ఇరాన్ అంతరిక్ష సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో ఆస్పత్రులు, స్కూళ్లు కూడా దెబ్బతింటున్నాయి. మరోవైపు అరబ్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలతోపాటు చమురు రిఫైనరీలు, పౌర విమానాశ్రయాలు, హోటళ్లు, జనావాసాలపైనా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు పడుతున్నాయి. తాజాగా డీసాలినేషన్ ప్లాంట్లపైనా ఇరాన్ డ్రోన్లు ప్రయోగిస్తోంది.

టెహ్రాన్‌లో ఆయిల్ డిపోపై భారీ దాడి
ఇరాన్ రాజధాని టెహ్రాన్ శివార్లలో, అల్బోర్జ్ ప్రావిన్స్‌లో ఉన్న నాలుగు భారీ ఇంధన నిల్వ కేంద్రాలు, ఒక డిస్ట్రిబ్యూషన్ కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ ఆదివారం దాడి చేశాయి. దీనితో పెట్రోలియం ఉత్పత్తులన్నీ అంటుకుని, భారీగా పేలుళ్లు, మంటలు చెలరేగాయి. సమీప ప్రాంతాలన్నీ నల్లటి విషవాయువులతో నిండిపోయాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించారని, 21 మంది గాయపడ్డారని ఇరాన్ వార్తా సంస్థ టాస్నిమ్ వెల్లడించింది. కాగా ‘‘యుద్ధంలో ఇదొక ప్రమాదకరమైన పరిణామం. ఇంధన కేంద్రాలపై దాడితో ప్రమాదకర, విషపూర్తి రసాయనాలు వెలువడుతున్నాయి. సాధారణ ప్రజలు వాటిని పీల్చుకోవాల్సి వస్తోంది. పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇది తీవ్రమైన యుద్ధనేరం కిందకే వస్తుంది’’ అని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ పేర్కొన్నారు. ఇరాన్ మిలటరీ వ్యవస్థలకు ఇంధనాన్ని సరఫరా చేస్తున్నందునే ఆయిల్ డిపోలపై దాడి చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. కాగా, ఇంధన కేంద్రాలపై దాడుల నేపథ్యంలో.. ఇరాన్ ప్రభుత్వం ప్రజలకు అందించే ఇంధన కోటాను వారానికి 30 లీటర్ల నుంచి 20 లీటర్లకు తగ్గించింది.
ఇరాన్ అంతరిక్ష సంస్థ హెడ్‌క్వార్టర్స్ ధ్వంసం
టెహ్రాన్‌లోని ఐఆర్‌జీసీ స్పేస్ ఫోర్స్ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ అంతరిక్ష సంస్థకు చెందిన పరిశోధన, కమాండ్ కంట్రోల్ కేంద్రాలు ఈ కార్యాలయంలోనే ఉన్నాయని.. ఇజ్రాయెల్‌పై నిఘా కోసం ఇరాన్ ప్రయోగించిన ఖయ్యామ్ ఉపగ్రహ నియంత్రణ విభాగం కూడా ఇందులోనే ఉందని పేర్కొంది. ఇరాన్‌లోని ఇస్ఫహాన్ ఎయిర్‌పోర్టులో ఎఫ్-14 యుద్ధ విమానాలను, క్షిపణి రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామని వెల్లడించింది. నార్వేలోని అమెరికా ఎంబసీ వద్ద ఆదివారం పేలుడు సంభవించింది. అయితే ఈ పేలుడుతో పెద్దగా నష్టమేమీ జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని నార్వే వెల్లడించింది. పేలుడుకు పాల్పడినవారి కోసం గాలిస్తున్నట్టు తెలిపింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎంబసీలపై ఇరాన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో నార్వేలో పేలుడు చర్చనీయాంశంగా మారింది. ఇరాన్‌కు మద్దతుగా రంగంలోకి దిగిన హెజ్బొల్లా తీవ్రవాద సంస్థను అణచివేసేందుకు ఇజ్రాయెల్ భారీ స్థాయిలో దాడులు చేస్తోంది. లెబనాన్‌లోని 20 పట్టణాల్లో క్షిపణులు, యుద్ధ విమానాలతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో మృతుల సంఖ్య 394కు పెరిగిందని, అందులో 83 మంది పిల్లలు ఉన్నారని లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇరాన్‌వ్యాప్తంగా 10 వేల పౌర ఆవాసాలు ధ్వంసమయ్యాయని రెడ్ క్రిసెంట్ సొసైటీ తెలిపింది. ఇరాన్ దాడుల్లో 1,929 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది.

అరబ్ గల్ఫ్ దేశాలపై దాడులు ఆపని ఇరాన్..
అరబ్ గల్ఫ్ దేశాలపై దాడిపట్ల తాము క్షమాపణ కోరుతున్నామని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటించినా.. దాడులు మాత్రం ఆగలేదు. అమెరికా, ఇజ్రాయెల్‌లే తొలుత ఇరాన్‌పై యుద్ధం మొదలుపెట్టాయని, అలాంటప్పుడు రక్షణ కోసం గల్ఫ్‌లోని ఆ దేశాల స్థావరాలపై దాడులు చేసేందుకు ఇరాన్‌కు హక్కు ఉందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆదివారం స్పష్టం చేశారు. ఈ క్రమంలో యూఏఈపై ఇరాన్ పెద్ద సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది. అబుధాబి ప్రాంతంలో వరుసగా పేలుళ్లు వినిపించాయి. ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను మధ్యలోనే అడ్డుకోవడంతో వాటి శకలాలు పడి పలుచోట్ల మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనల్లో ఒకరు మరణించగా, కొందరు గాయపడ్డారు. ఆదివారం ఒక్కరోజే ఇరాన్ 16 క్షిపణులు, 117 డ్రోన్లను ప్రయోగించిందని.. మొత్తం క్షిపణులను, చాలా వరకు డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నామని యూఏఈ వెల్లడించింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు ఒక ప్రభుత్వ భవనంపై క్షిపణులు, డ్రోన్ల దాడి జరిగింది. ఈ దాడిలో విమానాశ్రయంలోని ఇంధన ట్యాంకులకు మంటలు అంటుకున్నాయి. ఇరాన్ దాడుల్లో ఇప్పటివరకు ఇద్దరు అధికారులు మృతిచెందినట్టు కువైట్ వెల్లడించింది. ఇక సౌదీలోని అల్ ఖర్జ్ ప్రాంతంలోని అమెరికా రాడార్ వ్యవస్థపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. సౌదీ రక్షణ వ్యవస్థ వాటిని మధ్యలోనే అడ్డుకుంది. ఆ శకలాలు పడి, పేలుళ్లు సంభవించడంతో ఒక భారతీయుడు, ఒక బంగ్లాదేశీయుడు మృతిచెందారు. మరో 12 మంది గాయపడ్డారు.
ఇరాన్‌పై అరబ్ గల్ఫ్ దేశాల ఆగ్రహం
సౌదీ, కువైట్, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్ తదితర అరబ్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై, రిఫైనరీలు, విమానాశ్రయాలపై ఇరాన్ దాడులు చేసినా ఇప్పటివరకు.. ఆ దేశాలు ప్రతిదాడులు చేయలేదు. తోటి ముస్లిం దేశం కావడం, ప్రతిదాడులు చేస్తే ఇస్లాం దేశాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న భావనతో మిన్నకుండిపోయాయి. ఇరాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు, క్షిపణులను అడ్డుకోవడానికే పరిమితమయ్యాయి. అయితే పౌర ఆవాసాలు, రిఫైనరీల వంటివాటిపై ఇరాన్ దాడులను తీవ్రంగా తప్పుపడుతూ, అవసరమైతే ప్రతిదాడులకు దిగుతామని తాజాగా అరబ్ లీగ్ హెచ్చరించింది. ఈ మేరకు 8 దేశాల కూటమి ఆదివారం ప్రకటన జారీ చేసింది. ఇరాన్‌లోని డీసాలినేషన్ ప్లాంటుపై యూఏఈ దాడి చేసి ధ్వంసం చేసిందన్న వార్తలు వచ్చాయి. కానీ ఆ దాడి తాము చేయలేదని యూఏఈ ప్రకటించింది. అయితే ఇరాన్‌పై గల్ఫ్ దేశాలు దాడికి ప్రయత్నిసే.. తాము తీవ్రస్థాయిలో ప్రతిస్పందించాల్సి వస్తుందని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ హెచ్చరించారు. ఇరుగుపొరుగు దేశాలతో తమకు ఎలాంటి శత్రుత్వం లేదని, కానీ కానీ శత్రుదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.

మంచి నీటిపైనా తప్పని దాడులు
పశ్చిమాసియాలోని ఎడారి ప్రాంత దేశాల్లో మంచినీటి కొరత ఎక్కువ. సముద్రపు నీటిని ‘డీసాలినేషన్’ ప్లాంట్లలో శుద్ధిచేసి తాగేనీటిగా మార్చుకుని వినియోగిస్తుంటారు. తాజా ఘర్షణల్లో ఈ డీసాలినేషన్ ప్లాంట్లను కూడా ధ్వంసం చేసుకుంటున్నారు. శనివారం ఇరాన్‌కు చెందిన ఖెష్మ్ దీవిలోని డీసాలినేషన్ ప్లాంట్‌ను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ప్రతిగా బహ్రెయిన్‌లోని డీసాలినేషన్ ప్లాంట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ క్రమంలో ఇరాన్‌లోని మరో ప్లాంట్‌పైనా దాడి జరిగింది. యూఏఈ ఆ దాడి చేసిందని ప్రచారం జరిగినా.. తాము కాదని ఆ దేశం ఖండించింది.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఖరారు?
ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ ఎంపిక పూర్తయినట్టు తెలిసింది. అయితే.. లీడర్ ఎవరనేది ఈ వ్యవహారంపై నియమించిన నిపుణుల మండలి గోప్యంగా ఉంచింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ(86) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త సుప్రీం లీడర్‌ను ఎంపిక చేసేందుకు నిపుణుల మండలిని ఏర్పాటు చేశారు. ఈ మండలి పలు దఫాలుగా భేటీ అయి కొత్త నేతను ఎంపిక చేసింది. ‘‘అత్యంత అనుకూలమైన అభ్యర్థిని ఎంపిక చేశాం. దీనికి నిపుణుల మండలిలోని మెజారిటీ సభ్యులు అంగీకరించారు.’’ అని మండలి సభ్యుడు మొహసేన్ హైదరీ తెలిపారు. ఈయన ఖుజెస్థాన్ ప్రావిన్స్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ‘‘తదుపరి సుప్రీం లీడర్ ఎంపిక విషయంలో కౌన్సిల్ ఏకాభిప్రాయానికి వచ్చింది.’’ అని మరో సభ్యుడు మొహమ్మద్ మెహ్దీ మిర్బఘేరీ చెప్పారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం.. దేశ సుప్రీం లీడర్‌ను ఎంపిక చేసే విషయంలో 88 మంది సభ్యులతో కూడిన నిపుణుల మండలి బాధ్యత వహిస్తుంది.