త్వరలో భారతీయులకు మలేషియాలో వీసా ఫ్రీ ఎంట్రీ అవకాశం రద్దు
ABN , Publish Date - Nov 19 , 2026 | 07:15 PM
భారతీయులకు గతంలో ఇచ్చిన వీసా ఫ్రీ ఎంట్రీ సదుపాయాన్ని జనవరి నుంచీ మలేషియా రద్దు చేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయులకు గతంలో ఇచ్చిన వీసా ఫ్రీ ఎంట్రీ సదుపాయాన్ని జనవరి నుంచీ మలేషియా రద్దు చేయనుంది. ఆ తరువాత మలేషియా వెళ్లాలనుకునే భారతీయులు ముందుగానే వీసా పొందాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మలేషియా ఇమిగ్రేషన్ శాఖ తాజాగా వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి మలేషియాకు రావాలనుకునే వారు వీసాను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను మైవీసా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా భారతీయులు డిసెంబర్ 1 నుంచి సమర్పించవచ్చు.
కొవిడ్-19 తరువాత దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మలేషియా వీసా ఫ్రీ ఎంట్రీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో, క్రమంగా భారతీయ పర్యాటకుల సంఖ్య పెరిగింది. అయితే, ఈ వ్యవస్థ దుర్వినియోగం అవుతోందని భారత్‌లోని మలేషియా హైకమిషన్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆందోళన వ్యక్తం చేసింది. టూరిస్టు వీసాల ద్వారా మలేషియాకు వెళుతున్న అనేక మంది అక్కడ ఉపాధి వెతుక్కుంటున్నారని పేర్కొంది. అక్రమ ఏజెంట్ల బారిన పడి కొందరు మలేషియాలో చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని చెప్పింది.
ఇదిలా ఉంటే వీసా దరఖాస్తులకు సంబంధించి కొత్త నిబంధనను కూడా మలేషియా తీసుకొచ్చింది. దీని ప్రకారం, ఒక దరఖాస్తు 7 పని దినాలకు మించి పెండింగ్ లేదా న్యూ అప్లికేషన్ దశలోనే ఉంటే అది ఆటోమేటిక్‌గా రద్దైపోతుందని తెలిపింది. ఇది గత నెలలోనే అమల్లోకి వచ్చింది.
ఈ వార్తలనూ చదవండి:
బ్రిటన్ ప్రిన్స్ విలియమ్‌కు భారత మూలాలు! 200 ఏళ్ల నాటి చరిత్ర
చైనాపై గూఢచర్యం చేస్తున్నాం.. డొనాల్డ్ ట్రంప్ వెల్లడి