బ్రిటన్ ప్రిన్స్ విలియమ్‌కు భారత మూలాలు! 200 ఏళ్ల నాటి చరిత్ర
ABN , Publish Date - Nov 19 , 2026 | 06:01 PM
ఇటీవల భారత పర్యటన సందర్భంగా బ్రిటన్ రాజకుమారుడు విలియమ్, ఆయన సతీమణి కేట్ మిడిల్‌టన్ భారతీయ దుస్తుల్లో మెరిసిపోయారు. అయితే, విలియమ్‌కు భారత్‌తో అనుబంధం అక్కడితో ముగిసిపోలేదని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల భారత పర్యటన సందర్భంగా బ్రిటన్ రాజకుమారుడు విలియమ్, ఆయన సతీమణి కేట్ మిడిల్‌టన్ భారతీయ దుస్తుల్లో మెరిసిపోయారు. అయితే, విలియమ్‌కు భారత్‌తో అనుబంధం అక్కడితో ముగిసిపోలేదని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆయన తల్లి డయానా తరఫు పూర్వీకుల్లో ఒకరైన ఎలైజా బెట్సీ కెవార్క్ అనే మహిళ భారత సంతతి వ్యక్తి అని యూకే పత్రికలు గతంలోనే ప్రచురించాయి. ఇందుకు అవసరమైన జన్యుపరమైన, చారిత్రకమైన ఆధారాలను సుసన్ హార్వర్డ్ అనే మహిళ వెలికి తీశారు. దాదాపు 20 ఏళ్ల పాటు శ్రమించి ఎలైజా చరిత్రను తెలుకున్నారు.
ఎవరీ ఎలైజా కెవార్క్..
ఎలైజా ‘బెట్సీ’ కెవార్క్ 1790లో జన్మించారు. ఆమె తండ్రి ఆర్మేనియా జాతి వ్యక్తి కాగా తల్లి భారతీయ మహిళ. అప్పటి బాంబే ప్రెసిడెన్సీలో ఆమె జన్మించారు. ప్రిన్స్ విలియమ్‌కు తన తల్లి డయానా తరఫు నుంచి బెట్సీ అమ్మమ్మ అవుతారు. విలియంకు బెట్సీ ఆరు తరాల ముందు వ్యక్తి. ఎలైజా వారసుల్లో ఇప్పటికీ జీవించి ఉన్న కొందరి మైటోకాండ్రియల్ డీఎన్ఏను పరిశీలించిన పరిశోధకులు ఈ అంశాన్ని ధ్రువీకరించారు. అలా తల్లి ద్వారా విలియంకు భారత మూలాలు ఉన్నాయని తేల్చారు.
అప్పట్లో భారత్‌లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన నడుస్తోంది. కంపెనీకి చెందిన ఓ యువ అధికారి థియోడోర్ ఫోర్బ్స్‌ను ఎలైజా వివాహమాడారు. ఫోర్బ్స్ స్కా్ట్‌లాండ్‌కు చెందిన వ్యక్తి. ఎలైజాను ఫోర్బ్స్ ఆర్మీనియన్ చర్చిలో పెళ్లి చేసుకున్నారు. కానీ జాత్యాహంకారం రాజ్యమేలుతున్న ఆ కాలంలో ఫోర్బ్స్ కుటుంబానికి ఎలైజా నచ్చలేదు. దీంతో, అధికారిక రికార్డుల్లో ఆమెను ఫోర్బ్స్ ఇంట్లో పనిచేసే వ్యక్తిగానే పేర్కొన్నారు. ఈ క్రమంలో ఫోర్బ్స్‌కు సంతానం కలిగింది. తమ కూతురు కేథరిన్‌ను (కిట్టీ) ఫోర్బ్స్ స్కాట్‌లాండ్‌కు పంపించారు.
తనయుడు అలెగ్జాండర్ మాత్రం తల్లి ఎలైజాతోనే ఉండిపోయాడు. ఆ తరువాత కొంతకాలానికి స్కాట్‌లాండ్‌కు బయలుదేరిన ఫోర్బ్స్ మార్గమధ్యంలోనే కన్నుమూశారు. చివరకు ఎలైజాకు స్వల్ప మొత్తంలో పెన్షన్ మాత్రమే దక్కింది. ఆమె కష్టాల పాలైంది. చివరకు కొంత కాలానికి ఆమె తన భర్త బంధువును ఆర్థిక సాయం కోరుతూ లేఖ కూడా రాశారు. ఆ బంధువు లేఖను ఎలైజా కూతురికి పంపించారు. ఆ తరువాత ఏమైందనేది మాత్రం తెలియలేదు.
ఇక స్కాట్‌లాండ్‌లో పెరిగిన కేథరిన్ క్రోంబే కుటుంబానికి చెందిన జేమ్స్ అనే వ్యక్తిని వివాహమాడారు. కాలక్రమంలో క్రోంబే కుటుంబం బ్రిటన్‌లో సామాజికంగా ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంది. ఈ కుటుంబానికి చెందిన రూత్ రోష్ కూతురు జానీ ఆత్రోప్‌ను వివాహమాడారు. వారి సంతానమైన డయానా అప్పటి వేల్స్ యువరాజు, నేటి బ్రిటన్ రాజు 3వ చార్ల్స్‌ను పెళ్లాడారు. ఆ తరువాత డయానా ప్రిన్స్ విలియమ్‌కు జన్మనిచ్చారు.
దక్షిణాసియా మూలాలున్న ఎలైజా, ఆమె కూతుళ్లు, ఆ తరువాతి తరాల్లోని మహిళల ద్వారా డయానా వరకూ వచ్చిన మైటోక్రాండ్రియన్ డీఎన్ఏనే ఇందుకు విస్పష్టైమన ఆధారమని పరిశోధకురాలు సూసన్ పేర్కొన్నారు. ఈ డీఎన్ఏ మహిళలు మాత్రమే తమ సంతానానికి అందించగలరని అన్నారు. పురుషుల ద్వారా ఇది తరువాతి తరాలకు చేరదని చెప్పారు. ఇక తమ భారతీయ మూలాల గురించి డయానా కుటుంబానికి కూడా తెలుసని కూడా సూసన్ హార్వర్డ్ పేర్కొన్నారు. ఈ విషయం ప్రిన్స్ విలియమ్‌కు కూడా తెలిసే ఉంటుందని చెప్పారు.