Trump leaked letter: ఎనిమిది యుద్ధాలు ఆపినా నోబెల్ ఇవ్వలేదు.. ఇక శాంతి గురించి ఆలోచించను: ట్రంప్
ABN , Publish Date - Jan 19 , 2026 | 06:06 PM
తాను ఇప్పటివరకు ఎనిమిది యుద్ధాలను ఆపానని, అయినా తనకు నోబెల్ బహుమతి ఇవ్వలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్‌కు ట్రంప్ ఓ లేఖ రాశారు.
తాను ఇప్పటివరకు ఎనిమిది యుద్ధాలను ఆపానని, అయినా తనకు నోబెల్ బహుమతి ఇవ్వలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్‌కు ట్రంప్ ఓ లేఖ రాశారు. ఇకపై శాంతి గురించి మాత్రమే ఆలోచించాల్సిన అవసరం తనకు లేదని నిర్ణయించుకున్నానని ట్రంప్ ఆ లేఖలో పేర్కొన్నారు. నార్వే ప్రధానికి ట్రంప్ రాసిన లేఖ లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది ( Trump Nobel Peace Prize claim).
శాంతి ఎల్లప్పుడూ అత్యంత ముఖ్యమైనది అయినప్పటికీ, ఇకపై తాను ఆ దిశగా ఆలోచించనని ట్రంప్ తేల్చి చెప్పారు. అమెరికాకు ఏది ప్రయోజనకరమో దాని గురించి మాత్రమే తాను ఆలోచిస్తానని చెప్పారు. తనకు నోబెల్ బహుమతి రానందునే ప్రపంచ వ్యవహారాల పట్ల తన దృక్పథం మారిందని ఆ లేఖలో ట్రంప్ పేర్కొన్నారు. నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడం వల్ల కలిగిన నిరాశ నుంచే గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాన్ని ప్రారంభించానని ఆ లేఖ ద్వారా ట్రంప్ పరోక్షంగా అంగీకరించారని పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ (PBS) అభిప్రాయపడింది (Trump wants Greenland).
కాగా, అమెరికా అధ్యక్షుడి నుంచి తాను ఓ లేఖను అందుకున్నట్టు నార్వే ప్రధాన మంత్రి స్టోర్ స్థానిక వార్తాపత్రిక 'ఆఫ్టెన్‌పోస్టెన్'కు వెల్లడించారు (Norway PM letter leak). నార్వే, ఫిన్లాండ్, ఇతర ఐరోపా దేశాలపై సుంకాలు విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌తో కలిసి తాను ట్రంప్‌నకు ఒక లేఖ పంపానని తెలిపారు. ఆ లేఖకు ప్రతిస్పందనగా ట్రంప్ తన అసంతృప్తిని వెల్లడించారని స్టోర్ పేర్కొన్నారు. ట్రంప్ నుంచి తనకు వచ్చిన లేఖలో ఉన్న విషయాలు పైన పేర్కొన్నవే అని కూడా స్టోర్ ధ్రువీకరించారు.
ఇవి కూడా చదవండి..
ల్యాండింగ్ సమయంలో ఊడిన విమానం టైరు.. షాకింగ్ వీడియో వైరల్..
మీ ఐక్యూకు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న కుక్కను 5 సెకెన్లలో కనిపెట్టండి..