పర్షియన్ అఖాతంలో అనాథ ముత్యం.. ఖార్గ్!
ABN , Publish Date - Mar 15 , 2026 | 06:53 AM
యుద్ధం మొదలై దాదాపు రెండువారాలు కావొస్తున్నా భయపడకుండా గుండెదిటవుతో పోరాడుతున్న ఇరాన్.. ‘ఖార్గ్’ ద్వీపంపై అమెరికా దాడులు చేయగానే తీవ్రంగా ప్రతిస్పందించింది! తమ ఇంధన వసతుల జోలికి...
ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు జీవనాడిలాంటి దీవి
ఆ దేశ చమురు ఎగుమతుల్లో దాదాపు 90 శాతం ఆ దీవి నుంచే
అందుకే అక్కడి సైనిక స్థావరాలపై అమెరికా వ్యూహాత్మక దాడులు
యుద్ధం మొదలై దాదాపు రెండువారాలు కావొస్తున్నా భయపడకుండా గుండెదిటవుతో పోరాడుతున్న ఇరాన్.. ‘ఖార్గ్’ ద్వీపంపై అమెరికా దాడులు చేయగానే తీవ్రంగా ప్రతిస్పందించింది! తమ ఇంధన వసతుల జోలికి వస్తే అత్యంత తీవ్రమైన, విధ్వంసకరమైన ప్రతిస్పందన ఉంటుందని.. అలాంటి దాడులకు ప్రతిగా అమెరికా, దాని మిత్రదేశాలకు సంబంధించి పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్నచమురు, గ్యాస్ మౌలికసదుపాయాలన్నింటినీ తగలబెట్టి సర్వనాశనం చేస్తామని ఐఆర్‌జీసీ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ ఇంత తీవ్రంగా ప్రతిస్పందించడానికి కారణం ఏమిటి? అంటే.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టు అయిన ఖార్గ్ ద్వీపం జోలికి అమెరికా రావడమే ఇందుకు కారణం. మ్యాప్‌లో చూస్తే.. పర్షియన్ గల్ఫ్‌లో అత్యంత చిన్నగా, ఒక చుక్కలా కనిపించే ఖార్గ్ ద్వీపం ఇరాన్ దక్షిణ తీరం నుంచి దాదాపు 33 కిలోమీటర్ల దూరంలో.. హోర్ముజ్ జలసంధికి వాయవ్యంగా 480 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఈ ద్వీపం పొడుగు 8 కిలోమీటర్లు.. వెడల్పు 4 కిలోమీటర్లు. చాలా చిన్నద్వీపమేగానీ.. కానీ, భౌగోళికంగా ఇరాన్‌కు ఈ ద్వీపం అత్యంత కీలకమైనది. ఎందుకంటే.. ఇరాన్ ప్రధాన భూభాగం భూకంపాల ముప్పు ఉన్న ప్రాంతం. అక్కడ భారీ ఎత్తున చమురు నిల్వ చేస్తే.. భూకంపాలు వచ్చినప్పుడు పైపులైన్లు పగిలిపోయే ప్రమాదం, ట్యాంకులు బద్దలయ్యే ముప్పు ఉంటుంది. కానీ, ఖార్గ్ ద్వీపం పర్షియన్ అఖాతంలో ఒక పెద్ద రాతి పలక మీద ఉంటుంది. భూకంపాల ప్రభావం ఈ ద్వీపంపై తక్కువగా ఉంటుంది. అలాగే.. భౌగోళికంగా ఈ ప్రాంతంలో సునామీలు వచ్చే ముప్పు లేదు. ఇక.. ఈ ప్రాంతం ఒక భారీ అఖాతం కావడంతో పెద్ద పెద్ద నౌకల్లో చమురు తీసుకొచ్చి ఈ ద్వీపంలో లోడ్ చేసుకోవచ్చు. ఆ ప్రాంతంతో పోలిస్తే.. ఇరాన్ సముద్ర తీరంలో లోతు తక్కువ ఉంటుంది కాబట్టి.. ఆ దేశం తన చమురు నిల్వలన్నింటినీ ఈ ద్వీపంలోనే భద్రపరుస్తుంది. వీటిని ఆయిల్ టెర్మినల్స్ అంటారు. ఇరాన్‌లోని ప్రధాన భూభాగంలో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ నుంచి ఈ ద్వీపానికి చమురును భారీ పైపుల ద్వారా తరలిస్తారు. ద్వీపంలో ఎత్తైన ప్రదేశాల్లో ఉండే ట్యాంకుల్లోకి ఆ చమురును పంపుతారు. దీనివల్ల.. ఓడల్లోకి ఆ చమురును లోడ్ చేయడానికి పెద్ద పెద్ద పంపులు వాడాల్సిన పని ఉండదు. కేవలం గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఓడల్లోకి వేగంగా వెళ్లిపోతుంది. ఇది ఖర్చును సమయాన్ని బాగా తగ్గిస్తుంది.
ఆ దేశం ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసే ముడిచమురులో 90% ఈ ద్వీపం నుంచే వెళ్తుంది. ఇరాన్‌కు చమురు ద్వారా దాదాపుగా 7800 కోట్ల డాలర్ల ఆదాయం వస్తుందని అంచనా! అందులో 90శాతం అంటే.. దాదాపుగా 7000 కోట్ల డాలర్లు. మన రూపాయల్లో చెప్పాలంటే.. ఇంచుమించుగా 6.4 లక్షల కోట్ల రూపాయలు! (అందుకే ట్రంప్ ఈ ద్వీపాన్ని ‘క్రౌన్ జువెల్ (కిరీటంలోని రత్నం)’గా అభివర్ణించారు. నిజానికి గల్ఫ్‌లో చమురు నిల్వలు బయటపడడానికి ముందు.. ఆ ప్రాంతం మేలిముత్యాలకు ప్రసిద్ధి. పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చే ముత్యాలకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉండేది. మరీ ముఖ్యంగా ఖార్గ్ ద్వీపానికి చుట్టుపక్కల ఉండే పగడపుదిబ్బల్లో నాణ్యమైన మేలిముత్యాలు దొరికేవి. చమురు నిల్వలు బయటపడ్డాక ఘనమైన ఆ చరిత్ర గతమైంది. అందుకే 1960లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఇరానియన్ రచయిత జలాల్ ఏ అహ్మద్.. ఆ దీవిని ‘పర్షియన్ గల్ఫ్‌లో అనాథ ముత్యం’గా అభివర్ణించారు. ట్రంప్ దీన్ని క్రౌన్ జువెల్ అనడం వెనుక కారణం అదే). ఖార్గ్ దీవిలో తాను భద్రపరిచే చమురు నిల్వలను కాపాడుకోవడానికే ఇరాన్ అక్కడ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. అమెరికా దాడులు జరిపింది వాటిపైనే. ఈ దాడుల్లో అమెరికా ఇరాన్ చమురు ట్యాంకులను లక్ష్యంగా చేసుకోకపోవడం వెనుక ఒక వ్యూహం ఉంది. అదేంటంటే.. చమురు నిల్వలను నాశనం చేస్తే అంతర్జాతీయ విపణిలో ధరలు పెరిగిపోతాయి. అది అమెరికాకు కూడా నష్టమే. అలా కాకుండా వ్యూహాత్మకంగా సైనిక స్థావరాలపైన మాత్రమే దాడులు జరపడం ద్వారా.. ‘‘నేను తల్చుకుంటే నీ చమురు నిల్వలను కూడా నాశనం చేసి నిన్ను ఆర్థికంగా దెబ్బతీస్తాను’’ అని ఇరాన్‌కు హెచ్చరిక పంపింది. దీంతో, ఇరాన్ కూడా అంతే తీవ్రంగా స్పందించి.. అమెరికాకు అదే స్థాయిలో హెచ్చరిక జారీ చేసింది. ఖార్గ్ ఒక్కటే కాదు.. ఆర్థికంగా, రక్షణపరంగా ఇరాన్‌కు అత్యంత కీలకమైన క్వెష్మ్, అబు ముసా, గ్రేటర్ అండ్ లెస్సర్ టంబ్స్ వంటి దీవులు ఈ అఖాతంలో ఉన్నాయి.
సెంట్రల్ డెస్క్
ఇవి కూడా చదవండి...
గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ
కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే