Share News

కెన్యా ప్రెసిడెంట్ ఆగ్రహం.. టాటా కెమికల్స్ కంపెనీ దేశాన్ని వీడాలంటూ ఆదేశం

ABN , Publish Date - Sep 04 , 2026 | 02:09 PM

ఆఫ్రికా దేశం కెన్యాలోని టాటా కెమికల్స్ మగాదీ లిమిటెడ్‌పై ఆ దేశ అధ్యక్షుడు విలియమ్ రూటో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశాన్ని వీడాలని ఆదేశించారు.

కెన్యా  ప్రెసిడెంట్ ఆగ్రహం.. టాటా కెమికల్స్ కంపెనీ దేశాన్ని వీడాలంటూ ఆదేశం
Kenya President William Ruto

ఇంటర్నెట్ డెస్క్: ఆఫ్రికా దేశం కెన్యాలోని టాటా కెమికల్స్ మగాదీ లిమిటెడ్‌పై ఆ దేశ అధ్యక్షుడు విలియమ్ రూటో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశాన్ని వీడాలని ఆదేశించారు. కొన్నేళ్లుగా తమ దేశంలో టాటా కంపెనీ కార్యకలాపాలు సాగిస్తున్నా స్థానిక ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని ఆరోపించారు.

టాటా కెమికల్స్ సంస్థ తమ దేశంలో రా సోడా యాష్ (సోడియం కార్బొనేట్) ఖనిజాన్ని కేవలం ఎగుమతి చేసుకునేందుకే పరిమితమైందని ఆరోపించారు. ఈ ఖనిజానికి సంబంధించి ఎలాంటి ఇతరత్రా పరిశ్రమలను స్థానికంగా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. కజియాడో కౌంటీలో టాటా సంస్థకు దీర్ఘకాలిక మైనింగ్ హక్కులు ఉన్నప్పటికీ స్థానికంగా మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టిపెట్టట్లేదని ఆరోపించారు. గ్లాజు, ఇతర కెమికల్ తయారీ ప్లాంట్లు ఏవీ ఏర్పాటు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా సమగ్ర ఆర్థిక అభివృద్ధి జరగలేదని చెప్పారు. టాటా సంస్థ స్థానంలో మరో రెండు సంస్థలను రప్పించి స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు.


మేము బానిసలం కాదు..

జులై 28 నాటి అధ్యక్షుడి ఆదేశాల మేరకు టాటా కెమికల్స్ సంస్థ ఇప్పటికే కజియాడో కౌంటీలో కార్యకలాపాలు నిలిపివేసింది. రాయల్టీ బకాయిలు, ఎగుమతుల వివరాల్లో అవకతవకలు, పర్యావరణ చట్టాల ఉల్లంఘనలు, స్థానిక ప్రజల అభివృద్ధికి, వనరుల సేకరణకు సంబంధించి ఒప్పందాల అమల్లో లోపాలను ప్రస్తావిస్తూ కెన్యా ప్రభుత్వం టాటా కెమికల్స్‌ను తన మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది. అప్పట్లో అధ్యక్షుడు టాటా కంపెనీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 ఏళ్ల కాలపరిమితి గలమైనింగ్ కాంట్రాక్ట్ సొంతం చేసుకున్నప్పటికీ సంస్థ కజియాడోలో ఒక్క ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. తాము ఎవరికీ బానిసలం కాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

ఇప్పటికే టాటా కెమికల్స్‌కు, కజియాడో కౌంటీ స్థానిక ప్రభుత్వానికి మధ్య పన్ను వివాదం నడుస్తోంది. లాండ్ రేట్స్‌‌కు సంబంధించి టాటా సంస్థ తమకు అదనంగా 170 మిలియన్ డాలర్లు చెల్లించాలని స్థానిక ప్రభుత్వం చెబుతోంది. అయితే, స్థానికుల అభివృద్ధి కోసం తాము ఎంతో చేశామని టాటా సంస్థ చెబుతోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద స్థానికులకు నీటి వసతి ఏర్పాటు, రైలు రవాణాపై సబ్సీడీ, స్కూలు ఫీజుల చెల్లింపులు చేశామని చెబుతోంది. కానీ, పన్ను చెల్లింపులకు, సీఎస్ఆర్‌ ప్రత్యామ్నాయం కాదని కెన్యా ప్రభుత్వం వాదిస్తోంది.


నిబంధనలన్నీ అమలు చేశాం.. టాటా ప్రకటన

తాము స్థానిక నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేశామని టాటా కెమికల్స్ చెబుతోంది. జులై 28 నాటి ఆదేశాల్లో ప్రభుత్వం లేవనెత్తిన అంశాలకు సమాధానంగా అన్ని పత్రాలను సమర్పించామని పేర్కొంది. ప్రస్తుత ప్రతిష్టంభన తొలగిపోయేందుకు తాము అన్ని మార్గాల్లో ప్రభుత్వంతో కలిసి ప్రయత్నించేందుకు సిద్ధంగానే ఉన్నామంటూ రాజీ ధోరణిని కూడా ప్రదర్శించింది. ప్రభుత్వ తదుపరి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొంది.

ఏమిటీ సోడా యాష్?

సోడియం కార్బోనేట్‌ (సోడా యాష్) ఓ ముఖ్యమైన పారిశ్రామిక రసాయనమని నిపుణులు చెబుతున్నారు. గాజు, డిటర్జెంట్లు, ఇతర రసాయనాల తయారీలో దీన్ని వినియోగిస్తారు. టాటా కెమికల్స్ సంస్థ ట్రోనా అనే ఖనిజం నుంచి ఈ రసాయనాన్ని వెలికితీస్తోంది.


ఈ వార్తలనూ చదవండి:

భారతీయులున్న నౌకపై డ్రోన్ దాడి.. పాక్‌కు వెళుతుండగా..

భారత కంపెనీతో డీల్‌లో అవకతవకలు.. ఎస్తోనియా మంత్రి రాజీనామా

Updated Date - Sep 04 , 2026 | 02:25 PM