భారత కంపెనీతో డీల్‌లో అవకతవకలు.. ఎస్తోనియా మంత్రి రాజీనామా
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:08 PM
ఉక్రెయిన్‌కు ఆర్టిలరీ షెల్స్ (ఫిరంగి మందుగుండు సామగ్రి) సరఫరా కోసం భారతీయ కంపెనీతో చేసుకున్న డీల్‌లో అవకతవకల ఆరోపణలు ఎస్తోనియాలో కలకలం రేపుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌కు ఆర్టిలరీ షెల్స్ (ఫిరంగి మందుగుండు సామగ్రి) సరఫరా కోసం భారతీయ కంపెనీతో చేసుకున్న డీల్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఎస్తోనియాలో కలకలం రేపుతున్నాయి. చివరకు దేశ రక్షణ మంత్రి హన్నో పెవ్‌కుర్ పదవికి చేటు తెచ్చాయి. 2022 నుంచి రక్షణ మంత్రిగా ఉన్న హన్నో బుధవారం తన రాజీనామాను ప్రకటించారు. డీల్‌కు నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకున్నట్టు ఆయన చెప్పారు.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఉక్రెయిన్‌కు ఆర్టిలరీ షెల్స్ కోసం ఈయూ దేశమైన ఎస్తోనియా 2024లో ఇటలీకి చెందిన డేటాసెల్ ఎస్ఆర్ఎల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఏడాది మొదట్లోనే డేటాసెల్‌ను భారత్‌కు చెందిన నెకో డిఫెన్స్ సొంతం చేసుకుంది. డీల్ కుదిరిన నేపథ్యంలో ఐరోపా సమాఖ్యకు చెందిన నిధుల నుంచి కొంత మొత్తాన్ని ఎస్తోనియా అడ్వాన్స్‌గా చెల్లించింది. తొలుత ఆగస్టులో 15 మిలియన్ యూరోలు, అక్టోబర్ మరో 10 మిలియన్ యూరోలు, ఆ తరువాత పలు విడతల్లో మొత్తం 70 మిలియన్ యూరోలను చెల్లించింది.
డీల్ కుదిరిన కొన్ని నెలల్లోపే ఉక్రెయిన్‌కు ఆర్టిలరీ షెల్స్ సరఫరా కావాల్సి ఉండగా ఉత్పత్తిలో సమస్యల కారణంగా పలుమార్లు వాయిదా పడింది. చివరకు 2025లో ఆర్టిలరీ షెల్స్ సరఫరా అయినప్పటికీ తనిఖీల్లో నాణ్యతాలోపాలు బయటపడ్డాయి. అంతేకాకుండా, డేటాసెల్‌కు గతంలో మందుగుండు సామగ్రి ఉత్పత్తి చేసిన అనుభవం లేదని కూడా స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఎస్తోనియా డేటాసెల్‌తో కాంట్రాక్ట్ రద్దు చేసుకుంది. గతంలో ఇచ్చిన అడ్వాన్స్‌ను కూడా తిరిగి తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయప్రక్రియలు ప్రారంభించింది. మరోవైపు, ఈ డీల్‌ను పరిశీలించిన ఎస్తోనియాకు చెందిన నేషనల్ ఆడిట్ సంస్థ నిధుల నిర్వహణకు సంబంధించి పలు లోపాలు ఉన్నట్టు నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో మంత్రి హన్నో నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకున్నారు.
తాము ఇప్పటికే 58 మిలియన్ యూరోల విలువైన మందుగుండు సామగ్రిని సరఫరా చేశామని డేటాసెల్ పేర్కొంది. అడ్వాన్స్ కింద 59 మిలియన్ యూరోలు తీసుకున్నామని అంగీకరించింది. కాంట్రాక్ట్ రద్దుకు ఎస్తోనియా చెప్పిన కారణాలు అసబద్ధంగా, పరస్పర విరుద్ధంగా ఉన్నట్టు డేటాసెల్ తరఫు లాయర్ స్థానిక మీడియాతో చెప్పారు. తాము సరఫరా చేసిన మందుగుండు సామగ్రి నిరుపయోగంగా మారిందన్న ఆరోపణలను తోసిపుచ్చారు. అయితే, సరఫరాలో కొంత జాప్యం జరిగిందని సంస్థ అంగీకరించింది. ఈ క్రమంలో డీల్ న్యాయవివాదానికి దారి తీసింది.
ఈయూ నిధులతో ఈ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో యూరోపియన్ కమిషన్ కూడా ఈ అంశంపై దృష్టి సారించింది. తమ నిధులకు పటిష్ఠమైన రక్షణ ఉందని యూరోపియన్ కమిషన్ పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
నేపాల్ టన్నెల్స్‌లో రెస్క్యూ ఆపరేషన్స్.. 9 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు సిబ్బంది..
ముప్పు అంచున యూకే.. ట్రంప్ హెచ్చరిక