ట్రంప్ తీరు వల్ల అమెరికా ఇతర దేశాల విశ్వాసం కోల్పోతోంది.. జేపీ మోర్గాన్ విమర్శలు..
ABN , Publish Date - Jan 23 , 2026 | 02:39 PM
ప్రపంచ దేశాలతో అమెరికా వ్యవహరిస్తున్న తీరు వల్ల భవిష్యత్తులో ఆ దేశమే ఎక్కువగా నష్టపోతుందని జేపీ మోర్గాన్ సీఈఓ జామీ డిమోన్ పేర్కొన్నారు.
ప్రపంచ దేశాలపై తన ఇష్టం వచ్చినట్టుగా సుంకాలు విధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ఆమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై బహుళ జాతి ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ విమర్శలు కురిపించింది. ప్రపంచ దేశాలతో అమెరికా వ్యవహరిస్తున్న తీరు వల్ల భవిష్యత్తులో ఆ దేశమే ఎక్కువగా నష్టపోతుందని జేపీ మోర్గాన్ సీఈఓ జామీ డిమోన్ పేర్కొన్నారు (JPMorgan Jamie Dimon).
ట్రంప్ నిర్ణయాల వల్ల ప్రస్తుతం అమెరికా అన్ని దేశాల విశ్వాసాన్ని కోల్పోతోందని, ఇది అగ్రరాజ్యానికి ఎంత మాత్రమూ మంచిది కాదని జామీ డిమోన్ అన్నారు. అమెరికా వల్ల ఇబ్బందులు పడుతున్న దేశాలన్నీ భవిష్యత్తులో ఏకమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఇటీవల చైనాలో పర్యటించారని, త్వరలో భారత్‌లో కూడా పర్యటించబోతున్నారని తెలిపారు. అమెరికా విధానాల వల్లే కెనడా వంటి మిత్రదేశం కూడా వేరే దారులు వెతుక్కుంటోందని పేర్కొన్నారు (economic disaster warning).
కాగా, దావోస్ వేదికగా అమెరికాపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే (World Economic Forum Davos). అమెరికా ఆధిపత్యంలో ప్రపంచం అభివృద్ధి వైపు కాకుండా విచ్ఛిన్నం వైపు వెళ్తోందని పేర్కొన్నారు. గతంలో భాగస్వామ్య దేశాల శ్రేయస్సు కోసం చేసుకున్న ఆర్థిక ఒప్పందాలను ఇప్పుడు ఆయుధాలుగా వాడుకుంటున్నారని విమర్శించారు. కాగా, మార్క్ కార్నీ విమర్శలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజా శాంతి మండలిలో చేరాలని కెనడాకు పంపిన ఆహ్వానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు.
ఇవీ చదవండి:
తెలంగాణ ఇంటర్మీడియట్.. వచ్చే ఏడాది ఇంటర్ ఫస్టియర్‌కు కొత్త సిలబస్
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే