Share News

లెబనాన్‌తో పీటముడి!

ABN , Publish Date - Apr 10 , 2026 | 03:25 AM

పశ్చిమాసియాలో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ తీరుతో పీటముడి పడింది. అటు కాల్పుల విరమణ ప్రకటన రాగానే.. ఇటు లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ మరింత ఉధృతంగా దాడులు చేయడం పరిస్థితిని సంక్లిష్టంగా మార్చింది.

లెబనాన్‌తో పీటముడి!

  • ఇజ్రాయెల్‌ తీరుతో కాల్పుల విరమణ సంక్లిష్టం

  • లెబనాన్‌పై దాడులు కాల్పుల విరమణ ఉల్లంఘనే

  • ఆ దేశంపై వెంటనే దాడులను నిలిపివేయాలి: ఇరాన్‌

  • ఆపకుంటే సీజ్‌ఫైర్‌ చర్చల్ని బహిష్కరిస్తామని హెచ్చరిక

  • లెబనాన్‌తో ప్రత్యక్ష చర్చలకు ఏర్పాట్లు: నెతన్యాహు

  • దాడుల నిలిపివేత మాత్రం ఉండదన్న ఇజ్రాయెల్‌ ప్రధాని

  • ఒప్పందంలోకి లెబనాన్‌ను చేర్చకుండా ఉండేలా ప్రయత్నం!

  • గురువారం కూడా ఉధృతంగా దాడులు.. 17 మంది మృతి

  • హెజ్బొల్లా చీఫ్‌ నయీమ్‌ కసేమ్‌ మేనల్లుడు మృతి

బీరూట్‌/దుబాయ్‌/టెహ్రాన్‌, ఏప్రిల్‌ 9: పశ్చిమాసియాలో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ తీరుతో పీటముడి పడింది. అటు కాల్పుల విరమణ ప్రకటన రాగానే.. ఇటు లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ మరింత ఉధృతంగా దాడులు చేయడం పరిస్థితిని సంక్లిష్టంగా మార్చింది. లెబనాన్‌పై దాడులు వెంటనే ఆపాలంటూ హోర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ మళ్లీ మూసేయడం.. అవసరమైతే మళ్లీ దాడులకు దిగుతామని ఇరాన్‌ రెవెల్యూషనరీ గార్డ్స్‌ (ఐఆర్‌జీసీ) హెచ్చరించడం, కాల్పుల విరమణ ప్రతిపాదనల్లో ‘లెబనాన్‌’ అంశమే లేదని అమెరికా చెబుతుండటం వంటి పరిణామాలు ఆందోళన రేపుతున్నాయి. చర్చల మధ్యవర్తి పాకిస్థాన్‌ కూడా గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నా.. ఇజ్రాయెల్‌ వెనక్కి తగ్గలేదు. గురువారం కూడా దాడులు కొనసాగించింది. తమ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్‌ నయీమ్‌ కసేమ్‌ మేనల్లుడు, ఆ సంస్థ కార్యదర్శి అలీ యూసఫ్‌ హర్షి మృతిచెందినట్టు ప్రకటించింది.

లెబనాన్‌పై గురువారం తెల్లవారుజామున, తిరిగి సాయంత్రం ఇజ్రాయెల్‌ భారీ స్థాయిలో దాడులకు దిగింది. దక్షిణ లెబనాన్‌లోని అల్‌ జ్రరియే ప్రాంతంలో, టైర్‌ నగరంలో జరిగిన దాడుల్లో 17 మంది మృతిచెందారు. బీరూట్‌, బింట్‌ జబేల్‌, మర్జాయౌన్‌, బెక్కా వ్యాలీ ప్రాంతాల్లోనూ ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. టైర్‌ నగరంలో వంతెన ధ్వంసమైంది. బింట్‌ జబేల్‌ పట్టణం సమీపంలో హెజ్బొల్లాకు, ఇజ్రాయెల్‌ సైన్యానికి మధ్య ఉధృతంగా పోరాటం జరుగుతోంది. కీలకమైన ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు గురువారం ఉత్తర ఇజ్రాయెల్‌లోని కిర్యత్‌ షిమోనా, గలీలీతోపాటు పలు పట్టణాలను లక్ష్యంగా చేసుకుని హెజ్బొల్లా రాకెట్లు ప్రయోగించిందని ఇజ్రాయెల్‌ తెలిపింది. పలుచోట్ల పేలుళ్లు జరిగాయని తెలిపింది.

3.jpg


లెబనాన్‌ ఆస్పత్రుల్లో మందుల కొరత

కాగా, ఇజ్రాయెల్‌ ఉధృత దాడుల కారణంగా లెబనాన్‌ దక్షిణ ప్రాంతంలోని చాలా ఆస్పత్రుల్లో అత్యవసర, ప్రాణాధార మందులకు కొరత ఏర్పడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. దాడుల్లో గాయపడిన వారికి తగిన చికిత్సలు అందించలేని పరిస్థితి నెలకొందని.. బ్యాండేజీలు కూడా లేవని పేర్కొంది.

ఒప్పందంలో ‘లెబనాన్‌’ కూడా ఉండాలి..

పాకిస్థాన్‌లో జరిగే చర్చల్లో లెబనాన్‌ అంశంపై దాడుల నిలిపివేత అంశం కూడా ఉండేలా చూడాలని లెబనాన్‌ ప్రధాని నవాఫ్‌ సలామ్‌ గురువారం పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌‌కు విజ్ఞప్తి చేశారు. పశ్చిమాసియాలో శాంతి కోసం పాక్‌ ప్రయత్నాలను ప్రశంసించారు.

లెబనాన్‌తో ప్రత్యక్ష చర్చలు: నెతన్యాహు

లెబనాన్‌ విజ్ఞప్తి మేరకు ఆ దేశంతో ప్రత్యక్ష చర్చలకు చర్యలు చేపట్టాలని మంత్రివర్గాన్ని ఆదేశించినట్టు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు గురువారం తెలిపారు. వీలైనంత త్వరగా ప్రక్రియ ప్రారంభించాలని సూచించినట్టు చెప్పారు. హెజ్బొల్లా సంస్థ నిరాయుధీకరణ, ఇజ్రాయెల్‌, లెబనాన్‌ మధ్య శాంతియుత సంబంధాలు నెలకొల్పడంపై చర్చలు ఉంటాయని వెల్లడించారు. అయితే చర్చల సమయంలో దాడుల నిలిపివేత ఉండదని స్పష్టం చేశారు. అంతకుముందు ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టిన నెతన్యాహు.. హెజ్బొల్లా స్థావరాలపై ఉధృతంగా దాడులు చేస్తామని, వైమానిక దాడులకు భౌగోళిక పరిమితులు అడ్డంకి కాదని పేర్కొన్నారు.


కాల్పుల విరమణలోకి వెళ్లకుండా..?

లెబనాన్‌తో ప్రత్యక్ష చర్యలకు సిద్ధమన్న నెతన్యాహు సంకేతాలు ‘ఇరాన్‌’తో కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌ భాగం కాకుండా చూసే ప్రయత్నమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాల్పుల విరమణ ఒప్పందంలోకి వెళితే.. లెబనాన్‌పై తప్పనిసరిగా దాడులు నిలిపివేయాల్సి వస్తుందని, ఈ అంశంలో అమెరికాతోపాటు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్‌ కూడా జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుందని నెతన్యాహు భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యక్ష చర్చలు చేపట్టడం, అవసరమైతే కొన్ని రోజులు దాడుల తీవ్ర తగ్గించడం చేయవచ్చని అంటున్నారు. చర్చల ప్రకటన చేసినా లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగడాన్ని గుర్తు చేస్తున్నారు.

దాడులు ఆపకుంటే..చర్చలు బహిష్కరిస్తాం: ఇరాన్‌

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్‌ మండిపడింది. వెంటనే దాడులు నిలిపివేయాలని.. లేకుంటే ఇస్లామాబాద్‌లో జరగనున్న కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలను బహిష్కరిస్తామని హెచ్చరించింది. అమెరికా-ఇరాన్‌ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌ అంశం విడదీయలేని భాగమని ఇరాన్‌ పార్లమెంటు స్పీకర్‌ మొహమ్మద్‌ బఘర్‌ గలీబఫ్‌ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌ తీరు తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగిస్తూనే ఉంటే అమెరికాతో చర్చలు అర్థరహితం అవుతాయని ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ స్పష్టం చేశారు.

Updated Date - Apr 10 , 2026 | 03:25 AM