లెబనాన్‌తో చర్చలు.. ఇజ్రాయెల్ ప్రధాని కీలక ప్రకటన
ABN , Publish Date - Apr 09 , 2026 | 10:07 PM
లెబనాన్‌తో వీలైనంత త్వరగా శాంతి చర్చలు ప్రారంభించాలని తమ అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజాగా తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: గల్ఫ్‌లో శాంతిస్థాపనపై ఆశలు చిగురించేలా ఇజ్రాయెల్ తాజాగా కీలక ప్రకటన చేసింది. లెబనాన్‌తో శాంతి చర్చలు ప్రారంభించమని తమ అధికార యంత్రాంగాన్ని ఆదేశించానని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తాజాగా తెలిపారు. బుధవారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన భారీ దాడుల్లో 200 పైచిలుకు మంది మరణించారు. ఈ దాడులపై ఇరాన్ అగ్గిమీద గుగ్గిలమైన నేపథ్యంలో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తప్పవన్న భయాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో శాంతి చర్చల దిశగా ఇజ్రాయెల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.
‘నేరుగా చర్చలు జరపాలని లెబనాన్ పదే పదే అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో చర్చలను వీలైనంత త్వరగా ప్రారంభించమని నేను మా అధికార యంత్రాంగాన్ని ఆదేశించాను’ అని ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. హెజ్‌బొల్లాకు ఆయుధాలు దక్కకుండా చేయడం, లెబనాన్‌తో శాంతిస్థాపనపై తాము దృష్టిసారిస్తామని తెలిపారు. అంతకుముందు లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అవోన్ కూడా కీలక ప్రకటన చేశారు. హింసాత్మక ఘటనలకు ఫుల్ స్టాప్ పడనిదే ముందుకు సాగలేమని స్పష్టం చేశారు. కాల్పుల విరమణతోనే చర్చలు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే దౌత్యమార్గాల్లో ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు ఉందని తెలిపారు.
ఇక మార్చి 2న ఇరాన్ మద్దతుతో హెజ్‌బొల్లా దాడులకు దిగిన నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. లెబనాన్ వర్గాల కథనం ప్రకారం, ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివకూ సుమారు 1,700 మంది మరణించారు. మరో పది లక్షల మంది తాము ఉంటున్న ప్రాంతాలను వీడి వలసపోయారు. ఇక హెజ్‌బొల్లాకు చెందిన సుమారు 400 మంది ఫైటర్లు కూడా మరణించినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఈ వార్తలనూ చదవండి:
వియత్నాంలో భారతీయ పర్యాటకుల ఇక్కట్లు.. స్పందించిన ఎంబసీ