జైలు నుంచి పారిపోవాలని చూస్తే మొసళ్లతో వేట.. ఇజ్రాయెల్‌లో సంచలన చట్టం!
ABN , Publish Date - Jul 19 , 2026 | 04:43 PM
జైళ్ల నుంచి ఖైదీలు తప్పించుకోకుండా అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం అత్యంత విచిత్రమైన, సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. జైళ్ల చుట్టూ భద్రత కోసం ఇకపై మొసళ్లను ఉపయోగించేందుకు వీలు కల్పిస్తూ కొత్త నిబంధనను తీసుకువచ్చింది.
టెల్ అవీవ్, జులై 19: జైళ్ల నుంచి ఖైదీలు తప్పించుకోకుండా అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం అత్యంత విచిత్రమైన, సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. జైళ్ల చుట్టూ భద్రత కోసం ఇకపై మొసళ్లను ఉపయోగించేందుకు వీలు కల్పిస్తూ కొత్త నిబంధనను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా మొసళ్లను 'వన్యప్రాణుల' (Wild Animals) జాబితా నుంచి తొలగించి, 'బంధించి పెంచే వన్యప్రాణుల' కేటగిరీలోకి మారుస్తూ ఇజ్రాయెల్ పర్యావరణ పరిరక్షణ మంత్రి ఇడిత్ సిల్మాన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ చట్టపరమైన మార్పుతో వన్యప్రాణుల సంరక్షణ సంస్థల పరిధిలో ఉండే మొసళ్ల పర్యవేక్షణ బాధ్యతలు, ఇప్పుడు నేరుగా ప్రభుత్వ భద్రతా విభాగాల చేతుల్లోకి వెళ్లనున్నాయి.
బెన్ గ్విర్ మార్క్ ప్లాన్.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!
ఇజ్రాయెల్‌కు చెందిన వివాదాస్పద తీవ్ర రైట్ వింగ్ భావజాల, జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్ గ్విర్ గత ఏడాది డిసెంబర్‌లోనే ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న 'అలిగేటర్ అల్కాట్రాజ్' తరహాలో పాలస్తీనా ఖైదీలు ఉన్న జైళ్ల చుట్టూ మొసళ్లను మోహరించాలని ఆయన ప్రతిపాదించారు.
తాజా చట్ట సవరణను స్వాగతిస్తూ బెన్ గ్విర్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఒక ఏఐ (AI) జెనరేటెడ్ ఫోటో షేర్ చేశారు. అందులో ఆయన ఒక మొసలిని మెడతాడుతో పట్టుకుని ఉన్నట్లు ఉంది. ఆ పోస్ట్‌కు 'జైలు నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇంకోసారి ఆలోచించుకోండి! మంత్రులు బెన్ గ్విర్, సిల్మాన్‌లు కలిసి జైళ్ల చుట్టూ మొసళ్లను మోహరిస్తున్నారు' అని ఆయన క్యాప్షన్ పెట్టారు.
కెట్జియోట్ జైలు లక్ష్యంగానేనా?
దక్షిణ ఇజ్రాయెల్‌లోని 'కెట్జియోట్' జైలు చుట్టూ ఈ నైలు నది మొసళ్లను (Nile Crocodiles) మోహరించాలని బెన్ గ్విర్ భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 2023 అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడి తర్వాత పట్టుబడిన అనేక మంది హమాస్ ఉగ్రవాదులను ప్రస్తుతం ఈ జైల్లోనే బంధించారు.
తొలుత వ్యతిరేకత.. ఇప్పుడు చట్టం
ఇజ్రాయెల్ ఛానల్ 13 కథనం ప్రకారం.. బెన్ గ్విర్ గత ఏడాది ఈ ప్రతిపాదనను తెచ్చినప్పుడు ఇజ్రాయెల్ నేచర్ అండ్ పార్క్స్ అథారిటీ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. అంతేకాదు, జైళ్ల శాఖలోని కొందరు ఉన్నతాధికారులు కూడా అప్పట్లో ఈ ప్రతిపాదనపై నవ్వుకున్నారు.
అయితే, బుధవారం నాడు అధికారికంగా ఆమోదం పొందిన కొత్త నిబంధనల ప్రకారం.. 'ఈ మొసళ్లను భద్రతా సంస్థల పర్యవేక్షణలోనే ఉంచాలి, అలాగే ఇవి పొరపాటున కూడా అడవుల్లోకి లేదా బయటకు తప్పించుకోకుండా నేచర్ అండ్ పార్క్స్ అథారిటీ డైరెక్టర్ నిర్దేశించిన నిబంధనల మేరకే పెంచాలి' అనే షరతులతో అనుమతులు మంజూరు చేశారు. శత్రువులను నియంత్రించేందుకు ఇజ్రాయెల్ తీసుకున్న ఈ వింత వ్యూహం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి:
'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం
సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల