పది నిమిషాల్లో 100 బాంబులు
ABN , Publish Date - Apr 09 , 2026 | 06:27 AM
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. బుధవారం పది నిమిషాల వ్యవధిలోనే 100 చోట్ల...
కాల్పుల విరమణ రప్రకటన తర్వాత లెబనాన్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. దాదాపు 300 మంది మృతి
బీరుట్/ టెల్ అవీవ్, ఏప్రిల్ 8: అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. బుధవారం పది నిమిషాల వ్యవధిలోనే 100 చోట్ల బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 300 మంది వరకు మరణించారని లెబనాన్ అధికారులు తెలిపారు. బీరుట్ నగరంతోపాటు దక్షిణ లెబనాన్, తూర్పు బెకా లోయ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ అంశం లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించిన కొద్దిసేపటికే ఈ దాడులు జరగటం గమనార్హం. హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మార్చి 2వ తేదీ నుంచి లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. లెబనాన్‌లో హెజ్బొల్లాపై భూతల దాడులు కూడా కొనసాగుతాయని ఇజ్రాయెల్ సైన్యం బుధవారం స్పష్టంచేసింది. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ అంశం ఉందా లేదా? అన్న అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇరాన్ విధించిన పది షరతుల్లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపేయాలన్న అంశం కూడా ఉంది. ఇరాన్‌తోపాటు చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. అయితే, లెబనాన్ అంశంలో ఇందులో లేదని ఒప్పందం కుదిరిన వెంటనే నెతన్యాహు ప్రకటించారు. బుధవారం సాయంత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా నెతన్యాహు ప్రకటనతో ఏకీభవిస్తూ ప్రకటన చేశారు.
ఇవి కూడా చదవండి..
ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..
ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..