Share News

ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి.. పాక్ ప్రధాని విచారం

ABN , Publish Date - Feb 06 , 2026 | 07:47 PM

ఇస్లామాబాద్‌లో ఓ మసీదు వద్ద తాజాగా జరిగిన దాడిపై ప్రధాని షహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. దాడిని ఖండిస్తున్నట్టు తెలిపారు.

ఇస్లామాబాద్‌లో  ఆత్మాహుతి దాడి.. పాక్ ప్రధాని విచారం
Islamabad suicide bombing

ఇంటర్నెట్ డెస్క్: ఇస్లామాబాద్‌లోని ఓ మసీదు వద్ద శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 69 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడిని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehabaz Sharif) ఖండించారు. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు (Islamabad Suicide Bombing).

నగరంలోని షెహజాద్ టౌన్ ఏరియాలో షియా వర్గ ప్రజలు ప్రార్థనలు నిర్వహించే తర్లాయ్ ఇమామ్‌బార్గా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వాస్తవానికి అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఆత్మాహుతి బాంబర్‌ను గేటు వద్దే అడ్డుకున్నారు. దీంతో, సూసైడ్ బాంబర్ అక్కడికక్కడే తనను తాను పేల్చుకున్నాడు. గేట్‌ వద్దే సూసైడ్ బాంబర్‌ను అడ్డుకోకపోయి ఉంటే మరింత ప్రమాదం జరిగి ఉండేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పేలుడు ధాటికి ఆ ప్రాంతంలో బీభత్స వాతావరణం నెలకొంది. మృతదేహాలు, శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి భయానక వాతావరణం కనిపించింది.


ఆత్మాహుతి దాడి నేపథ్యంలో ఇస్లామాబాద్ ఐజీ నగరంలో అత్యయిక స్థితిని విధించారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తాజా దాడి చేసిన సూసైడ్ బాంబర్‌కు ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఏ-తాలిబాన్‌‌తో సంబంధం ఉండొచ్చని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. బలోచిస్థాన్‌కు చెందిన వేర్పాటు వాద సంస్థ బీఎల్ఏ ఈ దాడి చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాడులకు బాధ్యత వహిస్తూ ఇంతవరకూ ఏ సంస్థా ముందుకు రాకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది.

గతేడాది నవంబర్ 11న ఇస్లామాబాద్‌లోని ఓ జిల్లా కోర్టు వద్ద ఇదే తరహా దాడి జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా 30 మంది గాయపడ్డారు.


ఇవీ చదవండి:

మ్యాన్‌హోల్ కవర్స్ చోరీ చేస్తే రూ.50 లక్షల ఫైన్.. పాక్‌లో చట్టం

ఎప్‌స్టీన్ ఫైల్స్ కలకలం.. బ్రిటన్ ప్రధాని క్షమాపణలు

Updated Date - Feb 06 , 2026 | 08:45 PM