ఇరాన్- ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:09 AM
పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారింది. ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పరం భీకర దాడులు చేసుకున్నాయి. లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఆదివారం రాత్రి ఆ దేశంపై క్షిపణులతో విరుచుకుపడింది.
పరస్పరం దాడులు చేసుకున్న ఇరు దేశాలు
లెబనాన్‌పై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు
ప్రతిగా మషెహర్ పెట్రోకెమికల్ ప్లాంట్‌పై ఇజ్రాయెల్ దాడి
ఇరాన్ 30 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది: ఇజ్రాయెల్
వెంటనే ఆపండి: ట్రంప్.. దాడులను ఖండించిన భారత్
ఇరాన్‌ను వీడాలని భారతీయులకు పిలుపు
వాషింగ్టన్, జూన్ 8: పశ్చిమాసియా మళ్లీ రణరంగంగా మారింది. ఇరాన్-ఇజ్రాయెల్ పరస్పరం భీకర దాడులు చేసుకున్నాయి. లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఆదివారం రాత్రి ఆ దేశంపై క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడులు చేసింది. దీంతో పర్షియన్ గల్ఫ్‌లో మళ్లీ యుద్ధ భయాలు నెలకొన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పట్టించుకోకుండా బీరుట్‌లోని ఇరాన్ అనుకూల హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. దాడులు ఆపాలని ఇరాన్ పదేపదే హెచ్చరించినా పట్టించుకోకపోవటంతో ఆదివారం రాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. తమపై ఇరాన్ దాదాపు 30 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిందని ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) ప్రకటించింది. తమ గగన రక్షణ వ్యవస్థ వాటిని కూల్చేసిందని సోమవారం వెల్లడించింది. హెజ్బొల్లా కూడా రెండు క్షిపణులు ప్రయోగించిందని తెలిపింది. ఇరాన్‌కు కీలకమైన మషెహర్ పెట్రోకెమికల్ ప్లాంట్‌పై ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించింది. దీంతో ఆ ప్లాంటు పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ దాడుల్లో ప్రాణనష్టంపై ఇరు దేశాలు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఏప్రిల్ రెండోవారంలో ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఇరాన్-ఇజ్రాయెల్ ఈస్థాయిలో దాడులు చేసుకోవటం ఇదే మొదటిసారి. దాడులపై ఇరాన్ మిలిటరీ స్పందించింది. బీరుట్‌పై ఇజ్రాయెల్ మళ్లీ దాడి చేస్తే పశ్చిమాసియా మొత్తం యుద్ధంలోకి జారుకుంటుందని హెచ్చరించింది. ప్రస్తుతానికి దాడులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరాక్, సౌదీ అరేబియాపై కూడా ఇరాన్ దాడులు చేసినట్లు వార్తలొచ్చాయి. తమదేశంపై దాడి జరగలేదని సౌదీ ప్రకటించింది. తమదేశంలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌పై దాడి జరిగినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని మేజర్ జనరల్ తుర్కీ మాలికీ తెలిపారు. యెమెన్ నుంచి ఒక బాలిస్టిక్ క్షిపణి తమ సరిహద్దులవైపు దూసుకురావటంతో హెచ్చరిక సైరన్లు మోగాయని, ఆతర్వాత ఆ క్షిపణి రాడార్‌నుంచి మాయమైందని వివరించారు. కాగా, క్షిపణి దాడులను తక్షణం ఆపాలని ఇరాన్, ఇజ్రాయెల్‌లను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. శాంతి కోసం చర్చలు జరుగుతున్న సమయంలో మూర్ఖత్వంతో దాడులు చేసుకొంటూ పరిస్థితిని సంక్లిష్టం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్రూత్ సోషల్‌లో వరుస పోస్టులు పెట్టారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ట్రంప్ స్వయంగా ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. ఇరాన్ దాడి చేసినా ప్రతిదాడి చేయవద్దని నెతన్యాహుకు ట్రంప్ గట్టిగా చెప్పినట్లు సమాచారం. ఇరాన్ శాంతి ఒప్పందంపై సంతకం చేసేవరకు హోర్ముజ్ జలసంధిలో తమ నౌకాదళం దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టంచేశారు.

దాడులు ఆందోళనకరం: భారత్
ఇరాన్-ఇజ్రాయెల్ మళ్లీదాడులు చేసుకోవటంపై భారత్ ఆందోళన వ్యక్తంచేసింది. వెంటనే దాడులు ఆపేసి, సహనం వహించాలని విదేశాంగ శాఖ పిలుపునిచ్చింది. పశ్చిమాసియాలో సుదీర్ఘ సైనిక ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, మానవతా సంక్షోభాలు తలెత్తుతున్నాయని పేర్కొంది. మరోవైపు ఇరాన్‌లోని భారతీయులు వెంటనే ఆ దేశాన్ని వీడాలని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం సోమవారం సూచించింది.
భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై అమెరికా దాడి?
సురక్షితంగా బయటపడిన 24 మంది
మనదేశం నుంచి ఒమన్‌కు వెళ్తున్న ఎంటీ మారివెక్స్ అనే ఖాళీ చమురు నౌకపై ఒమన్ తీరంలో సోమవారం దాడి జరిగింది. అమెరికా నౌకాదళం ఈ దాడికి పాల్పడింది. నౌకలో ఉన్న 24 మంది భారతీయ సిబ్బంది ఒమన్ అధికారుల సహకారంతో సురక్షితంగా బయటపడినట్లు నౌకాయాన శాఖ తెలిపింది. పలావు పతాకంతో ఉన్న ఈ నౌక మనదేశంలోని కార్వార్ నుంచి ఒమన్‌లోని డఖమ్‌కు వెళ్తోంది. ఒమన్ తీరానికి 15 నాటికల్ మైళ్ల దూరంలో దాడి జరగటంతో నౌకకు ఇంజన్ వైపు రంద్రం పడింది. వెంటనే మంటలు చెలరేగాయి. నౌకలోని లైఫ్ బోట్లు కూడా ధ్వంసమయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో నౌకలోని సిబ్బంది అత్యవసర సహాయం కోసం సందేశం పంపారు. సిబ్బంది అంతా నౌక నుంచి సురక్షితంగా బయటపడినట్లు నౌకాయాన శాఖ డైరెక్టర్ ఓపేశ్ కుమార్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. దాడి విషయాన్ని నౌకలోని నీలేశ్ అనే నావికుడు తమకు ఫోన్లో వివరించి సాయం కోరాడని ఆల్ ఇండియా సీఫేరర్స్ యూనియన్ వెల్లడించింది. తమ ఆంక్షలను ఉల్లంఘించి ఈ నౌక ఇరాన్, రష్యాల నుంచి చమురును ఇతర దేశాలకు తరలిస్తున్నట్లు అమెరికా అధికారులు ఆరోపించారు.