Share News

ముగింపు దశకు ఇరాన్‌ యుద్ధం

ABN , Publish Date - Apr 16 , 2026 | 03:35 AM

ఇరాన్‌తో యుద్ధం దాదాపు ముగింపు దశకు వచ్చిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తెలిపారు. సైనిక చర్య ద్వారా ఇరాన్‌ అణ్వాయుధాలు తయారు చేయకుండా నిరోధించగలిగామని చెప్పారు.

ముగింపు దశకు ఇరాన్‌ యుద్ధం

  • చమురు ధరలు భారీగా తగ్గుతాయి.. హోర్ముజ్‌ను శాశ్వతంగా తెరిచి ఉంచుతాం

  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడి

  • ఇరాన్‌తో రెండో దఫా చర్చలకు అమెరికా రెండు షరతులు

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 15: ఇరాన్‌తో యుద్ధం దాదాపు ముగింపు దశకు వచ్చిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తెలిపారు. సైనిక చర్య ద్వారా ఇరాన్‌ అణ్వాయుధాలు తయారు చేయకుండా నిరోధించగలిగామని చెప్పారు. ఫాక్స్‌న్యూస్‌ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇరాన్‌ యుద్ధంపై మాట్లాడారు. ‘యుద్ధం ముగింపు దశకు వచ్చిందనే అనుకుంటున్నా. ఇరాన్‌పై మేము దాడి చేయకపోయి ఉంటే.. ఇప్పుడు మీరు ఇరాన్‌ను అణ్వాయుధాలు గల దేశంగా చూసేవారు. వాళ్ల వద్ద అణ్వాయుధం గనుక ఉంటే.. అందరూ వారిని సర్‌ అని పిలుస్తూ భయపడాల్సి వచ్చేది’ అని పేర్కొన్నారు. ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేయలేదని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ తనకు లేఖ రాశారని ట్రంప్‌ చెప్పారు. హోర్ముజ్‌ జలసంధిని శాశ్వతంగా తెరిచి ఉంచే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. దానివల్ల చైనా అధికంగా సంతోషిస్తుందని, ప్రపంచమంతటికీ గొప్ప మేలు జరుగుతుందని అన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత చమురు ధరలు భారీగా తగ్గుతాయని తెలిపారు. నాటో కూటమిపై ట్రంప్‌ మరోసారి విరుచుకుపడ్డారు. ఆ కూటమి తమకు గతంలో సాయపడలేదని, భవిష్యత్తులోనూ ఎలాంటి సాయం చేయబోదని అన్నారు. యుద్ధం ముగింపు దశకు వచ్చిందని ట్రంప్‌ ప్రకటించగా, పశ్చిమాసియాకు మరో 10 వేల మంది సైనికులను పంపుతున్నట్లు ఆ దేశ అధికారులు తెలపటం గమనార్హం. యుద్ధం ముగింపునకు ఇస్లామాబాద్‌లో త్వరలో రెండో దఫా చర్చలు జరిగే అవకాశం ఉందని ట్రంప్‌ మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, ఈ చర్చల కోసం అమెరికా రెండు షరతులు పెట్టినట్లు ఇజ్రాయెల్‌ మీడియా తెలిపింది. చర్చలు ప్రారంభం కావాలంటే ఇరాన్‌ ముందుగా హోర్ముజ్‌ను పూర్తిగా తెరవాలని మధ్యవర్తుల ద్వారా సమాచారం ఇచ్చినట్లు పేర్కొంది. చర్చలకు ఇరాన్‌ రాజకీయ ప్రతినిధులే రావాలని, వారు ఐఆర్‌జీసీ నుంచి శాంతి ఒప్పందంపై సంతకం చేసేందుకు పూర్తి అధికారాలు పొంది రావాలని మరో షరతు పెట్టినట్లు తెలిపింది. మరోవైపు మొదటి దఫా చర్చలు విఫలమైనప్పటికీ ఇరాన్‌- అమెరికా మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరికొంత కాలం పొడిగించేందుకు చర్చల మధ్యవర్తులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పాకిస్థాన్‌ సైన్యాధ్యక్షుడు అసిమ్‌ మునీర్‌, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహిసిన్‌ నఖ్వీ బృందం చర్చల కోసం బుధవారం ఇరాన్‌ చేరుకుంది.


హోర్ముజ్‌ను దాటిన 20 నౌకలు?

హోర్ముజ్‌ జలసంధిని అమెరికా నౌకాదళం దిగ్బంధించినా కొన్ని నౌకలు రాకపోకలు సాగిస్తున్నాయని సెంట్‌కామ్‌ సంస్థ నివేదికను ఉటంకిస్తూ అమెరికా మీడియా తెలిపింది. జలసంధి గుండా ఒక్క నౌకను కూడా వెళ్లనివ్వలేదని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ప్రకటించగా, దిగ్బంధం తర్వాత మొదటి 24 గంటల్లోనే 20 నౌకలు వెళ్లాయని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వార్తా సంస్థ తెలిపింది. ఇరాన్‌ నౌకలు తప్ప మిగతావాటిని వదిలేస్తున్నారని పేర్కొంది. అమెరికా ఆంక్షలున్న రిచ్‌ స్టేరీ చమురు నౌక జలసంధిని దాటేందుకు ప్రయత్నించగా అమెరికా నేవీ దానిని తిప్పి పంపింది. కాగా, భారతీయ ఎల్పీజీ ట్యాంకర్‌ జగ్‌ విక్రమ్‌ 20,400 మెట్రిక్‌ టన్నుల ఎల్పీజీతో బుధవారం గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు చేరింది. మరోవైపు దిగ్బంధనాన్ని ఆపకపోతే పర్షియన్‌ గల్ఫ్‌, ఒమన్‌ సము ద్రం, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల రాకపోకలను పూర్తిగా అడ్డుకుంటామని ఇరాన్‌ జాయింట్‌ మిలిటరీ కమాండ్‌ కమాండర్‌ అలీ అబ్దుల్లాహీ హెచ్చరించారు. ఇదిలా ఉండగా వాషింగ్టన్‌లో తమ విదేశాంగ మంత్రి మార్కో రుబియో సమక్షంలో ఇజ్రాయెల్‌, లెబనాన్‌ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో కీలక ముందడుగు పడిందని అమెరికా అధికారులు తెలిపారు. ఈ రెండు దేశాలు ప్రత్యక్ష్యంగా చర్చలు జరిపేందుకు అంగీకరించాయని వెల్లడించారు.

యుద్ధంతో మాకేం లాభం లేదు

ఇరాన్‌తో యుద్ధం తమకు ఏ విధంగానూ లాభదాయకం కాదని ఎక్కువమంది అమెరికా ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. అధ్యక్షుడు ట్రంప్‌ సొంతపార్టీ రిపబ్లికన్‌ సభ్యుల్లోనే 24 శాతం మంది యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఇప్సోస్‌, రాయిటర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో తేలింది. మొత్తంగా సర్వేలో పాల్గొన్నవారిలో 51 శాతం మంది ఈ యుద్ధంతో తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, పైగా అధిక దరల భారం మోయాల్సి వస్తుందని తెలిపారు.

Updated Date - Apr 16 , 2026 | 03:35 AM