ప్రతీకారం తీర్చుకుంటాం!
ABN , Publish Date - Mar 13 , 2026 | 03:59 AM
తమ దేశంపై దాడులు చేపట్టిన ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ప్రకటించారు.
పశ్చిమాసియాలోని స్థావరాలన్నీ అమెరికా ఖాళీ చేయాల్సిందే
హోర్ముజ్ జలసంధి మూసివేసే ఉంటుంది
శత్రువుల నుంచి పరిహారం వసూలు చేస్తాం
గల్ఫ్ దేశాలతో స్నేహం.. ఆ దేశాల్లోని అమెరికా బేస్‌లపై దాడులు ఆగవు: మొజ్తాబా ఖమేనీ
అరబ్ దేశాలపై కొనసాగిన ఇరాన్ దాడులు
కొత్తగా ఆత్మాహుతి బోట్ల వినియోగం
ఇరాక్ తీరంలో జరిగిన దాడిలో భారతీయుడి మృతి
దుబాయ్/వాషింగ్టన్/న్యూఢిల్లీ, మార్చి12: తమ దేశంపై దాడులు చేపట్టిన ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ప్రకటించారు. గల్ఫ్ అరబ్ దేశాలపై తమ దాడులు, హోర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈమేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తన తండ్రి స్థానంలో సుప్రీంలీడర్‌గా ఎన్నికైన తర్వాత మొజ్తాబా ఖమేనీ నుంచి వెలువడిన తొలి ప్రకటన ఇదే కావడం గమనార్హం. ఇరాన్ అధికారిక టీవీ ఈ వివరాలను వెల్లడించింది. మినాబ్ పాఠశాలలో 165 మంది చిన్నారులు సహా యుద్ధంలో మరణించిన ఇరాన్ ప్రజలందరి తరపున ప్రతీకారం తీర్చుకుంటామని మొజ్తాబా ఖమేనీ ప్రకటించారు. పశ్చిమాసియా ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలన్నీ వెంటనే మూసివేయాలని.. అప్పటివరకు తమ దాడులు కొనసాగుతాయని తెలిపారు. ఇరుగుపొరుగు దేశాలతో సత్సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తామని, అయితే ఆయా దేశాల్లోని అమెరికా స్థావరాలపై మాత్రం దాడులు చేస్తామని పేర్కొన్నారు. యుద్ధానికి సంబంధించి తమ శత్రువుల నుంచి ఇరాన్ పరిహారం పొందుతుందని.. ఒకవేళ వాళ్లు ఇవ్వకపోతే వారి ఆస్తుల నుంచి తామే తీసుకుంటామని లేదా వాటిని నాశనం చేస్తామని వ్యాఖ్యానించారు. ఇరాన్‌ను కాపాడుకోవడానికి ముందుండి పోరాడుతున్న మిలిటరీకి కృతజ్ఞతలు తెలిపారు. యెమెన్‌లోని హుతీలు, ఇరాక్‌లోని సాయుధ మిలీషియాలు ఇరాన్‌కు మద్దతుగా నిలిచాయని గుర్తుచేసుకున్నారు. యుద్ధంలో నష్టపోయిన ఇరాన్ ప్రజలను ఆదుకునేందుకు ఆర్థిక పరంగా, ఇతరత్రా సహాయం అందిస్తామని వెల్లడించారు. ప్రజలంతా విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా ఇరాన్‌పై దాడి కోసం తీసుకున్న తప్పుడు నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశ్చాత్తాపపడే వరకు తాము వెనక్కి తగ్గబోమని ఇరాన్ సుప్రీం సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లరిజని పేర్కొన్నారు.
ఆగని దాడులు.. పేలుళ్లు..
ఇజ్రాయెల్, అమెరికా గురువారం ఇరాన్‌వ్యాప్తంగా విస్తృత దాడులు చేశాయి. గల్ఫ్ దేశాల్లోని పలు ప్రాంతాల పై, ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు చేసింది.
ఇరాక్‌లో అమెరికా సైనిక స్థావరం ఉన్న ఎర్బిల్‌పైకి ఇరాన్ డ్రోన్లు దూసుకువచ్చాయి. వాటిని రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నట్టు స్థానిక కుర్దిష్ ప్రభుత్వం ప్రకటించింది.
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడులు జరిగి పేలుళ్లు సంభవించాయి. ఇక ఒక పౌర ఆవాసంపైనా డ్రోన్ దాడి జరిగిందని, ఇద్దరు గాయపడ్డారు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు ఆగ్నేయంగా ఉన్న పర్చిన్ మిలటరీ కాంప్లెక్స్‌లోని టలిఘాన్ అణుకేంద్రాన్ని ధ్వంసం చేశామని.. ఇరాన్ అణ్వస్త్రాల అభివృద్ధి కోసం అవసరమైన వ్యవస్థలు ఈ కేంద్రంలోనే ఉన్నాయని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రకటించింది.
ఎంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా తాము ఇరాన్‌ను వదిలి వెళ్లేది లేదని రష్యా అణు సంస్థ రోసటామ్ ప్రకటించింది. ఇరాన్ రేవుపట్టణం బుషెహర్‌లో అణు విద్యుత్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్న ఆ సంస్థ.. అక్కడ మరో 2 యూనిట్ల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్టు తెలిపింది. ఇరాన్‌లో మొత్తం 8 అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మించేందుకు రోసటామ్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో మృతుల సంఖ్య 687కు చేరిందని, అందులో 98 మంది పిల్లలు ఉన్నారని ఆ దేశ సమాచార శాఖ వెల్లడించింది.
ఇరాన్‌లో ఇప్పటివరకు 6వేల లక్ష్యాలపై దాడి చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ గురువారం వెల్లడించింది. 60 నౌకలను, సముద్ర మందుపాతరలు అమర్చే 30 మైన్‌లేయింగ్ బోట్లను ధ్వంసం చేశామని తెలిపింది.
తమ మయూరీ నారీ నౌకపై చేసిన దాడికి క్షమాపణ చెప్పాలని ఇరాన్‌ను థాయ్‌లాండ్ డిమాండ్ చేసింది. ఆ నౌకపై దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది మృతిచెందిన సంగతి తెలిసిందే.
మార్చి 28 వరకు దుబాయ్‌కు తమ సర్వీసులన్నీ నిలిపివేస్తున్నట్టు జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. డచ్ ఎయిర్‌లైన్స్ సంస్థ కేఎల్‌ఎం కూడా దుబాయ్‌కు సర్వీసులు ఆపేస్తున్నట్టు తెలిపింది.
హోర్ముజ్‌లో చమురు ట్యాంకర్లకు రక్షణ కల్పించలేం: అమెరికా
హోర్ముజ్ జలసంధిని దాటేందుకు చమురు నౌకలకు ప్రస్తుతం ఎలాంటి రక్షణ కల్పించలేమని అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్ రైట్ ప్రకటించారు. ప్రస్తుతం అమెరికా నౌకాదళం దృష్టి అంతా ఇరాన్ దాడి సామర్థ్యాలను దెబ్బతీయడంపైనే ఉందని పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధిని దాటేందుకు చమురు నౌకలకు రక్షణ కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన మాటలకు విరుద్ధంగా క్రిస్ రైట్ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. అయితే ఇరాన్‌పై దాడి కొలిక్కి వచ్చాక ఈ నెలాఖరు నాటికి చమురు నౌకలకు రక్షణ కల్పించే అవకాశం ఉందని వెల్లడించారు.
ఆరు నౌకలపై ఇరాన్ దాడులు
పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో ఈ దాడులు చేయగా.. తాజాగా వాటికితోడు పేలు డు పదార్థాలు నింపిన ఆత్మాహుతి బోట్లతో దాడులు చేపట్టింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు మొత్తం ఆరు వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంది. ఇప్పటివరకు దాడికి గురైన వాణిజ్య నౌకలు, చమురు ట్యాంకర్ల సంఖ్య 16కు చేరింది. అమెరికా, యూరప్ దేశాలకు చెందిన నౌకలు లక్ష్యంగా దాడులు చేపట్టినట్టు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. ఇరాక్‌లోని బస్రా తీరంలో 2 చమురు ట్యాంకర్ నౌకలపై గురువారం తెల్లవారుజామున ఆత్మాహుతి బోట్లతో దాడి జరిగింది. భారీ పేలుళ్లు జరిగి ఆ ట్యాంకర్లు మంటల్లో చిక్కుకున్నాయి. అందులో మార్షల్ ఐలాండ్స్ జెండాతో ప్రయాణిస్తున్న అమెరికా నౌక ‘సేఫ్ సీ విష్ణు’లో ఒక భారతీయుడు మృతిచెందారు. రెండు నౌకల నుంచి మరో 51 మందిని రక్షించారు. ఈ ఘటనతో ఇరాక్‌కు చెందిన అన్ని చమురు టెర్మినల్స్‌లో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇక దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్టుకు సమీపంలో బ్రిటీష్ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో జపాన్ జెండాతో ఉన్న ‘వన్ మెజెస్టీ’ కంటైనర్ నౌకపై, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతంలో జపాన్‌కు చెందిన ఒక చమురు ట్యాంకర్‌పై ఇరాన్ డ్రోన్ దాడులు జరిగాయి.
చరిత్రలో ఎన్నడూ లేనంతగా చమురు రవాణాకు ఆటంకం!
ప్రపంచ చమురు మార్కెట్లకు సంబంధించి చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా అంతరాయం ఎదురవుతోందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) పేర్కొంది. ‘‘పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేతతో గల్ఫ్ దేశాలు ఉత్పత్తిని తగ్గించాల్సి వస్తోంది. దీనితో చమురు ఉత్పత్తి, రవాణాకు సంబంధించి చరిత్రలోనే అతిపెద్ద అంతరాయం ఏర్పడింది. రోజుకు 80 లక్షల బ్యారెళ్ల చమురు, 20 లక్షల బ్యారెళ్ల పెట్రోలియం ఉత్పత్తులు నిలిచిపోయాయి. ఇప్పట్లో ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. చమురు రవాణా ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందనే దానిపైనా స్పష్టత లేదు’’ అని తాజా నివేదికలో వెల్లడించింది.
ఇరాన్‌లో 32 లక్షల మంది నిరాశ్రయులు
అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌లో సుమారు 32లక్షల మంది ఇళ్లు వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చిందని ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ కార్యాలయం ప్రకటించింది. దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, భారీస్థాయిలో మానవతా సాయం అవసరమవుతుందని పేర్కొంది.
లెబనాన్‌ను ఆక్రమించుకుంటాం: ఇజ్రాయెల్
హెజ్బొల్లా దాడులు ఆపకపోతే లెబనాన్ భూభాగాన్ని ఆక్రమించుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ గురువారం హెచ్చరించారు. ఇరాన్‌కు మద్దతుగా వచ్చిన హెజ్బొల్లా లెబనాన్‌లోని పలు ప్రాంతాలు వేదికగా ఇజ్రాయెల్‌పై వరుసగా రాకెట్ దాడులు చేస్తోంది. ఈ క్రమం లో కట్జ్ తీవ్రహెచ్చరికలు చేశారు. ‘‘లెబనాన్ అధ్యక్షుడిని హెచ్చరిస్తున్నాం. మీ ప్రభుత్వం హెజ్బొల్లాను నియంత్రించలేకపోతే.. ఆ భూభాగాన్ని మేం స్వాధీనం చేసుకుని సమస్యను పరిష్కరించుకుంటాం’’అని పేర్కొన్నారు.
ఇరాన్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం లేదు: అమెరికా నిఘా సంస్థలు
ఇరాన్‌లో ప్రభుత్వం ఇప్పట్లో కూలిపోయే అవకాశం లేదని అమెరికా నిఘా సంస్థలు అంచనా వేశాయి. ప్రభుత్వానికి ప్రజలపై ఇప్పటికీ పటిష్టమైన నియంత్రణ ఉందని పేర్కొన్నాయి. కీలక నిఘా వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ ఈ అంశంపై కథనం ప్రచురించింది. అయతుల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత బాధ్యతలు చేపట్టిన నాయకత్వానికి, ఐఆర్‌జీసీకి పాలనపై, ప్రజలపై పూర్తి పట్టు ఉందని, నాయకత్వంలో మంచి సమన్వయం ఉందని నిఘా వర్గాలు వెల్లడించినట్టు పేర్కొంది.
ఆరు రోజులు.. రూ.లక్ష కోట్లు
ఇరాన్‌పై సైనిక చర్య కోసం అమెరికాకు తొలి 6 రోజుల్లోనే రూ.లక్ష కోట్ల (11.3 బిలియన్ డాలర్లు)కుపైగా ఖర్చయింది. యుద్ధం కొనసాగితే జరిగే మొత్తం వ్యయం చాలా భారీగా ఉండనుంది. న్యూయార్క్ టైమ్స్ ఈ వివరాలను వెల్లడించింది. తొలి ఆరు రోజుల్లోని ఈ ఖర్చు కేవలం సైన్యాలు, ఆయుధాల మోహరింపు, నిర్వహణ, దాడులకు వినియోగించిన ఆయుధాల వ్యయం మాత్రమేనని.. గురువారానికి యుద్ధం 13రోజులకు చేరడంతో మొత్తం వ్యయం గణనీయంగా ఉంటుందని పేర్కొంది.